అక్కడ అడ్డపంచెల యుద్దం !
అయితే ప్రస్తుతం ఒడిశా ఎన్నికలలో ఈ అడ్డపంచెలు ధరించడం కలకలం రేపుతున్నాయి.
By: Tupaki Desk | 25 April 2024 5:30 PM GMTఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో పురుషులు ఇంటి వద్ద ఉన్నప్పుడు కట్టుకునే వస్త్రాన్ని అడ్డపంచె, లుంగీలుగా సంబోధిస్తారు. ఈ మధ్యకాలంలో అనేక దేవాలయాలు వీటిని ధరిస్తేనే దేవాలయాల సందర్శనకు అనుమతిస్తున్నాయి. దీంతో దేవాలయాల వద్ద వీటికి గిరాకి పెరిగింది. అయితే ప్రస్తుతం ఒడిశా ఎన్నికలలో ఈ అడ్డపంచెలు ధరించడం కలకలం రేపుతున్నాయి. బీజేడీ, బీజేపీ పార్టీల మధ్య విమర్శ, ప్రతి విమర్శలకు తెరలేపింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు మే 13న ఒడిశాలో 147 శాసనసభ, 21 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేడీ పార్టీ ప్రధాన కార్యాలయం శంఖ భవన్ లో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లుంగీ ధరించి చేతిలో పార్టీ గుర్తులు రెండు శంఖాలను పట్టుకుని మే 13న జరగనున్న ఎన్నికల్లో శాసనసభ, లోక్ సభ స్థానాలకు రెండు ఓట్లు రెండు శంఖుల గుర్తుల మీద వేసి బీజేడీని గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఒడిశాలో కుర్తా, పైజామా ధరించడం ఆనవాయితీ. నవీన్ పట్నాయక్ రెగ్యులర్ గా వాటినే ధరిస్తారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన ఇలా కనిపించడాన్ని బీజేపీ నేత, కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ తప్పుపట్టారు. ‘‘నవీన్ బాబు లాంటి పెద్దమనిషి ఇలా ప్రచారం చేయడం బాధాకరం. ఆయన కుర్తా, పైజామా ధరించాలి. ఆయన వెంట ఉండే పాండ్యన్ అనే వ్యక్తి నవీన్ బాబు పెద్దరికాన్ని అయినా గౌరవించాలి’’ అంటూ విమర్శించారు.
బీజేపీ విమర్శలను బీజేడీ తిప్పికొట్టింది. ‘‘లుంగీలు నేయడంలో ఒడిశాలోని సంబల్ పూర్ నేత కార్మికులకు నైపుణ్యం ఉంది. నవీన్ పట్నాయక్ కట్టుకున్నది ఆ లుంగీనే. ధర్మేంద్రప్రధాన్ వ్యాఖ్యలు నేత కార్మికులను, సంబల్ పూర్ లుంగీలను, ఒడిశా సంస్కృతిని అవమానించడమే’’ అని బీజేడీ కీలక నేతలు సంస్మిత పాత్ర, స్వయంప్రకాష్ మహాపాత్రలు విమర్శించారు. తమిళనాడుకు చెందిన ఐఏఎస్ అధికారి వీకె పాండ్యన్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఒడిశాలో బీజేడీ వ్యవహారాలు చూస్తున్నారు. ఈ లుంగీల ఆలోచన ఆయనదే అన్నది బీజేపీ వాదన. మరి ఎన్నికల వరకు ఈ లుంగీల పంచాయతీ ఎక్కడికి వెళ్తుందో వేచిచూడాలి.