కూటమి లెక్కలేంటి? ఐదు ఖాళీల్లో ఎవరికి ఎన్ని?
ఐదు ఖాళీల్లో మూడు టీడీపీ నేతలే ఉన్నారు. వారు కూడా మళ్లీ చాన్స్ అడుగుతున్నారని ప్రచారం ఆశావహుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
By: Tupaki Desk | 24 Feb 2025 7:30 PM GMTఏపీలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి పార్టీల్లో ఆసక్తికరంగా మారాయి. ఐదు ఖాళీలు అవుతుండగా, ఆశావహులు భారీగా ఉండటం.. తమ పార్టీలకు కోటా ఇవ్వాలంటూ జనసేన, బీజేపీ ఒత్తిడి చేయడంతో టీడీపీ ఇరకాటంలో పడుతోందంటున్నారు. ఐదు ఖాళీల్లో మూడు టీడీపీ నేతలే ఉన్నారు. వారు కూడా మళ్లీ చాన్స్ అడుగుతున్నారని ప్రచారం ఆశావహుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
కూటమిలో నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ స్థానాలను ఎలా పంచుకోవాలనే విషయమై గతంలోనే ఒక సర్దుబాటు చేసుకున్నారు. నామినేటెడ్ పదవుల్లో 60 శాతం టీడీపీకి, 30 శాతం జనసేన, 10 శాతం బీజేపీకి కేటాయించాలని కూటమి సమన్వయ కమిటీలో చర్చించారు. అదేవిధంగా ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాలకు ఏర్పడే ఖాళీలను మూడు పార్టీలు సమంగా సర్దుకోవాలని గతంలోనే తీర్మానించుకున్నారు. అయితే ప్రస్తుతం ఐదు ఖాళీలు అవుతుండగా, ఏ పార్టీకి ఎన్ని కేటాయిస్తారనేది సస్పెన్స్ గా మారింది.
ఓట్లు సీట్లు ప్రకారం రాష్ట్రంలో టీడీపీ పెద్దపార్టీగా ఉంది. ఆ తర్వాత జనసేన, బీజేపీ ఉన్నాయి. అయితే రాజ్యసభ ఎన్నికల వరకు వచ్చేసరికి బీజేపీది పైచేయిగా కనిపిస్తోందంటున్నారు. గతంలో మూడు స్థానాలు ఖాళీ అయితే అందులో ఒకటి బీజేపీ తీసుకుంది. ఇంకొకటి జనసేనకు ఇవ్వాల్సివుండగా, రాజీనామా చేసి వచ్చిన నేతలను రీప్లేస్ చేయాల్సివుండటంతో జనసేన వదులుకుంది. ఇక రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడితే ఒకటి జనసేనకు కేటాయించారు. మరొకటి టీడీపీ తీసుకుంది.
గతంలో ఒకసారి బీజేపీకి మరోసారి జనసేనకు చాన్స్ ఇచ్చిన కూటమి.. ఇప్పుడు ఐదు ఖాళీలను సమానంగా పంచుకుంటుందా? లేక ఒక పార్టీ తగ్గి మరో పార్టీకి ప్రాధాన్యమిస్తుందా? అన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే కోటాలో ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, ఇదే సమయంలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మూడు సీట్లలో రెండు చోట్ల టీడీపీ అభ్యర్థులు తలపడుతున్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు పార్టీలు సిటింగ్ ఎమ్మెల్సీకి మద్దతు ప్రకటించాయి.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తున్నందున ఎమ్మెల్యే కోటాలో తమకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జనసేన, బీజేపీ కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేనలో చాలా మంది ఎమ్మెల్సీ చాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర నేతలు కూడా అవే ఆశల్లో బతుకుతున్నారు. చంద్రబాబు 3.0 ప్రభుత్వంలో సోము వీర్రాజుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అయితే ఈ సారి ఆ పార్టీ తరఫున చాలా పోటీ ఉంది. దీంతో సీనియర్ నేతలు కేంద్ర నాయకత్వాన్ని ఆశ్రయిస్తున్నారని చెబుతున్నారు. అటు నుంచి నరుక్కు వస్తే అదనంగా తమకు అవకాశం దక్కుతుందనే భావన బీజేపీ లీడర్లలో కనిపిస్తోంది.
ఇక జనసేన నేతలు మాత్రం భారం అంతా అధినేత పవన్ పైనే వేస్తున్నారు. కనీసం రెండు స్థానాలు దక్కేలా చూడాలని పవన్ పై జనసేన నేతలు ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఐదు ఖాళీలకు కూటమిలో తీవ్ర పోటీ ఉండటంతో ముందుగా ఏ పార్టీకి ఎన్ని స్థానాలనే చర్చే ఆసక్తి పుట్టిస్తోంది.