Begin typing your search above and press return to search.

పెద్ద మనిషి అంటే ఇలా ఉండాలి!

కానీ.. అలాంటి రాజకీయాల్లోనూ విలువలతోనూ.. గౌరవ మర్యాదలతోనూ రాజకీయాలు చేసే అధినేతలు కొందరు ఉంటారు

By:  Tupaki Desk   |   19 Jun 2024 6:28 AM GMT
పెద్ద మనిషి అంటే ఇలా ఉండాలి!
X

రాజకీయాలంటే చిల్లరగా ఉంటాయని ప్రతి ఒక్కరు అంటుంటారు. కానీ.. అలాంటి రాజకీయాల్లోనూ విలువలతోనూ.. గౌరవ మర్యాదలతోనూ రాజకీయాలు చేసే అధినేతలు కొందరు ఉంటారు. అలాంటి వారి తీరు చూసినప్పుడు.. దేశంలో రాజకీయాలు ఇలా ఉంటే ఎంత బాగుండన్న భావన కలుగక మానదు. తాజాగా అలాంటి సీన్ ఒకటి ఒడిశా అసెంబ్లీలో చోటు చేసుకుంది.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 24 ఏళ్లు నాన్ స్టాప్ గా ఒడిశా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నవీన్ పట్నాయక్ తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓడిపోవటమే కాదు.. ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒకదాన్లో ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ.. ఆయన మిగిలిన రాజకీయ అధినేతల మాదిరి బిహేవ్ చేయకుండా.. సమకాలీన రాజకీయాలకు భిన్నంగా రియాక్టు కావటం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

ఇటీవల ముగిసిన ఎన్నికల్లో మాజీ సీఎం నవీన్ పట్నాయక్.. ముఖ్యమంత్రి హోదాలో హింజలి, కంటాబంజి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. రెండు స్థానాల్లో పోటీ చేసిన ఆయన.. కంటాబంజి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ బాగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. హింజలిలో గెలిచిన ఆయన మంగళవారం ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు అసెంబ్లీకి వచ్చారు. తన ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత అందరిని పలకరించేందుకు వెళుతున్న ఆయన.. అప్పటికే సభలో కూర్చున్న లక్ష్మణ్ బాగ్.. నవీన్ పట్నాయక్ ను చూసి లేచి రెండు చేతులతో నమస్కరించారు. తనను తాను పరిచయం చేసుకున్నారు.

వెంటనే సానుకూలంగా స్పందించిన నవీన్ పట్నాయక్.. ‘ఓహో.. మీరేనా నన్ను ఓడించింది. మీకు అభినందనలు’ అంటూ చిరునవ్వులు చిందించారు. దీంతో అక్కడున్న ముఖ్యమంత్రి మోహన్ మాఝి, మంత్రులు.. అధికార పార్టీ ఎమ్మెల్యేల ముఖాల్లోనూ చిరునవ్వులు వెల్లివిరిసాయి. తనను ఓడించిన నాయకుడ్ని మనస్ఫూర్తిగా అభినందించిన తీరును చూసి చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వీడియో వైరల్ గా మారటమే కాదు.. దేశంలో కూడా ఈ తరహా ఆరోగ్యకర రాజకీయాలు ఉంటే ఎంతబాగుండన్న భావన కలిగేలా చేసింది. ఇక్కడే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదేళ్లు పాలించిన కేసీఆర్ ను ప్రస్తావించాలి.

తాజా ఎన్నికల్లో ఆయన రెండు చోట్ల పోటీ చేయటం.. ఒక చోట (కామారెడ్డి) ఓడిపోవటం తెలిసిందే. తనను ఓడించిన బీజేపీ ఎమ్మెల్యేను అభినందించటం తర్వాత.. ముఖ్యమంత్రిగా విజయం సాధించిన రేవంత్ ను సైతం అభినందనలు తెలియజేయకపోవటం తెలిసిందే. అంతేనా.. అసెంబ్లీకి వచ్చేందుకు సైతం ఆయన ఇష్టపడని తీరు ఇప్పటికే చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. విలువలు.. సిద్ధాంతాలు.. గొప్పల గురించి అదే పనిగా చెప్పే కేసీఆర్..తన మాటలకు తగ్గట్లే చేతల్లో నవీన్ పట్నాయక్ లాంటి నేతల మాదిరి ఎందుకు బిహేవ్ చేయరు? అన్నది ప్రశ్న. కనీసం.. నవీన్ ఎపిసోడ్ వీడియోను కేసీఆర్ చూస్తే బాగుండు కదా?