Begin typing your search above and press return to search.

ఆరోగ్యంపై కుట్ర వ్యాఖ్యలకు మోడీకి ముఖం పగిలేలా బదులిచ్చిన ఆ సీఎం

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు

By:  Tupaki Desk   |   30 May 2024 6:26 AM GMT
ఆరోగ్యంపై కుట్ర వ్యాఖ్యలకు మోడీకి ముఖం పగిలేలా బదులిచ్చిన ఆ సీఎం
X

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీలైనంతవరకు వివాదాలకు కాస్తంత దూరంగా ఉంటారు. ఇప్పటి రాజకీయాలకు భిన్నంగా ఉంటూనే.. రాజకీయ ప్రత్యర్థులు తన దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మెతగ్గా ఉన్నట్లు కనిపిస్తూనే.. అవసరమైన వేళలో తానేమిటన్న విషయాన్ని ఆయన తన మాటలతో.. చేతలతో చెప్పేస్తుంటారు. తాజాగా అలాంటి తీరును మరోసారి ప్రదర్శించారాయన.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి మోడీ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందించిన తీరు.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వింటే నవీన్ పట్నాయక్ మజాకానా? అన్న భావన కలుగక మానదు. ఒడిశాలోని బారపదాలో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై అవసరానికి మించిన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నవీన్ ఆరోగ్యం విషయంలో ఏదో కుట్ర జరుగుతోందని ఆయన సన్నిహితులు భావిస్తున్నారని.. ఆయన అనారోగ్యం వెనుక ఎవరున్నారన్న విషయాన్ని తెలుసుకోవటం ఒడిశా ప్రజల హక్కుగా అభివర్ణించారు.

మొత్తంగా నవీన్ పట్నాయక్ ఆరోగ్యంగా లేరని.. ఆయన అనారోగ్యంపై తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరుపుతామని.. పట్నాయక్ ఆరోగ్య క్షీణించటానికి కారణం ఏమిటన్నది అన్వేషించటానికి ఒఢిశా అసెంబ్లీని తాము గెలుచుకున్న తర్వాత.. ఒక కమిటీని వేసి వెతుకుతామన్న వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోగ్యంలో ఏదో లెక్క తేడా ఉందన్న అభిప్రాయాన్నికలిగేలా చేశారని చెప్పాలి. దీనిపై తాజాగా స్పందించారు నవీన్ పట్నాయక్.

తన ఆరోగ్యంపై ప్రధానమంత్రి మోడీకి అంత ఆందోళన ఉండి ఉంటే.. ఆ విషయాన్ని తనకే నేరుగా ఫోన్ చేసి అడిగి ఉంటే బాగుండేది కదా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. తాను ఆరోగ్యంగా ఉన్నాని... తీవ్రమైన ఎండలోనే ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ.. పదేళ్లుగా తన ఆరోగ్యంపై బీజేపీ పుకార్లు పుట్టిస్తోందని.. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లుగా చెప్పారు. గత నెల రోజులుగా రాష్ట్రంలో తాను ప్రచారం చేస్తున్నాని.. తన ఆరోగ్యంపై తాను ప్రధానికి హామీ ఇస్తున్నట్లుగా కౌంటర్ ఇచ్చారు. నవీన్ పట్నాయక్ ఆరోగ్యం సరిగా లేదన్న బూచిని చూపించి.. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అధిక్యతను ప్రదర్శించాలన్న చౌకబారు ఎత్తుగడను మోడీ అండ్ కో వేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు నవీన్ పట్నాయక్ ఇచ్చిన ఘాటు కౌంటర్ మోడీకి భారీపంచ్ గా అభివర్ణిస్తున్నారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉండి.. ఈ తరహా వ్యాఖ్యలు మంచివి కావన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.