Begin typing your search above and press return to search.

మోడీ మూడు : సక్సెస్ మూడ్ లేదుగా ?

మరో వైపు చూస్తే బీజేపీ బిగ్ షాట్స్ నరేంద్ర మోడీ అమిత్ షాలు రెండు సార్లు పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపారు

By:  Tupaki Desk   |   16 Jun 2024 3:30 AM GMT
మోడీ మూడు :  సక్సెస్  మూడ్ లేదుగా ?
X

కేంద్రంలో మూడవసారి నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అయింది. ప్రభుత్వం అయితే కొలువు తీరింది కానీ ఆ సక్సెస్ మూడ్ అయితే టోటల్ గా లేదు అని అంటున్నారు. ఒక వైపు బీజేపీ మాతృ సంస్థ ఆరెస్సెస్ బీజేపీ అపజయాలనే ముందుకు తెచ్చి హాట్ కామెంట్స్ చేస్తోంది. ఆరెస్సెస్ చీఫ్ భగవత్ నుంచి కీలక నేతలు అంతా బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. దానికి కారణం అగ్ర నేతల అహంకారం అన్నట్లుగా పరోక్ష విమర్శలు చేస్తున్నారు.

మరో వైపు చూస్తే బీజేపీ బిగ్ షాట్స్ నరేంద్ర మోడీ అమిత్ షాలు రెండు సార్లు పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపారు. ఈసారి వారికి కొత్త అనుభవంగా ఉంది. మ్యాజిక్ ఫిగర్ కి 32 సీట్ల తేడాతో బీజేపీ ఉంది. దాంతో టీడీపీ జేడీయూ ల వంటి పార్టీల ఊతకర్రతో ప్రభుత్వాన్ని నడపడం అంటే ఇబ్బందిగానే ఉంటుంది.

ఇంకో వైపు చిన్న నంబర్ కలిగిన పార్టీలు కూడా ఎన్డీయే మిత్రులు గా ఉంటూ వస్తున్నాయి. ఈ పార్టీలు కూడా మోడీ మంత్రివర్గం కూర్పు మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. శివసేనను చీల్చి అసలైన శివసేనగా గుర్తు తీసుకుని మహారాష్ట్ర సీఎం గా ఉన్న ఏక్ నాధ్ షిండే పార్టీకి ఏడుగురు ఎంపీలు ఉన్నారు. అందులో నుంచి కేంద్ర మంత్రిగా ఒకరికి చాన్స్ ఇచ్చారు. అయితే సరైన పోర్టు ఫోలియో ఇవ్వలేదని షిండే అసహనంగా ఉన్నారని అంటున్నారు.

ఇక ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కూడా కేంద్ర ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉంది. ఒకే ఒక్క ఎంపీగా ప్రఫుల్ పటేల్ గెలిస్తే ఆయనకు సహాయ మంత్రి ఇస్తామని చెప్పారు. దానికి తిరస్కరించారు. రాజ్యసభలో తమకు నలుగురు ఎంపీలు ఉన్నారు అని అజిత్ పవార్ గుర్తు చేస్తున్నారు. తమను చిన్న చూపు చూస్తున్నారు అని అంటున్నారు.

ఇక నితీష్ కుమార్ కి బీహార్ లో ప్రత్యేక హోదా సెగ తప్పడంలేదు. ఆయన స్పీకర్ పదవిని జేడీయూకు ఇవ్వమని ఎన్డీయే ప్రభుత్వ పెద్దల మీద ఒత్తిడి తెస్తున్నారు. అదే స్పీకర్ పదవితో పాటు ఏపీకి రావాల్సిన ఆర్ధిక ప్రయోజనాల గురించి టీడీపీ కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. ఈసారి మోడీ మంత్రివర్గం 71గా ఉంటే అందులో మిత్రులకు ఇచ్చినవి 11 మంత్రి పదవులు మాత్రమే. వీటిలో కూడా అయిదుగురుకే కేబినెట్ ర్యాంక్ హోదా ఇచ్చారు.

ఒక వైపు తాము అనుకున్న విధంగా ప్రభుత్వం సాగదని ప్రతీ దానికీ మిత్రుల నుంచి అనుమతి పొందాల్సి రావడం బీజేపీ పెద్దలకు కూడా ఇబ్బందిగానే ఉంది అంటున్నారు. ఎన్నికల ముందు ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లు రద్దు అని బీజేపీ నేతలు సభల్లో చెప్పారు. తన కంఠంలో ప్రాణం ఉండగా రిజర్వేషన్లు అమలు చేయనివ్వను అని మోడీ కూడా గట్టిగా అన్నారు.

కానీ ఇపుడు రద్దు చేయగలరా అన్నది ప్రశ్నగా ఉందిట. ఎందుకంటే రద్దుకు టీడీపీ జేడీయూ పూర్తిగా వ్యతిరేకం అని అంటున్నారు. అదే విధంగా కామన్ సివిల్ కోడ్ కి ఈసారి అమలు తప్పదని అనుకున్నారు. కానీ అది కూడా అటకెక్కే చాన్స్ ఉంది అని అంటున్నారు. ఈ విషయంలోనూ బీజేపీకి మిత్రుల నుంచి సహకారం ఉండదని తెలుస్తోంది.

జమిలి ఎన్నికలు అంటే మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నాయకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈసారి అధికారంలోకి వస్తే 2029 నాటికి జమిలి ఎన్నికలు తప్పవని కూడా చెప్పారు. ఇపుడు చూస్తే అది కూడా సాకారం అయ్యే సూచనలు లేవు అని అంటున్నారు. అదే విధంగా కులగణన జరపాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది.

అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించినా కొత్తగా జనాభా లెక్కలు చేసిన తరువాతనే అమలు చేయాలని మిత్రుల నుంచి డిమాండ్ వస్తోంది. ఇలా అనేక అంశాలల్లో పొత్తు కుదిరే చాన్స్ తక్కువగా ఉంది అని అంటున్నారు. గతంలో బీజేపీ అనుకున్నదే చేసుకుని వెళ్ళింది. ఇపుడు లోక్ సభలోనే మెజారిటీ లేదు, రాజ్యసభలో అదే పరిస్థితి పైగా ప్రభుత్వం లో టీడీపీ జేడీయూల పెత్తనం ఉంది అని అంటున్నారు.

ఎపుడు ఏమి జరుగుతుందో తెలియదు అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయిఏ ఒక అపశకునం పలికారు. ప్రధాని మోడీ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని ఆయన జోస్యం చెప్పారు. బెంగళూరులో ఖర్గే మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎన్డీయే ప్రభుత్వం పొరపాటున ఏర్పాటైంది అనడం విశేషం.

ఇక మీదట మోడీకి ఆదేశించే అవకాశం లేదు. ఇది మైనార్టీ ప్రభుత్వం అని కూడా ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు అని ఆయన బాంబు పేల్చారు. అయితే ఈ ప్రభుత్వం కొనసాగాలని మేము కోరుకుంటున్నామని ఆయన సన్నాయి నొక్కులూ నొక్కుతున్నారు. ఇదే మాటను శివసేన ఉద్ధవ్ ఠాక్రే కూడా అంటున్నారు. తొందరలోనే మోడీ సర్కార్ కూలిపోవచ్చు అని ఆయన చెబుతున్నారు.

ఈ ఇద్దరే కాదు చాలా మందికి డౌట్లు ఉన్నాయి. దానికి కారణం వాజ్ పేయి ఎన్డీయే సారధి కాదు, ఆయన ఏకంగా 26 పార్టీలతో అతి పెద్ద సంకీర్ణాన్ని విజయవంతంగా నాలుగున్నరేళ్ల పాటు నడిపారు. మోడీ అమిత్ షాలకు సంకీర్ణ ప్రభుత్వం నడపడం ఇదే ఫస్ట్ టైం. ఇక చంద్రబాబు నితీష్ కుమార్ ల వైఖరి మీదనే విపక్షాలు ఆశతో ఉన్నాయి. ఈ మొత్తం పరిణామాలు చూసినపుడు కేంద్రంలో మూడోసారి ప్రధాని అయ్యాను అన్న రికార్డు కోసం మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కానీ ఆ సంబరాల మూడ్ అయితే లేదనే మాట ఢిల్లీ సర్కిల్స్ లో వినిపిస్తోంది.