గ్రీన్ ల్యాండ్ పై ట్రంప్ పట్టు.. మమ్మల్ని లాగొద్దన్న నాటో
రెండోసారి అమెరికా అధ్యక్షుడు కావడం ఆలస్యం.. డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ ల్యాండ్, పనామా కాల్వ స్వాధీనం గురించి తరచూ మాట్లాడడం మొదలుపెట్టారు.
By: Tupaki Desk | 14 March 2025 6:00 PM ISTనార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ (నాటో).. అమెరికా పెద్దన్నగా కొనసాగే పశ్చిమ దేశాలకు చెందిన సైనిక కూటమి.. అమెరికా తరఫున అఫ్ఘానిస్థాన్ లోనూ పోరాడాయి నాటో దళాలు. రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ కూ సాయం చేసింది ఈ కూటమి. అలాంటి నాటో ఇప్పుడు అమెరికా మాట కాదంటోంది. ఏ విషయంలోనో తెలుసా?
రెండోసారి అమెరికా అధ్యక్షుడు కావడం ఆలస్యం.. డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ ల్యాండ్, పనామా కాల్వ స్వాధీనం గురించి తరచూ మాట్లాడడం మొదలుపెట్టారు. డెన్మార్క్ పరిధిలో ఉన్నా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన గ్రీన్ ల్యాండ్ ను వశం చేసుకునేందుకు ట్రంప్.. తాజాగా నాటో కూటమినీ లాగాలని చూశారు.
నాటో కూటమి సెక్రటరీ జనరల్ మార్క్ రట్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ట్రంప్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే కిమ్ న్యూక్లియర్ పవర్ అంటూ వ్యాఖ్యానించిన ట్రంప్.. గ్రీన్ ల్యాండ్ స్వాధీనం గురించి కూడా రట్ తో ప్రస్తావించారు. అంతర్జాతీయ భద్రత కోసం గ్రీన్ ల్యాండ్ తమకు అవసరం అని చెప్పుకొచ్చారు. దానికోసం చాలామంది తీరంలో తిరుగుతున్నారని.. మనం జాగ్రత్తగా ఉండాలని రట్ కు సూచించారు.
గ్రీన్ ల్యాండ్ ఆర్కిటిక్ ప్రాంతంలో ఉంటుంది. అక్కడ
చైనా, రష్యా కార్యకలాపాలను తీవ్రం చేశాయి. దీన్ని ఒప్పుకొంటూనే గ్రీన్ ల్యాండ్ గురించి తమను అడగొద్దంటూ రట్ కుండబద్దలు కొట్టారు. గ్రీన్ ల్యాండ్ అమెరికాలో చేరే చర్చలోకి నాటోను లాగదల్చుకోలేదన్నారు.
అమెరికా మాటను నాటో కాదనడం అంటే అది కొంత ఆశ్చర్యకరమే. రెండో ప్రపంచ యుద్ధకాలం నుంచే గ్రీన్ లాండ్ లో అమెరికా వైమానిక స్థావరం ఉంది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో సోవియట్ యూనియన్, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా నుంచి ముప్పును ఎదుర్కోవడానికి నాటో తరఫున అమెరికా ఆ స్థావరాన్ని నిర్వహిస్తోంది.