Begin typing your search above and press return to search.

ఒడిషా నవీన్ కి ఉన్న ధీమా జగన్ బాబులకు లేవా !?

పొరుగునే ఒడిషా ఉంది. దానికి నిరాటంకంగా ఇరవై నాలుగేళ్ళుగా ఒకే ఒక ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ కొనసాగుతున్నారు.

By:  Tupaki Desk   |   7 May 2024 3:41 AM GMT
ఒడిషా నవీన్ కి ఉన్న ధీమా జగన్ బాబులకు లేవా !?
X

పొరుగునే ఒడిషా ఉంది. దానికి నిరాటంకంగా ఇరవై నాలుగేళ్ళుగా ఒకే ఒక ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ కొనసాగుతున్నారు. ఆయన బిజూ జనతాదళ్ ని 1997లో స్థాపించి దాదాపుగా మూడు దశాబ్దాలుగా తనదైన ముద్రను ఒడిషాలో వేసుకున్నారు. ఆయనను తప్ప ముఖ్యమంత్రిగా మరొకరిని చూడడానికి సాహసించని తీరున ఒడిషా ప్రజలు ఉన్నారు అంటే ఆ గొప్పదనం నవీన్ దే.

దాదాపుగా ఎనభై ఏళ్ల ప్రాయానికి చేరువ అవుతున్నా నవీన్ నే మళ్లీ సీఎం కావాలని అక్కడ ప్రజలు బలంగా కోరుకుంటున్నట్లుగా సర్వే నివేదికలు చెబుతున్నాయి. ఏపీలో పాటుగానే మే 13న ఒడిషాలో పోలింగ్ మొదటి దశ మొదలవుతుంది. నాలుగు దశలుగా అక్కడ పోలింగ్ సాగనుంది. ఒడిషాలో ఈసారి ఎలాగైనా గెలిచి సీఎం పీఠం ఎక్కాలని బీజేపీ ఆరాటపడుతోంది.

నరేంద్ర మోడీ అమిత్ షాలు ఒడిషాను వరసబెట్టి కలియ తిరుగుతున్నారు.విస్తారంగా ఎన్నికల సభలలో పాలు పంచుకుంటున్నారు. అయినా సరే నవీన్ ఎక్కడా బెణక్కుండా ఒణక్కుండా ధీమాగా ఉన్నారు. ఇక బిజూ జనతాదళ్ కీలక నేతలు అయితే జూన్ 9న నవీన్ పట్నాయక్ సీఎం గా మరోసారి ప్రమాణం చేస్తారు అని ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. అంటే నవీన్ విజయం పట్ల ఆ పార్టీకి ఉన్న ధీమా అది.

అదే ఏపీలో చూస్తే అయిదేళ్ళ పాటు సీఎం గా పనిచేసిన జగన్ సెకండ్ టెర్మ్ తానే అని గట్టిగా చెబుతున్నా టైం డేట్ ముహూర్తానికి ఫిక్స్ చేయడం లేదు. వైసీపీ కూడా ఈ విషయంలో గుంభనంగా ఉంది. మళ్లీ మాదే అధికారం అని వైసీపీ అంటోంది కానీ అక్కడితోనే ఆగిపోతోంది.

ఇక ఈసారి ఆరు నూరు అయినా టీడీపీ కూటమిదే అధికారం అని చంద్రబాబు అంటున్నారు. పాతికకు పాతిక ఎంపీ సీట్లు అలాగే 160 కి తగ్గకుండా ఎమ్మెల్యే సీట్లు కూటమికి వస్తాయని ధీమాగా చెబుతున్న చంద్రబాబు అంతే ధీమాగా జూన్ లో ఫలనా రోజు సీఎం గా ప్రమాణం చేస్తాను అని ఎందుకు చెప్పడం లేదు అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

దీనిని బట్టి చూస్తే ఒడిషాలో ఒక బలమైన జాతీయ పార్టీ బీజేపీతో హోరా హోరీ పోరు సాగిస్తూ ఇప్పటికి అయిదు టెర్ములు సీఎం గా ఉన్నా కూడా నవీన్ మళ్లీ గెలుస్తాను అని అంటున్నారు. డేట్ ఫిక్స్ చేసుకుని కూర్చున్నారు.

కానీ సింగిల్ టెర్మ్ పూర్తి చేసి మరోసారి చాన్స్ కోసం జనాల వద్దకు వెళ్తున్న జగన్ అలాగే ఎపుడూ వరసగా రెండవ టెర్మ్ పూర్తి చేయని చంద్రబాబులకు మాత్రం ఏపీ పాలిటిక్స్ లో అంత ధీమా కనిపించడం లేదా అన్న చర్చ వస్తోంది. హోరా హోరీ పోరు ఏపీలో సాగుతోంది. దాంతో ఎవరు విజేతలు అన్నది అధినేతలకూ అంతుపట్టడం లేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి మరి.