Begin typing your search above and press return to search.

ఎన్డీయే పాలనలో 19 రాష్ట్రాలు...ఇండీ కూటమికి అవేనా ?

ఒక్కసారి దేశ రాజకీయ మ్యాప్ ని కనుక చూస్తే అంతా కాషాయమయం అన్నట్లుగా కనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   25 Nov 2024 3:34 AM GMT
ఎన్డీయే పాలనలో  19 రాష్ట్రాలు...ఇండీ కూటమికి అవేనా ?
X

ఒక్కసారి దేశ రాజకీయ మ్యాప్ ని కనుక చూస్తే అంతా కాషాయమయం అన్నట్లుగా కనిపిస్తుంది. దేశంలో ఈ రోజున 28 రాష్ట్రాలు ఉంటే అందులో 19 రాష్ట్రాలలో బీజేపీ ఎన్డీయే ప్రభుత్వాలు ఉన్నాయంటే కాషాయం పార్టీ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతోంది అంటున్నారు.

మొత్తం 28 రాష్ట్రాలలో 19 అంటే కేవలం 9 రాష్ట్రాలే ఇండియా కూటమిలో ఉన్నాయన మాట. అంటే మూడింట రెండు వంతుల రాష్ట్రాలు బీజేపీ దాని మిత్ర పక్షాల పాలనలో ఉన్నాయన్న మాట. కాంగ్రెస్ జాతీయ పార్టీగా తొలి మూడున్నర దశాబ్దలా కాలంలో ఈ విధంగానే రాజకీయ పలుకుబడిని చాటుకుంది. ముఖ్యంగా యాభై నుంచి అరవై దశకం చివరి దాకా చూస్తే కాంగ్రెస్ అనాటి మొత్తం రాష్ట్రాలలో పాలన చేస్తూ ఉండేది. ఆ తరువాత ప్రాంతీయ పార్టీలు పుట్టి కాంగ్రెస్ రాజకీయ అస్థిత్వాన్ని సవాల్ చేశాయి.

దాంతో పాటు వామపక్షాలు బీజేపీ వంటివి కూడా తమ రాజకీయ విస్తృతిని పెంచుకున్నాయి. ఈ మొత్తంలో రాజకీయ పరిణామాలలో కూడా కాంగ్రెస్ మెజారిటీ స్టేట్స్ లో అధికారంలో ఉండేది. ఇక 1990 తరువాత పరిస్థితి మారింది. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో మెల్లగా పతనం చెందడం ఆరభించాక ఆ స్థానాన్ని మధ్యేవాద పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఆక్రమించడం మొదలెట్టాయి. ఇక 1990 దశకం చివరికి వచ్చేసరికి దేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ మెల్లగా రాష్ట్రాల మీద కన్ను వేసింది.

ఆ విధంగా పలు రాష్ట్రాలలో బీజేపీ తన పాలనను సుస్థిరం చేసుకుంది. 2014 నుంచి మోడీ పాలన దేశంలో మొదలయ్యాక చూస్తే కనుక అనేక రాష్ట్రాలు బీజేపీ ఏలుబడిలోకి వచ్చాయి ఎన్నడూ విరబూయని కమలం ఈశాన్య రాష్ట్రాలలో పూయడం వెనక కూడా మోడీ అమిత్ షా వ్యూహాలు ఉన్నాయి అంటున్నారు.

ఈ విధంగా తనదైన పొత్తులతో ఎత్తులతో బీజేపీ ఎన్డీయేను విస్తరిస్తూ ముందుకు పోతోంది. దాంతో ఈ రోజున దేశంలో 19 రాష్ట్రాలలో బీజేపీ దాని మిత్ర పార్టీలు ఉన్నాయి. తాజాగా గెలిచిన మహారాష్ట్రతో కలుపుకుంటే బీజేపీ 19 స్టేట్స్ లో ఉన్నట్లుగా లెక్క వేస్తున్నారు.

ఇక ఇండియా కూటమి పార్టీలు తీసుకుంటే తమిళనాడు , కర్ణాటక , తెలంగాణా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, జార్ఖండ్, మిజోరాం లలో మాత్రమే ఉన్నాయి. దేశంలో పెద్ద రాష్ట్రాలుగా ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటివి ఎన్డీయే చేతిలోనే ఉండడం విశేషం.

ఇక ఇండియా కూటమి చేతిలో ఉన్న పెద్ద రాష్ట్రాలలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్నాటక మాత్రమే అని చెప్పుకోవాల్సి ఉంది. మొత్తం మీద చూస్తే రానున్న రోజులలో జరగనున్న ఢిలీని కూడా కైవశం చేసుకోవాలని అలాగే 2026లో జరిగే పశ్చిమ బెంగాల్ ని కూడా తమ వైపు తిప్పుకోవాలని తెలంగాణాలో జెండా పాతాలని బీజేపీ చూస్తోంది.

కర్ణాటకలో మళ్లీ అధికారం దక్కుతుంది అని నమ్మకం బీజేపీకి ఉంది. ఇటీవలే కేరళలో ఎంపీ సీటుతో బోణీ కొట్టింది. తమిళనాడులో కొత్త పొత్తుల కోసం చూస్తోంది. సో ఈ దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో ఎన్డీయే పాలనను తెచ్చి మొత్తం కాషాయ మయం చేయాలని ఆ పార్టీ చూస్తోంది అని అంటున్నారు. మరి బీజేపీ వ్యూహాలు ఫలిస్తాయా అంటే ఈ సక్సెస్ ట్రాక్ కంటిన్యూ అయితే అసాధ్యం కాబోదని అంటున్నారు.