Begin typing your search above and press return to search.

మోడీకి ఒడిశా సీఎం జబర్దస్త్ కౌంటర్ !

ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

By:  Tupaki Desk   |   12 May 2024 11:30 AM GMT
మోడీకి ఒడిశా సీఎం జబర్దస్త్ కౌంటర్  !
X

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జబర్దస్త్ కౌంటర్ ఇచ్చాడు. నాలుగో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఒడిశాలో పర్యటించిన ప్రధాని నరేంద్రమోడీ సీఎం నవీన్ పట్నాయక్ లక్ష్యంగా విమర్శలు గుప్పించాడు. మోడీ విమర్శలకు ధీటుగా నవీన్ పట్నాయక్ వేసిన కౌంటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

"ఒడిశాలోని అన్ని జిల్లాల పేర్లు, వాటి హెడ్ క్వార్టర్ల పేర్లను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎలాంటి నోట్స్ చూడకుండా చెప్పలేడు. రాష్ట్రంలోని జిల్లాల పేర్లే గుర్తుండని వ్యక్తికి రాష్ట్రంలోని ప్రజల సమస్యలు ఎలా అర్థమవుతాయి" అని ప్రధాని నరేంద్రమోడీ ప్రశ్నించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

"మోదీజీ, ఒడిశాకు మీరు ఇచ్చిన హామీలలో ఎన్ని గుర్తున్నాయి. సంస్కృత భాష అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. కానీ ఒడియా భాషకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఉన్నప్పటికీ ఒడియాను మర్చిపోయారు. ఒడిస్సీ మ్యూజిక్ కు క్లాసికల్ హోదా కోసం నేను రెండు సార్లు ప్రతిపాదనలు పంపించాను. కానీ వాటిని బుట్టదాఖలు చేశారు. ఒడిశాలో ఎంతోమంది గొప్పవాళ్లు ఉన్నారు. వారిలో కొందరి పేర్లను కూడా మీ ప్రసంగంలో ప్రస్తావించారు. మరి అలాంటి మహనీయులు భారతరత్న అవార్డుకు అర్హులు కారా ? ఒడిశా పుత్రుడు బిజూ పట్నాయక్ కు భారత రత్న పొందే అర్హత లేదా ?" అని నవీన్ పట్నాయక్ నిలదీశారు.

"మీరు ఎన్నికల సమయంలోనే ఒడిశాను గుర్తుచేసుకోవడం వల్ల మా రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు. 2014 - 2019 మధ్య కాలంలో మీరిచ్చిన హామీలు మీకు గుర్తున్నాయా ? గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తానని, జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన హామీలు ఎలా మరిచిపోయారు" అని నవీన్ పట్నాయక్ ప్రశ్నల వర్షం కురిపించారు.