మోదీ 1..2.. 3 తెలంగాణ టూర్
అలాంటిది మోదీ అక్టోబరు 1న, 3న తెలంగాణకు రానున్నారు. అంటే రెండు రోజుల్లో రెండుసార్లు పర్యటిస్తారు. వాస్తవానికి మోదీ తెలంగాణ పర్యటనను అక్టోబరు 2న అనుకున్నారు.
By: Tupaki Desk | 27 Sep 2023 9:03 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట జాతీయ పార్టీల అగ్రనేతలు పర్యటనలు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే వర్కింగ్ కమిటీ భేటీ అనంతరం హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన తుక్కగూడ బహిరంగ సభ విజయవంతమైంది. దీంతోనే తాము కూడా బహిరంగ సభ పెట్టాలని ఇతర పార్టీలు భావించడంలో తప్పులేదు. అయితే, ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ అయితే చేపట్టలేదు. కానీ, బీజేపీ మాత్రం ఆ ప్రయత్నాలు చేస్తోంది.
అంతేగాక ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణకు రప్పిస్తోంది. బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవానికి హాజరయ్యారు. ఇక మోదీ రాక మిగిలింది.
రెండు రోజుల్లో రెండుసార్లు ప్రధాని మోదీ పర్యటన అంటే మామూలు కాదు. అందులోనూ భద్రతాపరంగా భారీ సన్నాహాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకనే మోదీ స్థాయి వ్యక్తి తరచూ ఒకే రాష్ట్రాన్ని సందర్శించడం కుదరదు. కానీ, తెలంగాణకు మాత్రం రెండు రోజుల వ్యవధిలో రెండుసార్లు రానున్నారు. అంతేకాదు రెండు బహిరంగ సభల్లోనూ పాల్గొననున్నారు.
2 కాదు 1.. 3 మోదీ ప్రస్తుతం రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల వ్యూహంలో బిజీగా ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం మధ్యప్రదేశ్ లో, సాయంత్రం రాజస్థాన్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీన్నిబట్టే ఆయన ఏ స్థాయిలో ప్రచారం చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అలాంటిది మోదీ అక్టోబరు 1న, 3న తెలంగాణకు రానున్నారు. అంటే రెండు రోజుల్లో రెండుసార్లు పర్యటిస్తారు. వాస్తవానికి మోదీ తెలంగాణ పర్యటనను అక్టోబరు 2న అనుకున్నారు. కానీ, అది ఒక రోజు ముందుకు జరిగింది. ఇప్పుడు దానికి ఒక రోజు విరామంతో మరో రోజు జత చేరింది.
పాలమూరు, నిజామాబాద్ ముందుగా అనుకున్నట్లయితే.. 2న మోదీ పాలమూరులో బహిరంగ సభలో పాల్గొనాలి. దానిని 1వ తేదీకి జరిపారు. అయితే, అటునుంచి అదే రోజు ఆయన నిజామాబాద్ కు వెళ్తారని అంచనా బీజేపీ వర్గాలు తెలిపాయి. కానీ, ఇప్పుడు ఆ పర్యటన రెండు పర్యటనలుగా మారింది. కాగా, నిజామాబాద్ లో బీజేపీ ఎంపీ అర్వింద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహబూబ్ నగర్ లో ఏపీ జితేందర్ రెడ్డి వంటి కీలక నేత ఉన్నారు.ఈ నేపథ్యంలోనే రెండు చోట్ల మోదీ పర్యటన ఏర్పాటు చేశారు. అంతేగాక.. వర్గపరంగానూ ఈ రెండు నియోజకవర్గాలు చాలా కీలకం. మోదీ వస్తే అక్కడ పార్టీకి ఊపు వస్తుందనే అంచనాలో బీజేపీ వర్గాలు ఉన్నాయి. ఏదేమైనా తెలంగాణకు మోదీ రెండు రోజుల్లో రెండుసార్లు రానుండడం గమనార్హమే.