Begin typing your search above and press return to search.

కేంద్రంలో 2024లో హంగ్ నా...?

అయితే జాతీయ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇండియా కూటమి పెట్టి కాంగ్రెస్ జోరు చేస్తోంది

By:  Tupaki Desk   |   9 Dec 2023 2:30 PM GMT
కేంద్రంలో 2024లో హంగ్ నా...?
X

కేంద్రంలో రెండు సార్లు వరుసగా మంచి మెజారిటీతో బీజేపీ గెలిచింది. ఒకసారి సాధారణ మెజారిటీ వస్తే 2019 ఎన్నికల్లో బీజేపీకి ఏకంగా మూడు వందల సీట్లు పై దాటి వచ్చాయి. ఇక 2024 లోక్ సభ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. మరి ఈసారి బీజేపీ అదే మ్యాజిక్ కంటిన్యూ చేస్తుందా లేక మెజారిటీకి దూరంగా ఉండిపోతుందా అన్న చర్చ అయితే ఉంది.

అయితే జాతీయ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇండియా కూటమి పెట్టి కాంగ్రెస్ జోరు చేస్తోంది. అదే విధంగా కాంగ్రెస్ గ్రాఫ్ కూడా బాగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో బీజేపీకి ఈసారి ఎన్నికలు పెను సవాల్ ని విసురుస్తున్నాయి అని అంటున్నారు. దాంతో హోరా హోరీ పోరు సాగితే ఎవరికీ మెజారిటీ రాకుండా హంగ్ పార్లమెంట్ ఈసారి వస్తుందా అన్న చర్చలు అయితే సాగుతున్నాయి.

దీని మీద దేశ రాజధాని ఢిల్లీలో జోరుగా ప్రచారం అయితే మొదలైంది. ఎందుకంటే బీజేపీ పూర్తిగా ఉత్తర భారతానికే పరిమితం అయిపోయింది. కర్నాటక ఎన్నికల్లో ఓటమితో బీజేపీకి దక్షిణాన సీట్లు వచ్చే అవకాశాలు కంపించడంలేదు. ఇక కాంగ్రెస్ చూస్తే దక్షిణాన స్ట్రాంగ్ అయిపోయింది. నిన్న కర్నాటక నేడు తెలంగాణా రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకుని గట్టిగా నిలబడింది.

ఇక తమిళనాడులో డీఎంకే మిత్రపక్షంగా ఉంది. కేరళలో వామపక్షాలు కాంగ్రెస్ కి సపోర్ట్ గా ఉంటాయి. దాంతో సౌతిండియాలో వచ్చే అత్యధిక శాతం ఎంపీలు ఈసారి ఇండియా కూటమి ఖాతాలో పడతాయని అంటున్నారు. అదే సమయంలో ఉత్తర భారతాన ఈ రోజుకీ కాంగ్రెస్ పట్టు సాధించలేకపోతోంది.

బీజేపీ చూస్తే వరసగా ముఖ్యమంత్రులను మార్పు చేస్తూ బలమైన సామాజిక వర్గాలను దూరం చేసుకుని కర్నాటకలో అధికారం పోగొట్టుకుంది. ఇక తెలంగాణాలో చూస్తే కీలక సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక మంచి అవకాశాలను సైతం వాడుకోలేక అధికారం మాట అటుంచి డబుల్ డిజిట్ నంబర్ ని సైతం సాధించలేకపోయింది అని అంటున్నారు.

తెలంగాణాలో బీజేపీకి ఈసారి ఊపు వచ్చినా కూడా తప్పుడు నిర్ణయాలతో కాలదన్నుకుంది అన్న భావన అయితే ఉంది. ఇక కేంద్రంలో బీజేపీకి ఈసారి పరిస్థితి ఇబ్బందిగా మారవచ్చు అని అంటున్నారు. దానికి కారణం దక్షిణాన ఉన్న మొత్తం 129 ఎంపీ సీట్లలో బీజేపీకి గట్టిగా సింగిల్ డిజిట్ నంబర్ అయినా వస్తుందా అన్నది ఇపుడు పెద్ద చర్చగా ఉంది.

దాంతో 2019 మాదిరిగా ఉత్తర భారతం బీజేపీకి జై కొట్టినా సౌత్ లో మాత్రం బీజేపీకి అతి పెద్ద నష్టం తప్పకపోవచ్చు అంటున్నారు. దాని ఫలితంగా బీజేపీకి ఈసారి మెజారిటీకి సరిపడా సీట్లు అంటే 273 కి కనీసంగా ముప్పయి నుంచ్ నలభై సీట్ల దాకా తక్కువ పడతాయని అటున్నారు. అంటే బీజేపీ కానీ ఎన్డీయే కూటమి కానీ 230 దగ్గర ఆగిపోవచ్చు అని అంచనా కడుతున్నారు.

అదే కనుక జరిగితే బీజేపీకి ఏ ప్రాంతీయ పార్టీ సమర్ధించే పరిస్థితి అయితే ఈసారి ఉండకపోవచ్చు అని అంటున్నారు. ఇక కాంగ్రెస్ కి ఈసారి బాగానే సీట్లు వస్తాయని అంటున్నారు. ఈసారి వంద కంటే ఎక్కువ సీట్లు సొంతంగా కాంగ్రెస్ కి దక్కుతాయని అలాగే బలంగా ఉన్న ఇండియా కూటమిలోని వారికి కూడా పెద్ద ఎత్తున సీట్లు వస్తాయని అంటున్నారు. అయితే ఎవరికి సీట్లు దక్కినా మెజారిటీకి ఇండియా కూటమి కూడా దూరంగా ఉంటుంది అని అంటున్నారు

ఈ నేపధ్యంలోనే ప్రాంతీయ పార్టీలు 2024 ఎన్నికల్లో తన హవాను చూపిస్తాయని అంటున్నారు. వారి మద్దతు ప్రధానంగా దేశంలోని జాతీయ పార్టీలైన బీజేపీకి కానీ కాంగ్రెస్ కి కానీ కావాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఇక ఈసారి ఏపీలో టీడీపీకి వైసీపీకి కూడా సరిసమాంగా ఎంపీ సీట్లు వస్తాయని అంటున్నారు. అంటే మొత్తం పాతిక సీట్లలో ఇద్దరూ సరిగ్గా పంచుకుంటారు అని అంటున్నారు.

అదే జరిగితే ఎవరి ఎవరికి మద్దతు ఇస్తారు అన్నది పెద్ద ప్రశ్న కూడా ఉంది. ఏది ఏమైనా బీజేపీకి జాతీయ స్థాయిలో ఈసారి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయని అంటున్నారు. అదే సమయంలో హంగ్ పార్లమెంట్ ఈసారి తప్పనిసరి అని అంటున్నారు.