Begin typing your search above and press return to search.

బాబుకు సవాల్...ఎంపీ రామ్మోహన్ తో జవాబు

శ్రీకాకుళం ఎంపీగా ఉన్న కింజరాపు రామ్మోహనరావుని క్రిష్ణదాస్ మీద పోటీకి దింపాలని పార్టీ యోచిస్తోంది.

By:  Tupaki Desk   |   6 Sep 2023 1:30 AM GMT
బాబుకు సవాల్...ఎంపీ రామ్మోహన్ తో జవాబు
X

శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ఫ్యామిలీకి గట్టి ఝలక్ ఇవ్వాలని టీడీపీ చూస్తోంది. ధర్మాన వారికి సొంత నియోజకవర్గం నరసన్నపేట. ఇక్కడ నుంచి ధర్మాన ప్రసాదరావు. 1989లో ఫస్ట్ టైం గెలిచారు. ఆ తరువాత 1994లో ఓడినా 1999లో మరోసారి గెలిచారు. ఇక 2004 నుంచి ఆయన అన్న ధర్మాన క్రిష్ణదాస్ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 2004, 2009లతో పాటు 2012లో ఉప ఎన్నిక, 2019 జనరల్ ఎన్నికలతో కలుపుకుని మొత్తం నాలుగు సార్లు గెలిచారు

టోటల్ గా చూసుకుంటే గడచిన మూడున్నర దశాబ్దాల కాలంలో ధర్మాన ఫ్యామిలీ ఏకంగా పాతికేళ్ళుగా నరసన్నపేటలో రాజ్యమేలుతోంది. ఈసారి ఆ ఫ్యామిలీని ఓడించాలని టీడీపీ పంతం పట్టింది. ఇక 2019 ఎన్నికలో ఇరవై వేలకు పైగా మెజారిటీతో ధర్మాన క్రిష్ణదాస్ గెలిచారు. ఆయన జగన్ ప్రభుత్వంలో మూడేళ్ల పాటు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక ప్రస్తుతం ఆయన వైసీపీకి జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నారు.

తాజాగా పార్టీ సమావేశంలో క్రిష్ణదాస్ మాట్లాడుతూ మళ్ళీ నరసన్నపేట వైసీపీదే అన్నారు. తనని ఓడించాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నరసన్నపేట నుంచి తన మీద పోటీ చేయాలని సవాల్ చేశారు. బాబు మీద సైతం గెలిచి తన సత్తా చాటుతాను అని క్రిష్ణదాస్ పేర్కొన్న్నారు. ఇదిలా ఉంటే క్రిష్ణదాస్ ని ఓడించడానికి చంద్రబాబు అవసరం లేదని టీడీపీ అంటోంది. ఈసారి ఆయన మీద యువ నేతను పెట్టి ఓడించి తీరుతామని బదులిస్తోంది.

శ్రీకాకుళం ఎంపీగా ఉన్న కింజరాపు రామ్మోహనరావుని క్రిష్ణదాస్ మీద పోటీకి దింపాలని పార్టీ యోచిస్తోంది. రామ్మోహన్ కూడా ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అని అంటున్నారు. దాంతో ఆయనకు నరసన్నపేటను అప్పగించి గెలుచుకుని రావాలని బరిలోకి దింపనున్నారు. ఇదిలా ఉంటే ఎంపీగా రెండు సార్లు గెలిచిన రామ్మోహన్ యూత్ లో మంచి పట్టు సంపాదించారు. ఆయన నరసన్నపేట మీద చాలా కాలంగా ఫోకస్ పెట్టేశారు.

దాంతో పాటు ధర్మాన కుటుంబం మీద అసంతృప్తితో ఉన్న వర్గాలను టీడీపీలో కలుపుకుంటున్నారు. గతంలో కాపులు వైశ్యులు సహా వివిధ సామాజిక వర్గాలు వైసీపీకి మద్దతుగా నిలిచేవి. ఇపుడు ఆ వర్గాలలో మొదలైన అసంతృప్తిని కరెక్ట్ గా పట్టుకుని సైక్లి వైపుగా రామ్మోహన్ నడిపిస్తున్నారు అని అంటున్నారు. దశాబ్దాలుగా గెలుస్తూ వస్తున్నా అభివృద్ధి విషయంలో ఏమీ నరసన్నపేటకు చేయడం లేదని అసంతృప్తి టోటల్ గా ప్రజలలో ఉంది.

అలాగే వైసీపీలో వర్గ పోరు కూడా ఉంది. దీంతో ఇదే అదనుగా క్రిష్ణదాస్ ని ఓడించేందుకు టీడీపీ రెడీ అవుతోంది. నరసన్నపేట మీద అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు దృష్టి పెట్టారు అని అంటున్నారు. రానున్న ఎన్నికల్లో నరసన్నపేట జిల్లాలో హాట్ సీటు గా ఉంటుంది అని అంటున్నారు. ఈసారి ధర్మాన క్రిష్ణదాస్ కి గెలుపు అంత ఈజీ కాదని అంటున్నారు. మరి ఆయన ఏ విధంగా జూనియర్ ఎర్రన్నను ఎదుర్కొంటారో చూడాల్సిందే అంటున్నారు.