Begin typing your search above and press return to search.

మోడీని అర్థం చేసుకోవటానికి ప్రాశ్చాత్య దేశాలు రెఢీగా లేవా?

మా దారిలోనే నడవండి.. మేం గుర్తిస్తాం. ప్రపంచంలోని అభివృద్ధి దేశాలకు ఉండే అలవాటు. ప్రపంచదేశాల్లో సంపన్న దేశాలు కాసిన్ని మాత్రమే.

By:  Tupaki Desk   |   24 Aug 2024 3:42 AM GMT
మోడీని అర్థం చేసుకోవటానికి ప్రాశ్చాత్య దేశాలు రెఢీగా లేవా?
X

మా దారిలోనే నడవండి.. మేం గుర్తిస్తాం. ప్రపంచంలోని అభివృద్ధి దేశాలకు ఉండే అలవాటు. ప్రపంచదేశాల్లో సంపన్న దేశాలు కాసిన్ని మాత్రమే. డబ్బులున్నోడికి.. లేనోడు చులకనే. వ్యక్తి అయినా దేశమైనా ఒకే తీరు. అందులో ఎలాంటి మార్పు ఉండదు. ట్రెండ్ ను సెట్ చేయటానికి తాము ఉన్నప్పుడు.. మీరెవరు కొత్త మార్క్ చూపించటానికి అన్నట్లుగా కనురెప్పలు ఎగరేస్తుంటారు. నిత్యం ఏదో ఒక రాజకీయ రచ్చతో కిందా మీదా పడే దేశంగా భారత్ ఉండాలని కోరుకోవటం ప్రాశ్చాత్య దేశాలకు తప్పేం కాదు.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం పేదరికంతో అలమటిస్తూ.. బలహీనంగా ఉంటే.. బలమున్న దేశాలకు అంతకు మించిన ఆనందం ఏముంటుంది? సంపన్న దేశాలతో స్నేహం కోసం తహతహలాడుతూ.. సాయం కోసం ఆర్థించే చేతులు తమ వైపు చూస్తున్నప్పుడు సంపన్న దేశాలకు ఉండే సంతోషం అంతా ఇంతా కాదు. రాజకీయ సంక్షోభంతో కిందా మీదా పడుతూ.. ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికే తమకున్న శక్తిని ఖర్చు పెట్టే నాయకత్వం ఉన్నప్పుడు సంపన్న దేశాలు మరింత హ్యాపీగా ఉంటాయి మరి.

అలాంటి తీరుకు భిన్నంగా దేశాన్ని శక్తివంతంగా మార్చేస్తూ.. తాను శక్తివంతుడినైపోతూ.. తన నాయకత్వానికి తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తూ.. ఎదుటోడి ఇంట్లోనూ వేలు పెట్టేంత స్థాయిని భారత్ లాంటి దేశం తెచ్చుకుంటే సంపన్న దేశాలకు ఒళ్లు మండకుండా ఉంటుందా? మోడీ మీద సవాలచ్చ విమర్శలు చేయొచ్చు. కానీ.. దేశాన్ని శక్తివంతంగా చేసిన క్రెడిట్ ఆయనకు దక్కాల్సిందే. అటు అమెరికా కావొచ్చు.. ఇటు చైనా కావొచ్చు.. మనల్ని చూసి అసూయ పడే పరిస్థితులు ఇప్పుడు మొదలయ్యాయని చెప్పక తప్పదు.

అలా అని మన బలం భారీగా పెరగిందనుకోవటం తప్పే అవుతుంది. కాకుంటే.. గతంతో పోలిస్తే గడిచిన పదేళ్లలో పరిస్థితుల్లో మార్పులు కొట్టొచ్చినట్లు కనిపించే పరిస్థితి. ఒక నాయకుడు దేశ ప్రధానిగా పదేళ్లు నాన్ స్టాప్ గా పాలించటం.. మరో ఐదేళ్ల పాలనకు శ్రీకారం చుట్టిన వైనం చాలామందికి కంటగింపుగా ఉంటుంది. ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నిత్యం సాయం కోసం ఆదారపడటమే తప్పించి.. వేరే విషయాల్లోకి కలుగజేసుకోవటానికి ఇష్టపడని తీరుకు భిన్నంగా ప్రధాని నరేంద్రమోడీ తీరు ఉంటుందని చెప్పాలి. అలాంటప్పుడు ప్రాశ్చాత్య దేశాలకు కంటగింపుగానే ఉంటుంది.

ఇదే.. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చే ఆత్మీయ ఆలింగనంపై ఏదో ఒక మాట మాట్లాడేస్తుంటారు. మిగిలిన వారి మాదిరి కాకుండా.. తనకంటూ ప్రత్యేక స్థానాన్ని కోరుకునే తీరు మోడీలో కనిపిస్తూ ఉంటుంది. ఆ మాటకు వస్తే అదేం తప్పు కూడా కాదు. అలాంటి తీరు ఉండటం కూడా మంచిదే. అప్పుడే కదా.. నలుగురికి భిన్నంగా ఉండేందుకు ప్రయత్నాలు జరుగుతాయి.

రష్యాకు వెళ్లి పుతిన్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న చేతులతోనే.. రష్యా శత్రువు ఉక్రెయిన్ దేశాధ్యక్షుడ్ని సైతం తన ఆత్మీయ ఆలింగనంతో హత్తుకున్న వైనం చూసినప్పుడు.. మోడీ మిగిలిన వారికి భిన్నంగా కనిపిస్తారు. ప్రపంచంలో ఇంత మంది దేశాధినేతలు.. దేశాధ్యక్షులు ఉన్నప్పటికీ.. రెండు శత్రు దేశాల అధినేతలతో ఒకేతీరును ప్రదర్శించే సామర్థ్యం ఉన్న ఏకైక అధినేతగా ప్రధాని నరేంద్ర మోడీని చెప్పాలి. విదేశీ మిత్రుల్ని కలిసిన సందర్భంలో తన మార్క్ ను ప్రదర్శించటానికి మోడీ అస్సలు వెనుకాడరు. ఒక దేశాధినేత భుజం మీద చెయ్యి వేయటానికి కాస్తంత సంకోచిస్తారు. కానీ.. మోడీ అలా కాదు. తనలోని మిత్రుడ్ని ప్రదర్శించటానికి ఆయన అలాంటి చర్యలు ఎలాంటి మోహమాటం లేకుండా చేస్తారు. ఇలాంటి తత్త్వం ప్రాశ్చాత్య దేశాలకు ఒక పట్టాన మింగుడుపడదు. అందుకే.. ఆయన్ను విమర్శించటానికే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు.

మొదట్లో చెప్పుకున్నట్లు.. ఏం జరిగినా.. ఏం చేసినా.. ఎలాంటి ముద్ర వేసినా.. దాని వెనుక తాము కనిపించాలన్న తపన సంపన్న దేశాలకు ఉంటుంది. అందుకు భిన్నంగా.. మోడీ వ్యవహరిస్తున్నప్పుడు ఆయనపై ఏదో ఒక మాట అనేసే పరిస్థితి. ఇలాంటి తీరును పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రాశ్చాత్య దేశాల్ని మనల్ని.. మన ప్రధానిని ఉద్దేశించి ఏదైనా మాట్లాడుతున్నారంటే.. వారికి బాగానే మంట పుట్టిందన్నది అర్థం.

ఏమైనా.. ప్రాశ్చాత్యుల్ని ఫాలో కావటానికి అస్సలు ఇష్టపడని మోడీ.. తనదైన ముద్రను తనకు నచ్చిన రీతిలో వేయటానికి ఇష్టపడే మోడీ ఏం చేసినా అది దేశ హతం కోసమేనన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే.. ఆయన ఆత్మీయ ఆలింగనాన్ని ఎవరైనా వేలెత్తి చూపించి ఎటకారం చేస్తే.. దానికి బదులుగా రియాక్షన్ అంతే ధీటుగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే.. వారి తీరులోనే వారికి సమాధానం చెబితేనే కదా.. వారికి బాగా అర్థమయ్యేది.