ముగ్గురు తెలుగు రాష్ట్రాల యువకుల కోసం ఎన్ఐఏ సెర్చింగ్
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కేసులో జాతీయ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తు వేగవంతం చేసింది
By: Tupaki Desk | 17 Dec 2023 8:30 AM GMTనిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కేసులో జాతీయ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తు వేగవంతం చేసింది. ఇటీవల దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా కొంతమందిని అరెస్టు కూడా చేసింది. లభించిన సమాచారం ప్రకారం కేసు విచారణలో ఎన్ఐఏ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో ఎన్ఐఏ ప్రకటించిన మోస్ట్ వాంటెడ్ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువకులు ఉండటం కలకలం రేపుతోంది. ఈ ముగ్గురి కోసం ఎన్ఐఏ అధికారులు వెతుకుతున్నారు.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఇస్లాంపురకు చెందిన అబ్దుల్ సలీం, నిజామాబాద్ లోని మల్లెపల్లికి చెందిన అబ్దుల్ అలియాస్ ఎంఏ అహ్మద్, ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం ఖాజానగర్ కు చెందిన షేక్ అహ్మద్ ను మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఎన్ఐఏ చేర్చింది. వీళ్ల కోసం తీవ్రంగా గాలిస్తోంది. వీళ్ల ఆచూకీ తెలిపితే పారితోషికం కూడా ఇస్తామని ప్రకటించింది.
మరోవైపు కేరళకు చెందిన 11 మంది, కర్ణాటకకు చెందిన 5 మంది, తమిళనాడుకు చెందిన 5 మందిని కూడా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఎన్ఐఏ చేర్చింది. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకులు ఇందులో ఉండటం మాత్రం ఆందోళన రేకెత్తిస్తోంది.