ఎన్డీయే కూటమి... `అక్కడ - ఇక్కడ`.. మేలెక్కడ?
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉంది.. మనకు మేలు చేస్తుందని చంద్రబాబు అండ్ కో చాలా నే ఆశలు పెట్టుకున్నారు.
By: Tupaki Desk | 8 Oct 2024 2:30 PM GMTకేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉంది.. మనకు మేలు చేస్తుందని చంద్రబాబు అండ్ కో చాలా నే ఆశలు పెట్టుకున్నారు. అయితే.. ఎంత మన ప్రభుత్వమని చంద్రబాబు అనుకున్నా.. ఆయన ఆశించి న రేంజ్‌కు అటు ఇటుగా కూడా మోడీ సర్కారు పెద్దగా చొరవ చూపడం లేదని స్ఫష్టంగా తెలుస్తోంది. ఏపీలో కూటమి వచ్చిన తర్వాత.. సీఎం చంద్రబాబు అధికారికంగా.. 8 సార్లు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నా రు. వాస్తవానికి ఏపీలో కూటమి సర్కారు ఏర్పడి 100 రోజులు మాత్రమే అయింది.
అయినా.. చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, నిధుల అంశంపై చర్చించేందుకు, రాబట్టు కునేందుకు 8 సార్లు ఢిల్లీ వెళ్లారు. 8 సార్లూ ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు. బాధలు చెప్పారు. బరువు దింపమని పేర్కొన్నారు. దీనికి ప్రతిసారీ తలాడించడమే తప్ప.. మోడీ సర్కారు ఆశించిన విధం గా అయితే.. బాబుకు దన్నుగా నిలవడం లేదు. పైకి అంతా బాగానే ఉన్నా.. ఈ విషయంలో కూటమి నాయకుల మధ్య కూడా చర్చ వస్తోంది.
అమరావతి రాజధానికి అప్పులు ఇప్పిస్తామని కేంద్రం చెప్పింది. బడ్జెట్‌లో ఈ ప్రతిపాదన చేసి రెండు మాసాలు అయిపోయింది. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కూడా వచ్చి అమరావతిలో చూసి వెళ్లారు. ఇంకేముంది.. నిధులు వస్తున్నాయని ప్రకటనలు వచ్చాయి. కానీ, నిధులు మాత్రం రాలేదు. తాజాగా ఈ విషయం పై చంద్రబాబు మోడీని సంప్రదిస్తే.. `ప్లీజ్ వెయిట్` అనే సమాధానం వచ్చింది. ఇక, వెనుకబడిన జిల్లాలకు నిధుల విషయాన్ని `పూర్తి చేసేశాం` అని సరిపుచ్చారు.
మరోపక్క, వరద బాధితులకు ఇవ్వాల్సిన నిధులను రాష్ట్ర సర్కారు విరాళాల రూపంలో తెచ్చుకున్న వాటి నుంచే ఖర్చు పెట్టింది. 700 కోట్లు విరాళాలుగా వస్తే.. 450 కోట్లు ఖర్చు చేశారని పేర్కొంది. మరి ఈ విషయంలో కేంద్రం నుంచి 6800 కోట్లలో(రాష్ట్ర సర్కారు అడిగింది) కనీసం 3000 కోట్లయినా దక్కుతా యని చంద్రబాబు ఆశించారు. కానీ, ఇది అయిపోయిన ముచ్చటగా కేంద్రం స్పష్టం చేస్తోంది. మొత్తానికి.. ఈ పరిణామాలు.. బాబుకు ఇబ్బందిగానే మారాయి. ఆర్థికంగా కాసులు కురిపించకుండా.. మీ పాలన బాగుందని ప్రశంసలు మాత్రమే కురిపిస్తుండడంతో బాబుకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది!!