కూటమి సర్కార్ ఇమేజ్ పెరిగిందా లేక ?
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఈ నెల 12 నాటికి అయిదు నెలలు పూర్తి అవుతాయి.
By: Tupaki Desk | 2 Nov 2024 1:30 PM GMTఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఈ నెల 12 నాటికి అయిదు నెలలు పూర్తి అవుతాయి. కూటమి ప్రభుత్వం మీద పాజిటివిటీ ఎంత పెరిగింది అలాగే వ్యతిరేకత ఏమైనా ఏర్పడిందా అంటే చర్చ మాత్రం చాలా తమాషాగా సాగుతోంది.
ఏపీలో విశేష అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు సీఎం గా ఉన్నారు. ఆయనతో పాటు ఇద్దరు యువ నేతలు కూడా అటూ ఇటూ ఉన్నారు. వారే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ భావి నాయకుడు నారా లోకేష్.
ఇలా బాబు పొలిటికల్ కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా మరో ఇద్దరు భాగస్వామ్యంతో కలసి తన సర్కార్ బండి ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. అయితే టీడీపీ మీద జనాలకు విపరీతమైన ఆశలు ఉన్నాయి. దానికి జనాలు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన అదిరిపోయే మ్యాండేట్ ఒక ఉదాహరణగా చెప్పుకోవాల్సి ఉంది.
మరో వైపు చూస్తే కూటమిని నాయకుడుగా చంద్రబాబు ఉన్నా కూటమి సర్కార్ పవర్ ఫుల్ గా జనంలో ముద్ర వేయలేకపోతోందా అన్న చర్చ ఉండనే ఉంది. ఇక కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా ఆలోచించేలా చేస్తున్నాయి. ప్రధానంగా ఇసుక మద్యం వంటి వాటి విషయంలో ప్రభుత్వ పాలసీలే దెబ్బ తీసేలా ఉన్నాయా అని అంటున్నారు
ఇసుక ఉచితం అని చెబుతున్నా గ్రౌండ్ లెవెల్ లో ఆ పరిస్థితి అయితే లేదు అని ఈ రోజుకీ వినిపిస్తున్న మాట. మరో వైపు చూస్తే మద్యం పాలసీ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు షాపులను వేలం పాట ద్వారా ఇచ్చేశారు. అయితే గతంలో మాదిరిగా మద్యం లైసెన్స్ షాపులను దాటేసి బయటకు వస్తోంది. అందరికీ అందుబాటులోకి మద్యం అన్నట్లుగా బెల్ట్ షాపులకు తెర తీసే కార్యక్రమం సాగుతోంది అన్న విమర్శలు ఉన్నాయి
నులకమంచం మీద వీధులలో పెట్టి మరీ మద్యం అమ్మకాలు చేస్తున్న సన్నివేశాలు కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో మద్యం పాలసీ మందుబాబులకు ఎలా ఉందో కానీ మహిళలకు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఇబ్బందిగా మారుతోంది అన్న చర్చ ఉంది.
ఇక సర్కార్ ఇమేజ్ ని దెబ్బ తీసేలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళల మీద జరుగుతున్న వరస సంఘటనలు అఘాయిత్యాలు. ఘోరాలు నేరాలు. వీటిని అదుపు చేయలేకపోతోంది ప్రభుత్వం అన్నది అయితే ప్రజలలోకి మెల్లగా వెళ్ళిపోతోంది.
ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్నామని చెబుతున్నా ఆ ప్రభావవంతమైన చట్టం పనితీరు అయితే కనిపించడం లేదు అని విమర్శలు ఉన్నాయి. వైసీపీ నేతలు అయితే వందకు పైగా అఘాయిత్యాలు ఏపీలో చోటు చేసుకున్నాయని ఆరోపిస్తున్నారు. ఇసుక దందాలు మద్యం విచ్చలవిడి అమ్మకాలు మహిళల మీద దారుణాలు వైసీపీకి పెద్ద నోరు చేసేలా అవకాశం కల్పిస్తున్నాయి.
కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపుగా ఫోకస్ పెడుతోంది. అలాగే సంక్షేమానికి కూడా మెల్లగా అవకాశం ఇస్తోంది. అయితే ఇవేమీ జనంలోకి పోకుండా ఈ మూడు అంశాలే పెద్ద ఎత్తున చర్చకు తావిస్తున్నాయి. దీని మీద కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా సీరియస్ గానే ఉన్నారు.
ఇక విశాఖ పర్యటనలో ఉన్న చంద్రబాబు అయితే మహిళల మీద అత్యాచారాలు చేసిన వారిని నడి రోడ్డు మీద ఉరి తీయాలని కూడా గట్టిగా చెప్పారు అంటే పరిస్థితి ఏపీలో ఇబ్బందికరంగా ఉందనే అంటున్నారు. అదే విధంగా చూస్తే కనుక బెల్ట్ షాపులు ఎవరైనా నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
ఇక ఇప్పటికే ఉచిత ఇసుక విషయంలో టీడీపీ కూటమి పెద్దలు చెప్పాల్సింది చెబుతున్నారు. ఏది ఏమైనా అనుకున్న స్థాయిలో ఇమేజ్ అయితే ఈ నాలుగైదు నెలలలో బిల్డప్ కావడం లేదు అనే అంటున్నారు. ప్రభుత్వ పనితీరు బాగుందని పాజిటివ్ రావడంతో పాటు గ్రాఫ్ పెరగాలంటే దానికి ఏమి చేయాలన్నది కూటమి సర్కార్ పెద్దలే ఆలోచించుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. లేకపోతే ఇబ్బంది తప్పదనే అంటున్నారు.