అరుదైన ప్రయోగం... చంద్రుడిపైకి 'ప్రైవేట్' డ్రోన్!
మానవ సహిత జాబిల్లి యాత్ర చేపట్టేందుకు మరోసారి నాసా సిద్ధమైంది. అంతకంటే ముందు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కు వరుసగా ప్రయోగాలు చేస్తోంది.
By: Tupaki Desk | 27 Feb 2025 6:31 AM GMTమానవ సహిత జాబిల్లి యాత్ర చేపట్టేందుకు మరోసారి నాసా సిద్ధమైంది. అంతకంటే ముందు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కు వరుసగా ప్రయోగాలు చేస్తోంది. ఈ సమయంలో.. తాజాగా చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద దిగేలా ఓ ప్రైవేటు కంపెనీ అభివృద్ధి చేసిన లూనార్ ల్యాండర్ ను ప్రయోగించింది. మార్చి 6న చంద్రుడిపై దిగేలా దీన్ని రూపొందించారు.
అవును... అంతరిక్ష రేసులో ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసేందుకు అమెరికా కీలక చర్యలు చేపడుతోంది. ఈ సందర్భంగా ఇంట్యూటివ్ మెషిన్స్ సంస్థ అభివృద్ధి చేసిన అథీనా ల్యాండర్ ను స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ లో పంపించింది. నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ తాజాగా దూసుకెళ్లింది.
పదిహేను అడుగుల ఎత్తైన ఈ అథీనా ల్యాండర్.. దక్షిణ దృవానికి 100 మైళ్ల దూరంలో ల్యాండ్ అయ్యేలా లక్ష్యాన్ని నిర్ధేశించించారు. ఈ ప్రాంతం జెట్ బ్లాక్ బిలానికి సుమారు 400 మీటర్ల దూరంలోనే ఉంటుందని చెబుతున్నారు. కాగా... చంద్రుడి ఉపరితలంపై సూర్యకిరణాలు ఎన్నడూ పడని ప్రాంతాన్ని జెట్ బ్లాక్ బిలంగా అభివర్ణిస్తారనే సంగతి తెలిసిందే.
ఈ బిలం పైకి "గ్రేస్" అనే డ్రొన్ ను పంపించడమే ఈ అథీనా ల్యాండర్ మిషన్ లక్ష్యమని చెబుతున్నారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఎక్స్ పర్ట్ గ్రేస్ హోపర్ గుర్తుగా ఈ డ్రోన్ కు "గ్రేస్" అనే పేరు పెట్టారు. మూడు అడుగులు మాత్రమే ఉండే ఈ డ్రోన్.. చంద్రుడి ఉపరితలంపై మూడు కీలక పరీక్షలు నిర్వహించనుందని అంటున్నారు.
ఈ సమయంలో చంద్రునిపై డ్రిల్, ఇతర ప్రయోగాలు చేయడ్దానికి నాసా.. ఇంట్యూటివ్ మెషీన్స్ కు 62 మిలియన్ డాలర్లు చెల్లిస్తోంది. ఆ కంపెనీ.. ల్యాండర్ లోని స్థలాన్ని ఇతరులకు విక్రయించింది. ఇది ఫాల్కన్ రాకెట్ ను రైడ్ షేరింగ్ కు కూడా తెరిచింది.
ఇక ఈ డ్రోన్ లో హైడ్రోజన్ ఫ్యూయెల్డ్ థ్రస్టర్లను ఉపయోగించడంతో అది ఎగురుతుంది. ఈ సమయంలో నావిగేషన్ కోసం కెమెరా, లేజర్లను ఏర్పాటు చేశారు. ఇది ఎగురుతుండగా.. దీనిలోని పరికరాలు చంద్రుడి ఉపరితలాన్ని అన్వేషిస్తాయి.