Begin typing your search above and press return to search.

నేషనల్ మీడియా అంతా ఫేకేనా ?

దేశంలో ఎపుడు ఎన్నికలు జరిగినా జాతీయ మీడియా సంస్థల సరదాయే వేరు. వారే సర్వాంతర్యామి మాదిరిగా సర్వేలు చెబుతూ ఉంటారు

By:  Tupaki Desk   |   8 Jun 2024 3:48 PM GMT
నేషనల్ మీడియా అంతా ఫేకేనా ?
X

దేశంలో ఎపుడు ఎన్నికలు జరిగినా జాతీయ మీడియా సంస్థల సరదాయే వేరు. వారే సర్వాంతర్యామి మాదిరిగా సర్వేలు చెబుతూ ఉంటారు. ప్రధానులను వారే నిర్ణయిస్తారు. అలాగే దేశంలోని పలు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగితే ముఖ్యమంత్రులు ఎవరో కూడా చెప్పేస్తారు. అలా వారి హడావుడి ఒక రేంజిలో ఉంటుంది.

అలాంటి జాతీయ సర్వేలు ప్రతీ సారీ సర్వేలు ఇస్తూంటాయి. అవి ప్రీ పోల్ సర్వేలు పోస్ట్ పోల్ సర్వేలు ఎగ్జిట్ పోల్ సర్వేలు మూడ్ ఆఫ్ ది నేషన్ అంటూ రకరకాలుగా ఇస్తూ ఉంటాయి. కానీ ఆ సర్వేలలో ఎన్ని నిజం అయ్యాయన్నది చూడాల్సి ఉంటుంది.

సర్వేలతో ప్రభావితం చేస్తామనుకుని బోల్తాపడుతున్న జాతీయ సర్వేశ్వరులే ఎక్కువగా ఉన్నారు. తామే అన్నీ చేస్తున్నట్లుగా ఫీల్ అయ్యే వారూ ఉన్నారు. అయితే గత కొన్ని ఎన్నికలుగా చూస్తూ ఉంటే సర్వేలలో నిజాయితీ బాగా తగ్గిపోతోంది. అందులో రాజకీయం చేరుతోంది. తాము అనుకున్న వారే అధికారం లోకి రావాలన్న యావ కనిపిస్తోంది. ఈ విధంగా లిస్ట్ తీస్తే చాలా జాతీయ సర్వేలు చెప్పిన జోస్యాలు ఈసారి పూర్తి స్థాయిలో తప్పాయి.

కేంద్రంలో మోడీకి ఏకంగా 370 నంబర్ కి తగ్గకుండా చాలా ఉదారంగా సర్వేశ్వరులు ఇచ్చేశారు. ఒకరు ఇద్దరు కాదు డజన్ల కొద్దీ సర్వే సంస్థలు ఇచ్చిన ఈ నంబర్లను చూసి అంతా నిజం అనుకున్నారు. మళ్లీ మోడీ బ్రహ్మాండమైన మెజారిటీతో రాబోతున్నారు అని కూడా భావించారు. ఆ మెజారిటీ కూడా 2019 నాటి కంటే ఎక్కువగా ఉంటుందని తలచారు.

చిత్రమేంటి అంటే ఒక సంస్థ కాదు అందరూ కూడబలుక్కుని నట్లుగా దాదాపుగా ఒకే నంబర్ ఇచ్చారు. దాంతోనే అందరికీ కనీసంగా ఇందులో కొన్ని నంబర్లు తగ్గినా బాగానే మోడీ నెగ్గుకు వస్తారని అనుకున్నారు. తీరా ఫలితాలు చూస్తే బీజేపీ నంబర్ 240 దగ్గర పడిపోయింది. ఎన్డీయే నంబర్ 290 దగ్గర ఆగింది. మరి ఎనభై సీట్ల దాకా తేడా వచ్చాయి. మరీ ఇంత తేడానా అని అంతా అంటున్నారు.

సర్వే ఫలితాలు అన్నీ కూడా ఫేక్ అని కూడా మెల్లగా ఒక అంచనాకు వస్తున్నారు. సర్వేలు చేస్తున్న మీడియా సంస్థలు అన్నీ రాజకీయ పార్టీలకు అనుకూలంగా మారి ఈ నంబర్లు ఇచ్చారన్న విమర్శలకు కూడా బలం చేకూరుతోంది. అందుకే ఈ సర్వేలను నమ్మమని ఇండియా కూటమి నేతలు మొదటే చెప్పారు. వంటింట్లో తయారు చేసిన నంబర్లు ఇవి అని మమతా బెనర్జీ అంటే ఈ సర్వే నంబర్లు మోడీ మార్క్ సర్వేలు అని రాహుల్ గాంధీ ఎత్తి పొడిచారు.

చివరికి వారి విమర్శలే నిజం అయ్యాయి. సర్వేలు అన్నీ తప్పుడు తడకలు అని నిరూపితం అయ్యాయి. దాంతో మరోసారి ఈ సంస్థలు సర్వేలు అంటూ జనం ముందుకు వస్తే నమ్ముతారా అన్న చర్చకు తెర లేచింది. అయితే మీరు నమ్మినా నమ్మకపోయినా సర్వేలు చేస్తూనే ఉంటాం, మా అజెండాను జనంలో పెడుతూనే ఉంటామని సర్వేశ్వరులు అనుకుంటే చేసేదేమీ లేదు. కానీ వ్యక్తికైనా సంస్థకు అయినా క్రెడిబిలిటీ ముఖ్యం. అది పోయిన తరువాత ప్రాణం లేని దేహంగానే ఉంటుంది మరి.