హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమైపోయింది!
తాజాగా రాజస్థాన్ లోని టోంక్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ తన ప్రచారానికి మరింత పదునుపెట్టారు.
By: Tupaki Desk | 23 April 2024 7:57 AM GMTకేంద్రంలో మరోసారి అధికారం సాధించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఉధృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ప్రచారం సాగిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమిపై ప్రధాని నిప్పులు చెరుగుతున్నారు.
తాజాగా రాజస్థాన్ లోని టోంక్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ తన ప్రచారానికి మరింత పదునుపెట్టారు. కాంగ్రెస్ హయాంలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమైపోయిందని మండిపడ్డారు. హనుమాన్ చాలీసా వినడాన్ని క్రైమ్ గా చూశారని ఆరోపించారు.
'కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి పార్టీలు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయి. కొన్ని వర్గాలను ఆ పార్టీలు బుజ్జగిస్తున్నారు. ఈ విషయాన్ని నేను బయటపెట్టినందుకు నన్ను తిడుతున్నాయి' అని ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు.
దేశ సంపదను కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి తాము ఎంపిక చేసుకున్న కొన్ని వర్గాలకే పంచాలనుకుంటోందని ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు చేశారు. దేశ ప్రజల సంపదను కొంతమంది 'ఎంపిక' చేసుకున్నవారికి పంచడానికి ఆయా పార్టీలు కుట్ర పన్నుతున్నాయని తీవ్ర విమర్శలు చేశారు.
తాను నిజాలు చెబుతుంటే కాంగ్రెస్, ఇండియా కూటమికి నచ్చడం లేదని ప్రధాని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ కొన్ని వర్గాలను బుజ్జగిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.
రెండు ఇల్లు ఉంటే ఒక ఇల్లు లాక్కోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని మండిపడ్డారు. ఉద్యోగస్తులకు ఎన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి, వారికి ఎన్ని వాహనాలు ఉన్నాయి?, ఎంత భూమి ఉంది? అనే వివరాలను సేకరించి ప్రజల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది మావోయిస్టులు, కమ్యూనిస్టుల ఆలోచనా ధోరణి అని ధ్వజమెత్తారు.
ఇలాంటి పార్టీలు తమ విధానాలతో ఆయా దేశాలను నాశనం చేశారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్, ఇండియా కూటమి ఈ విధానాన్ని భారత్‌లో అమలు చేయాలని చూస్తోందని విమర్శించారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో మాట్లాడిన ప్రధాని మోదీ అక్కడ కూడా ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు.
దేశం మొత్తం హనుమాన్ జయంతిని జరుపుకుంటున్న రోజున రాజస్థాన్ లో పర్యటించిన ప్రధాని కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసాను చదవడం కూడా నేరమైపోయిందంటూ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.