ముదురు బ్రహ్మచారులకు పెళ్ళిళ్లు చేస్తా...ఓట్లు తెచ్చే పవర్ ఫుల్ హామీ !
ఎన్నికల్లో నెగ్గేందుకు ఎన్నెన్నో చేయాలి. ఇంకా గట్టిగా మాట్లాడితే ఎన్ని అయినా హామీలు ఇవ్వాలి.
By: Tupaki Desk | 8 Nov 2024 3:38 AM GMTఎన్నికల్లో నెగ్గేందుకు ఎన్నెన్నో చేయాలి. ఇంకా గట్టిగా మాట్లాడితే ఎన్ని అయినా హామీలు ఇవ్వాలి. అవి అమలు చేస్తారా లేదా అన్నది కూడా అనవసరం. ముందు హామీ ఇచ్చి పడేస్తే చాలు ఓట్ల పంట పండుతుంది. ఆనక అంతా చూసుకోవచ్చు అన్నది నేతల ఆలోచనగా ఉంది.
ఉత్తరాదిన ఆ మధ్య కొన్ని రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో నలభైలు యాభైలు వయసు దాటిన ముదురు బ్రహ్మచారుల సంఘం నుంచి ఒక పెద్ద డిమాండ్ వచ్చింది. తమకు పెళ్ళిళ్ళు చేస్తామని హామీ ఇచ్చిన పార్టీకే ఓటు వేస్తామని. ఆ విధంగా కొన్ని రాజకీయ పార్టీలు కూడా వారికి హామీ ఇచ్చి ఓట్లు రాబట్టుకున్నాయి కూడా.
మరి వారిలో ఎంతమందికి పెళ్ళిళ్లు చేశారో తెలియదు కానీ అది జాతీయ స్థాయిలోనే ఒక కొత్త వింత ఎన్నికల డిమాండ్ గా రికార్డుకు ఎక్కింది. ఇపుడు అలాంటిది మహారాష్ట్రలో ఒక పార్టీ అభ్యర్ధి ఎన్నికల హామీగా మార్చి ఓట్ల వేటను స్టార్ట్ చేశారు. ఆయన గారి పార్టీ ఆషామాషీది కాదు. మహారాష్ట్రలో ఎన్నో సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి జాతీయ రాజకీయాల్లో దిగ్గజ నేతగా ఉన్న శరద్ పవార్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్ధి ఈ హామీ ఇస్తున్నారు.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని పర్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ శరద్ చంద్ర పవార్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ ఈ విడ్డూరమైన హామీని ఇచ్చి జాతీయ స్థాయిలో సంచలనం రేపారు. తనను గెలిపించండి, నియోజకవర్గంలో ముదురు బ్రహ్మచారులు ఎవరైనా ఉంటే వెంటనే పెళ్ళి చేసే బాధ్యత తనదే అని ఆయన భరోసా ఇస్తున్నారు
ఆ నియోజకవర్గంలో పెళ్ళి కాని ప్రసాదులు ఎక్కువట. అదొక్క సామాజిక సమస్యగా మారింది. దాంతో దానిని పట్టుకున్నారు . రాజేసాహెబ్ దేశ్ ముఖ్. వారంతా తనకు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేగా నెగ్గడం ఖాయమని భావించి ఈ రకమైన హామీతో రంగంలోకి దిగిపోయారు అని అంటున్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీలతో జనం లోకి వస్తోంది. అక్కడ కూడా మహిళలకు ఫ్రీ బస్సు అంటోంది. అలాగే నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల రూపాయలు భృతి అని చెబుతోంది. బీజేపీ కూడా ఉచిత హామీల విషయంలో తక్కువ తినడం లేదు. మరి ఈ పార్టీల మధ్య శరద్ పవార్ పార్టీ కూడా తన మ్యానిఫేస్టోని రిలీజ్ చేసింది.
కానీ పార్టీ పరంగా ఉచితాలు తక్కువ అయ్యాయని భావించారో ఏమో కానీ రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ ఈ కొత్త హామీని ముందు పెట్టారు. నిజంగా ఆయన గెలిస్తే ఎమ్మెల్యేగా ఆయన ఏ సమస్యా తీర్చాల్సింది లేదు. పెళ్ళిళ్ల పేరయ్యగా మారి ముదురు బ్రహ్మచారులకు పెళ్ళిళ్ళు చేయడం కోసం చేసే ప్రయత్నాలలోనే అయిదేళ్ళూ ఇట్టే గడచిపోతాయని సెటైర్లు పడుతున్నాయి.