Begin typing your search above and press return to search.

మోడీది బడ్జెట్ నా బిజినెస్ నా ?

కేంద్రంలో వరసగా మూడోసారి ప్రధాని అయిన నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలి బడ్జెట్ ని విడుదల చేసింది.

By:  Tupaki Desk   |   24 July 2024 1:30 AM GMT
మోడీది బడ్జెట్ నా బిజినెస్ నా ?
X

కేంద్రంలో వరసగా మూడోసారి ప్రధాని అయిన నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలి బడ్జెట్ ని విడుదల చేసింది. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఈ బడ్జెట్ లో మెరుపులు ఎన్డీయే పార్టీ పక్షాలు చెప్పుకుంటారు. విరుపులు విపక్షాలు గట్టిగానే చెబుతాయి. ఇంతకీ మోడీ బడ్జెట్ అంటే ఎలా ఉంది ఆ బడ్జెట్ వెనక ఉన్నది దేశ హితానికా లేక రాజకీయమా లేక వివక్ష లేక ఇండియా కూటమి నేతలు ఆరోపించినట్లుగా కొన్ని రాష్ట్రాల మీద కక్ష కట్టినట్లుగా ఉంటుందా అంటే ఎవరికి తోచిన తీరున వారు జవాబు చెప్పుకోవచ్చు.

అయితే సాధారణంగా ఒక విషయం ఉంది. దేశంలోనే కాదు అంతర్జాతీయంగా చూసినా కూడా గుజరాతీయులు అంటే బిజినెస్ మైండ్ ఎక్కువగా ఉంటుందని అంటారు. ఈ మాట చాలా మంది అంటూంటారు. అది అన్ని విషయాల్లో అన్ని వేళలలో కనిపిస్తుంది అని కూడా అంటారు.

అదే తీరు మోడీ తాజా బడ్జెట్ లో కనిపించిందా అంటే అవును అని అంటున్నారు. ఈ బడ్జెట్ లో ప్రజలతో బిజినెస్ టాక్టీస్ చేసినట్లుగా ఉంది. అదెలా అంటే ఇన్ కం టాక్స్ ఒక లక్ష స్లాబ్ పెంచి అక్కడికి అదేదో పెద్దగా చేసినట్లు చూపిస్తున్నారు అని కామెంట్స్ పెడుతున్నారు. ఇది ఒక విషయం అయితే బీహార్ రాష్ట్రానికి ఎంత మేరకు బడ్జెట్ లో నిధుల కేటాయింపు చూపించారో తెలియదు కానీ ఇండియా కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రం సున్నం బొట్ట్లు పెట్టారని అంటున్నారు.

అంటే వారికి ఎక్కడా పైసలు విదల్చలేదని అంటున్నారు. ఆయా రాష్ట్రాలతో రాజకీయ అవసరాలు లేవని అలా చేశారా అని అంటున్నారు. అంతే కాదు అక్కడ ఎంత ఇచ్చినా ఇండియా కూటమి పార్టీలకే మొగ్గు ఉంటుందని భావించి వద్దు అనుకున్నారా అన్నది కూడా ప్రశ్నగా ఉంది. ఇక అవసరం అయితేనే ఆయా రాష్ట్రాలకు డబ్బులు ఇస్తామన్నట్లుగా కూడా ఈ బడ్జెట్ చూస్తే వ్యవహరించినట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు.

అవసరం అంటే ఎన్నికల అవసరాలు అన్న మాట. ఆయా రాష్ట్రాలలో ఎన్నికలు ఉంటే బడ్జెట్ కేటాయింపులు ఆటోమేటిక్ గా జరిగిపోతాయని అంటున్నారు. లేవు అంటే వారిని అలా సైడ్ చేస్తారని అంటున్నారు. ఇవన్నీ చూసిన తరువాత బడ్జెట్ లో కూడా ఈ విధంగా లెక్కలు చూసుకుంటూ అవసరాలు అన్నీ కొలుచుకుంటూ ఎక్కడికక్కడ తూకం వేసుకుంటూ అచ్చం బిజినెస్ మాదిరిగా డబ్బులు కేటాయిస్తారా అన్న చర్చ అయితే అంతటా సాగుతోంది.

ప్రజా స్వామ్య దేశంలో ప్రతీ పౌరుడూ కట్టిన రూపాయి పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్తుంది. మళ్లీ ఆ రూపాయిలో ఎంతో కొంత ఆయా రాష్ట్రానికి పెద్దన్నగా ఇవ్వాల్సిన ధర్మం రాజ్యంగ విధి కేంద్రానికి ఉంటుంది. అయితే రాను రానూ పాలకులు అలా చేయడం లేదు. తమకు లాభం ఉంటే విదిలిస్తున్నారు. అందుకే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇది కుర్చీని కాపాడుకునే బడ్జెట్ అని ఎకసెక్కమాడారు.

గత పదేళ్లుగా ఏపీ వైపు చూడని కేంద్ర బడ్జెట్ ఇపుడు కేంద్రంలో ప్రభుత్వం కాపాడుకోవడానికి టీడీపీ కోసం ఎంతో కొంత చేసినట్లుగా చూపిస్తున్నారు అని అంటున్నారు. అలాగే బీహార్ లో సైతం నితీష్ కుమార్ జేడీయూ ఉంది. దాంతో అక్కడ మిత్ర పక్షాన్ని సంతృప్తి పరచడం కోసం ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. ఈ విధంగా చేస్తే మాత్రం అది దేశ హితానికి మంచిది కాదని అన్ని రాష్ట్రాలకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వాలని వెనకబడిన రాష్ట్రాలకు ఆర్ధిక ఊతం ఇవ్వాలని అదే రాజ్యాంగ స్పూర్తి అని మేధావులు సూచిస్తున్నారు.