రోదసిలో సునీతా విలియమ్స్... 8 రోజులని వెళ్లి ఇంకా 8 నెలలా?
అయితే తాజాగా నాసా చెప్పిన స్పేస్ ఎక్స్ క్రూ మిషన్ లో ఇద్దరు వ్యోమగాములతో క్రూ డ్రాగన్ ను పంపించే అవకాశాలున్నాయి.
By: Tupaki Desk | 8 Aug 2024 4:53 PM GMTభారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి వెళ్లిన రోదసి యాత్ర తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. 8 రోజుల మిషన్ లో భాగంగా విల్ మోర్ తో కలిసి జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్ లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఆమె తిరిగి భూమిపైకి రావడానికి మరో 8 నెలలు పట్టొచ్చని తెలుస్తోంది.
అవును... అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతా విలియమ్స్ సాంకేతిక కారణాలతో అక్కడే చాలా రోజులుగా చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆమె రాక మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకూలంగా సాగితే ఆమె వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నాసా ఓ కీలక ప్రకటన విడుదల చేసింది.
అవును సునీతా విలియమ్స్, విల్ మోర్ ల రాకపై నాసా తాజాగా ఓ అప్ డేట్ ఇచ్చింది. ఇందులో భాగంగా... బోయింగ్ స్టార్ లైనర్ తిరిగి భూమ్మీద ల్యాండ్ అయ్యేందుకు సురక్షితంగా లేకపోతే.. వారిని తీసుకొచ్చేందుకు ఎంచుకున్న ఆప్షన్స్ లో ఒకటి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉందని తెలిపింది. అది కూడా స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌకతో అని వెల్లడించింది.
ఈ లెక్కన చూసుకుంటే... సునీతా విలియమ్స్, విల్ మోర్ లు మరో ఎనిమిది నెలల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయనే అనుకోవాలి. అయితే తాజాగా నాసా చెప్పిన స్పేస్ ఎక్స్ క్రూ మిషన్ లో ఇద్దరు వ్యోమగాములతో క్రూ డ్రాగన్ ను పంపించే అవకాశాలున్నాయి. అయితే... ఈ ప్రయోగం ఈ ఏడాది సెప్టెంబర్ లో ఉండొచ్చని అంటున్నారు.
ఈ వ్యోమనౌకతోనే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీతా విలియమ్స్, విల్ మోర్ లను భూమీదకు తీసుకురావాలని భావిస్తున్నట్లు నాసా ప్రకటన ద్వారా అర్థమవుతుంది! ఇదే సమయంలో ప్రస్తుతం వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో సురక్షితంగానే ఉన్నారని, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయని నాసా తెలిపింది.
కాగా... 8 రోజుల మిషన్ లో భాగంగా జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్ లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లిన సునీతా, విల్ మోర్ లు వాస్తవానికి జూన్ 14నే భూమికి తిరుగుపయనం కావాల్సిన సంగతి తెలిసిందే. అయితే... వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సమస్యలు ఎదురయ్యాయి. దీంతో... గత రెండు నెలలుగా వీరిద్దరూ అక్కడే ఉండిపోయారు.