2025 లో జనగణన...కొత్త నియోజకవర్గాల కోసమే ఎన్డీయే ప్లాన్ !
దేశ జనాభా ఎంత అంటే ఒక అంచనాకు మాత్రమే ఇపుడు చెబుతున్నారు. దీని మీద కచ్చితమైన గణాంకాలు లేవు.
By: Tupaki Desk | 29 Oct 2024 4:22 AM GMTదేశ జనాభా ఎంత అంటే ఒక అంచనాకు మాత్రమే ఇపుడు చెబుతున్నారు. దీని మీద కచ్చితమైన గణాంకాలు లేవు. ఐక్య రాజ్య సమితి ఆ మధ్య చేసిన ప్రకటన మేరకు చూస్తే చైనా కంటే భారత్ రెండు కోట్లు అధికంగా ఉంది. అలా 144 కోట్ల జనాభాతో ప్రపంచంలో నంబర్ వన్ గా ఉంది అని అంటున్నారు.
అయితే జనాభా గణన పూర్తి అయితేనే అసలైన లెక్కలు బయటకు వస్తాయని అంటున్నారు. దేశంలో చివరి సారిగా 2011లో జనాభా గణన జరిగింది. ఆ లెక్కలే ప్రామాణికంగా చేసుకుని ఈ రోజుకీ దేశంలో అభివృద్ధి కార్యకర్మాలను చేపడుతున్నారు. అంటే పద్నాలుగేళ్ల క్రితం లెక్కలతోనే వ్యవహారం అన్న మాట.
దీని వల్ల భారీగా నష్టం జరుగుతోంది అన్న ఆవేదన కొన్ని వర్గాలలో రాష్ట్రాలలో కూడా ఉంది. నిజానికి షెడ్యూల్ ప్రకారం చూస్తే 2021లో జనాభా లెక్కలు తీయాలి. ప్రతీ పదేళ్ళకు దేశంలో జనాభా గణన చేయడం అన్నది ఆనవాయితీగా వస్తోంది.
కరోనా ముమ్మరంగా ఉండడంతో ఆ టైం లో దానికి బిగ్ బ్రేక్ పడిపోయింది. ఆ మీదట రకరకాలైన అడ్డంకులతో జనాభా గణన ఆగిపోతూ వచ్చింది. అయితే ఇపుడు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం జన గణన మీద పట్టుదలగా ఉంది. ఎందుకు అంటే దేశంలో ప్రస్తుతం ఉన్న 543 లోక్ సభ సీట్లను పునర్ వ్యవస్థీకరించి జనాభా ప్రాతిపదికన మరింతగా పెంచాలని కేంద్రం ఆలోచిస్తోంది.
దీని వల్ల లోక్ సభ సీట్లు ఏకంగా 830 దాకా పెరగవచ్చు అని ఒక లెక్క ఉంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండగా నియోజకవర్గాల పునర్ విభజన జరిగితే కనుక కచ్చితంగా అది బీజేపీకే ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. తమకు బలం ఉన్న వాటిని విభజించుకుంటూ భారీగా రాజకీయ లబ్దికి తెర తీసే అవకాశం ఉంది అని విపక్షాలు అనుమానిస్తున్నాయి.
అయితే ఎవరేమనుకున్నా జనాభా గణనను ముందుగా చేపట్టి ఆ మీదట లోక్ సభ నియోజకవర్గాలను పునర్ విభజన చేయాలని ఎండీయే సర్కార్ అజెండాగా పెట్టుకుంది. 2025లో జనాభా గణన మొదలవుతుంది అని అంటున్నారు. రెండేళ్ళ పాటు ఈ కార్యక్రమం సాగుతుందని మొత్తం డేటా అంతా 2026 నాటికి కేంద్రానికి చేరుతుందని దానిని ఆసరాగా చేసుకుని జమిలి ఎన్నికలు అయితే 2027లోగా లేకపోతే 2028లోగా లోక్ సభ సీట్ల విభజన పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని కేంద్రం చూస్తోంది అని అంటున్నారు
ఈసారి జనాభా గణన అన్నది డిజిటల్ విధానంలో చేపడతారు అని అంటున్నారు. సమగ్రమైన సర్వే ద్వారా దేశంలో అసలైన జనాభా ఎంత అన్నది కేంద్రం ప్రకటిస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే కుల గణన ముందు చేపట్టాలని విపక్షాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కుల గణన చేపట్టినట్లు అయితేనే బహుజనులకు న్యాయం జరుగుతుందని అంటున్నాయి. మరి జనగణన అన్నది ముందు జరుగుతుందా లేక కుల గణన జరుగుతుందా అన్నది చూడాలి. జనగణన జరిగితేనే లాభం అన్నది తెలుసు కాబట్టి ఎన్డీయే ఆ వైపునకే మొగ్గు చూపిస్తుందని అంటున్నారు.