ఇరాన్ ఇంటి దొంగ అతడే.. సాధారణ వ్యక్తి కాదు.. పెద్ద శక్తే
హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా, డిప్యూటీ ఫాద్ షుక్ర్, ఆపరేషనల్ చీఫ్.. వీరంతా వరుసగా ఇజ్రాయెల్ చేతిలో చనిపోయారు.
By: Tupaki Desk | 11 Oct 2024 11:20 AM GMTఖుద్స్ ఫోర్స్.. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ (ఐఆర్జీసీ) విదేశాంగ విభాగం. అంటే.. విదేశాల్లో ఇరాన్ కార్యకలాపాలను చక్కబెట్టే వ్యవస్థ. ఐఆర్జీసీ అంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీకి మాత్రమే జవాబుదారీ. అంతటి పవర్ ఫుల్ దళం అది. అలాంటి ఐఆర్జీసీ హెజ్బొల్లా, హూతీ, హ మాస్ లకు పూర్తి సాయం అందిస్తోంది. కానీ, హమాస్, హెజ్బొల్లా ఉగ్ర సంస్థల అధినేతలను ఇజ్రాయెల్ చాకచక్యంగా మట్టుపెబ్టింది. ఇదెలా సాధ్యమైంది?
అతడి భేటీ అంటే చావే..
హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా, డిప్యూటీ ఫాద్ షుక్ర్, ఆపరేషనల్ చీఫ్.. వీరంతా వరుసగా ఇజ్రాయెల్ చేతిలో చనిపోయారు. హెజ్‌బొల్లా నూతన చీఫ్ సఫీద్దిన్ పైనా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇంత పక్కాగా ఎలా చేస్తోంది..? అనే అనుమానం వచ్చింది. దీనికి కారణం.. ఇరాన్ టాప్ కమాండర్, ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఖానీ ఇజ్రాయెల్ ఏజెంట్‌గా పనియడమే. అంటే.. అతడు భేటీ అవడం ఆలస్యం.. విషయం పసిగట్టి ఇజ్రాయెల్ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐఆర్‌జీసీ దళాల్లో ఇజ్రాయెల్ నిఘా సంస్థలు చొచ్చుకొచ్చినట్లు ఇరాన్ బలంగా అనుమానిస్తున్న సంగతి తెలిసిందే.
విచారణలో గుండెపోటు..
ఐఆర్‌జీసీ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఖానీని ఇరాన్ దళాలు విచారణ చేస్తుండగా.. గుండెపోటుతో కుప్పకూలినట్లు సమాచారం. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అతడి సన్నిహిత టీమ్ లను కూడా ఇరాన్ దళాలు బంధించాయట. ఇటీవల ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహముద్ అహ్మది నజాద్
కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ పై నిఘా కోసం నియమించిన సీక్రెట్ విభాగం చీఫ్ డబుల్ ఏజెంట్ గా మారి తమ సమాచారాన్ని ఇజ్రాయెల్ కు చేరవేశాడని వాపోయారు. 20 మంది నిఘా సిబ్బంది డబుల్ ఏజెంట్లుగా మారి కీలకమైన అణు రహస్యాలను చేరవేశారని తెలిపారు. తమ నిఘా సంస్థ అధిపతే ఇజ్రాయెల్ గూఢచారి అని 2021లోనే బయటపడినట్లు నజాద్ తెలిపారు. కాగా ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ఓ ఆపరేషన్ ద్వారా లక్ష అణుపత్రాలను అపహరించింది. వీటిని ఇజ్రాయెల్ ప్రధాని 2018లో బయటపెట్టడం గమనార్హం.