హ్యాట్రిక్ లక్ష్యంగా నాటి నటి.. తాజాగా బీజేపీ అభ్యర్థి!
నియోజకవర్గంలో పట్టుతో పాటు.. సమస్యల్ని పరిష్కరించే విషయంలో ఆమె ఆద్యంతం మొండిగా వ్యవహరిస్తారని చెబుతున్నారు.
By: Tupaki Desk | 28 March 2024 4:15 AM GMTఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. పలు సినిమాల్లో నటించిన ఎంపీ నవనీత్ కౌర్.. రాజకీయంగా తన అడుగులను తాజాగా ఆసక్తికర రీతిలో వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె శివసేన అభ్యర్థిని ఓడించిన సంగతి తెలిసిందే. తాజాగా జరగనున్న ఎన్నికల్లో మాత్రం ఆమె బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న వైనం వెలుగు చూసింది.
హ్యాట్రిక్ కొట్టటమే లక్ష్యంగా ఆమె తపిస్తున్నారు. సినిమాల్లో మెరుపులు మెరిపించే విషయంలో వెనుకబడ్డ నవనీత్.. పొలిటికల్ రంగంలో మాత్రం తరచూ వార్తల్లో నిలిచేలా ఆమె నిర్ణయాలు ఉంటున్నాయి. తాజాగా లోక్ సభ అభ్యర్థుల ఎంపికలో బీజేపీ ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తోంది. పలువురు సిట్టింగులకు చేయిస్తున్న బీజేపీ అధిష్ఠానం.. మరికొందరి విషయంలో మాత్రం అనూహ్య రీతిలో ఓకే చెబుతోంది. తాజాగా విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ ఎంపీగా వ్యవహరిస్తున్న నవనీత్ కౌర్ ను ఎంపిక చేయటం ఆసక్తికరంగా మారింది.
నియోజకవర్గంలో పట్టుతో పాటు.. సమస్యల్ని పరిష్కరించే విషయంలో ఆమె ఆద్యంతం మొండిగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. గెలుపు ధీమాతో ఉన్న నవనీత్ కౌర్ ను బీజేపీలోకి తీసుకొని టికెట్ ఇవ్వటం ద్వారా గెలుపు గుర్రాల ఎంపికలో మోడీ సర్కారు ఎంతటి కసరత్తు చేస్తున్నారన్నది ఇప్పుడు విడుదలవుతున్న జాబితాల్ని చూస్తేనే అర్థమవుతుంది.
తాజాగా విడుదల చేసిన బీజేపీ జాబితాలో ఆసక్తికర ఎంపికల్ని చూస్తే.. హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామాతో ఖాళీ అయిన కర్నాల్ అసెంబ్లీ స్థానాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీకి కేటాయించటం మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. కర్నాటకలోని చిత్రదుర్గ (ఎస్సీ) స్థానం నుంచి కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్ ను బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి నారాయణస్వామి గెలిచారు. తాజా జాబితాలో మాత్రం ఆయనకు బదులుగా మరో అభ్యర్థిని బరిలోకి దించటం గమనార్హం.