హీరోయిన్ కమ్ ఎంపీని అరెస్ట్ చేయమంటున్న రేవంత్!
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.
By: Tupaki Desk | 10 May 2024 7:04 AM GMTదేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలు చేస్తున్న విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు వైరల్ గా మారుతున్నాయి. ఈ సమయంలోనే... నవనీత్ కౌర్ వర్సెస్ ఒవైసీ టాపిక్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రేవంత్ ఎంట్రీ ఇచ్చారు.
అవును... తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగాను హాట్ టాపిక్ అయిన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ - బీజేపీ నుంచి కొంపెల్ల మాధవీలత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఓటర్ల దృష్టిని ఆకర్షించడానికి ఆమె ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన పలువురు బీజేపీ నేతలతో కూడా ఆమె ప్రచారం చేయిస్తున్నారు!
ఇందులో భాగంగా... రాజకీయ నాయకురాలుగా మారిన నటి నవనీత్ కౌర్ రాణా కూడా హైదరాబాద్ లో మాధవి తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఒక పాతవిషయాన్ని ఆమె తెరపైకి తెచ్చారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా... మే 8న బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా నవనీత్ కౌర్ హైదరాబాద్ లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 2012లో అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను ఆమె ప్రస్థావించారు.
"పోలీసులు 15 నిముషాల పాటు పక్కకు తప్పుకుంటే అందరి లెక్కలు సరిచేస్తామని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు.. కానీ వాళ్లకు 15 నిముషాలు కావాలేమో... మాకు 15 సెకన్లు చాలు" అని నవనీత్ కౌర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా... "మోడీజీకి చెబుతున్నా.. ఆమెకు 15 సెకన్లు కాదు ఒక గంట సమయం ఇస్తున్నాం.. ఆ ఏం చేస్తారో చేసుకోండి"? అంటూ ఒవైసీ రియాక్ట్ అయ్యారు!
ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగా.. హైదరాబాద్ లో హింసాకాండకు దారితీసేలా చేసిన వ్యాఖ్యలకు నవనీత్ కౌర్ ను అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. చౌకబారు కామెంట్లు చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇదే సమయంలో మోడీ, అమిత్ షా లకు రేవంత్ రెడ్డి ఒక డిమాండ్ చేశారు.
ఇందులో భాగంగా... ఆమెను పార్టీ నుండి తొలగించాలని మోడీ, అమిత్ షాలను కోరుతున్నట్లు చెప్పిన రేవంత్... ఈ వ్యవహారం వారి అభిప్రాయాలు కూడా వెల్లడించాలని డిమాండ్ చేశారు!