Begin typing your search above and press return to search.

ఇదే జరిగితే మారిపోనున్న 'సీమ' ముఖచిత్రం!

వెనుకబడిన జిల్లాలుగా రాయలసీమ జిల్లాలకు పేరుంది. అందులోనూ దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాల్లో అనంతపురం జిల్లా ఒకటి

By:  Tupaki Desk   |   6 July 2024 11:07 AM GMT
ఇదే జరిగితే మారిపోనున్న సీమ ముఖచిత్రం!
X

వెనుకబడిన జిల్లాలుగా రాయలసీమ జిల్లాలకు పేరుంది. అందులోనూ దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాల్లో అనంతపురం జిల్లా ఒకటి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాయలసీమ ముఖచిత్రం మారిపోనుంది. గతంలో లేనివిధంగా ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధితో రాయలసీమ జిల్లాలు కొత్త రూపు సంతరించుకోనున్నాయి.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం.. రెండు ఐటీ నగరాలయిన హైదరాబాద్‌ – బెంగళూరు మధ్య ఇప్పుడున్న నాలుగు వరుసల జాతీయ రహదారిని ఏకంగా 12 వరుసలకు విస్తరించాలని నిర్ణయించింది. దీంతో ఈ రెండు మెట్రో నగరాల మధ్య వాహనాల రద్దీ తగ్గిపోనుంది. కాగా హైదరాబాద్‌ – బెంగళూరు మధ్య విస్తరించే ఈ రహదారి రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల మీదుగా వెళ్తోంది. ఈ హైవే ఏపీలోని కర్నూలు వద్ద మొదలై శ్రీసత్యసాయి జిల్లాలోని కొండికొండ వద్ద ముగుస్తుంది.

కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, పెనుకొండ మీదుగా వెళ్తుంది.

హైదరాబాద్‌ – బెంగళూరు జాతీయ రహదారి విస్తరణలో అత్యధిక భాగం ఆంధ్రప్రదేశ్‌ లోనే ఉంది. మొత్తం 576 కి.మీ. జాతీయ రహదారిలో ఏపీలో ఏకంగా 260 కి.మీ మార్గాన్ని 12 వరుసలకు విస్తరించనున్నారు. దీంతో కర్నూలు, అనంతపురం జిల్లాలు ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందునున్నాయి.

అనంతపురం జిల్లా ఏపీ సరిహద్దు నుంచి బెంగళూరు కేవలం 80 కి.మీ. దూరంలోనే ఉంది. దీంతో బెంగళూరులో స్థలాలు కొనాలనుకున్నవారు, పెట్టుబడులు పెట్టాలనుకున్నవారు అక్కడ అత్యధిక ధరలతో అనంతపురం జిల్లాలో కొనుగోలు చేయొచ్చని అంటున్నారు. బెంగళూరుతో పోలిస్తే అనంతపురం జిల్లాలో నీటి కొరత కూడా లేదని గుర్తు చేస్తున్నారు.

ఎక్కడయితే విశాలమైన జాతీయ రహదారులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు ఉంటాయో అక్కడే పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను పెడతారని అంటున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా పుట్టపర్తిలో, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో విమానాశ్రయాలు ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్‌ ల్లో అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. ఇక రైల్వే సదుపాయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కర్నూలు నుంచి హైదరాబాద్‌ 200 కి.మీ దూరంలోపే ఉంది.

దీంతో హైదరాబాద్‌ – బెంగళూరు మధ్య 44వ నంబర్‌ జాతీయ రహదారిని విస్తరిస్తే ఈ ఎక్సప్రెస్‌ వే వెంట కేంద్ర ప్రభుత్వం ఎకనమిక్‌ కారిడార్‌ ను ఏర్పాటు చేసి వాటికి ప్రోత్సాహకాలు అందజేస్తోంది. దీంతో ఈ రహదారిలో అత్యధిక భాగం 260 కి.మీ. ఏపీలోనే ఉండటంతో ఆ మేర అనంతపురం, కర్నూలు జిల్లాలు లబ్ధి పొందనున్నాయి.

దీంతో ఓవైపు కర్ణాటక నుంచి, ఇంకోవైపు తెలంగాణ నుంచి, మరోవైపు ఏపీ నుంచి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు అనంతపురం, కర్నూలు జిల్లాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఓవైపు విమానాశ్రయాలు, రైలు కనెక్టివిటీ, ఎక్సప్రెస్‌ వే ఉండటంతో తమ ఉత్పత్తులను త్వరగా తరలించడంతోపాటు మార్కెటింగ్‌ చేయడానికి అవకాశం ఉంటుంది.