ఈయన్ని గుర్తు పట్టారా? అప్పట్లో కింగ్.. ఇప్పుడు జైల్లో.. ఎందుకు?
తప్పుడు పనులు చేస్తే ఇలాంటి తిప్పలు తప్పవు మరి. ఈ ఫోటోలోని వ్యక్తిని చూసినంతనే గుర్తు పట్టటం కష్టం
By: Tupaki Desk | 25 Jan 2024 9:24 AM GMTతప్పుడు పనులు చేస్తే ఇలాంటి తిప్పలు తప్పవు మరి. ఈ ఫోటోలోని వ్యక్తిని చూసినంతనే గుర్తు పట్టటం కష్టం. ఒకప్పుడు గంభీరత్వం.. అంతకు మించి రాజసంతో తొణికిలాడే ఆయన.. ఇప్పుడు దయనీయంగా.. అయ్యోపాపం అన్నట్లుగా ఉన్న ఆయన ఇప్పటికైనా గుర్తుకు వచ్చారా? బ్యాంకుల వద్ద అప్పులు తీసుకొని వాటిని కట్టకుండా ఎగవేతకు పాల్పడిన జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్. నాలుగు నెలలుగా ముంబయిలోని అర్థర్ రోడ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆయన.. తన ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో తనకు ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేసుకోవటానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరటం తెలిసిందే.
ప్రత్యేక కోర్టుకు హాజరయ్యేందుకు జైలు బయటకు వచ్చిన ఆయన్ను జాతీయ మీడియాకు చెందిన వారు ఫోటోలు తీశారు. ఆయన్ను చూసినంతనే ఆశ్చర్యానికి గురవుతున్నారు. నాలుగు నెలల వ్యవధిలోనే పదేళ్ల వయసు మీద పడినట్లుగా మారిన ఆయన.. బలహీనంగా ఉండటమే కాదు.. సాయం లేకుండా నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు.
ఒకప్పుడు ఆయన చిటికె వేస్తే చాలు ఏదైనా ఆయన ముందు వాలేది. అలాంటి ఆయన.. ఇప్పుడు తనకు తానుగా సొంతంగా నిలబడలేని దుస్థితి. రూ.538.6 కోట్ల రుణాల ఎగవేత కేసులో ఆయన నిందితుడు. ప్రస్తుతం కరుడుగట్టిన నేరస్థులు.. షార్ప్ షూటర్లు.. గుండాలు.. రౌడీలతో కలిసి జైలు జీవితాన్ని అనుభవించాల్సి రావటానికి మించిన వేదన మరొకటి ఏముంటుంది? ఒకదశలో జైలు జీవితంపై విరక్తి చెందిన ఆయన.. జైల్లో చనిపోయేందుకు తనకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు.
ఆయన ఫోటోల్ని షేర్ చేస్తున్న నెటిజన్లు.. ఎవరికి ఇలాంటి దారుణ పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నారు.అదే సమయంలో తప్పులు చేస్తే.. శిక్ష తప్పదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. నరేష్ గోయల్ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదన్న విషయాన్ని గుర్తించింది. ఎవరి సాయం లేకుండా నిలబడలేకపోవటాన్ని ప్రస్తావిస్తూ.. ఆయన ఆరోగ్య పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని.. ప్రైవేటు ఆసుపత్రిలో సొంత ఖర్చుతో ట్రీట్ మెంట్ తీసుకోవటానికి అనుమతిని ఇచ్చింది. అందేకాదు.. భద్రతకు సంబంధించి ఎస్కార్టుకు అయ్యే ఖర్చుల్ని సైతం ఆయనే భరించాలని కోర్టు పేర్కొంది. మొత్తంగా చూస్తే.. తప్పులు చేసే వారు ఏ స్థాయిలో ఉన్నా.. ఎంతటి తోపు అయినా కాలం చేతికి చిక్కితే మాత్రం అంతే సంగతులన్న విషయం మరోసారి ఫ్రూవ్ అయ్యిందని చెప్పాలి.