Begin typing your search above and press return to search.

సంధ్య థియేటర్ ఘటన.. రంగంలోకి NHRC..

ఇప్పుడు తొక్కిసలాట కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ రంగంలోకి దిగింది.

By:  Tupaki Desk   |   2 Jan 2025 8:25 AM GMT
సంధ్య థియేటర్ ఘటన.. రంగంలోకి NHRC..
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ మూవీ ప్రీమియర్స్ షో సమయంలో హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా.. ఆమె కొడుకు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజులుగా మృత్యువుతో పోరాడుతున్నాడు.

అయితే ఆ కేసులోనే అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పలు సెక్షన్లపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలించారు. ఆ తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంచల్ గూడ జైలు నుంచి బయటకు వచ్చారు అల్లు అర్జున్.

ఇప్పుడు తొక్కిసలాట కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ రంగంలోకి దిగింది. సంధ్య థియేటర్‌ ఘటనలో వివరణ ఇవ్వాలని తెలంగాణ డీజీపీ, హైదరాబాద్‌ సీపీకి రీసెంట్ గా నోటీసులు జారీ చేసింది. న్యాయవాది రామారావు ఎన్‌ హెచ్‌ ఆర్‌సీకి ఫిర్యాదు చేయగా.. ఇప్పుడు సవివరమైన చర్యల నివేదికను కోరింది.

మూవీ ప్రీమియర్‌ షోకి అల్లు అర్జున్‌ రావడం, పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడం వల్లే తొక్కిసలాట జరిగిందని, అందుకే రేవతి మృతి చెందిందని ఫిర్యాదులో పేర్కొన్నారు రామారావు. బాలుడికి కూడా అందుకే తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. దీంతో ఎన్ హెచ్ ఆర్ సీ.. రామారావు ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుంది.

సీనియర్‌ ర్యాంక్‌ పోలీసు అధికారితో విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ ను ఆదేశించింది. ఘటనపై నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని నోటీసుల్లో మెన్షన్ చేసింది. దీంతో ఇప్పుడు ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది. పోలీసులు నివేదికలో ఏం పేర్కొంటారోనని అంతా మాట్లాడుకుంటున్నారు.

డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 బెనిఫిట్ షోను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో ప్రదర్శించారు నిర్వాహకులు. సినిమా చూసేందుకు అల్లు అర్జున్ వచ్చారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన అభిమానులు ఆయన్ను చూసేందుకు పోటీ పడ్డారు. దీంతో తొక్కిసలాట జరగ్గా.. కుటుంబంతో సినిమా చూసేందుకు వెళ్లిన రేవతి కుటుంబంలో విషాదం నెలకొంది.