Begin typing your search above and press return to search.

చంద్రసేన సునామీ దెబ్బకు జిల్లాలకు జిల్లాలే మటాష్

హోరాహోరీగా సాగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన స్పష్టత వచ్చేసింది.

By:  Tupaki Desk   |   4 Jun 2024 9:50 AM GMT
చంద్రసేన సునామీ దెబ్బకు జిల్లాలకు జిల్లాలే మటాష్
X

హోరాహోరీగా సాగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన స్పష్టత వచ్చేసింది. మొత్తంగా ఒకట్రెండు స్థానాల్లో తప్పించి.. ఇప్పుడున్న ఫలితాలే కన్ఫర్మ్ అయ్యే వీలుంది. మధ్యాహ్నం 2 గంటలు దాటటం.. దాదాపుగా అన్ని నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చివరి దశకు చేరుకున్న పరిస్థితి. దీంతో.. ఇప్పటికే వెల్లడైన అధిక్యతలు గెలుపుగా మారటం ఖాయమని చెప్పాలి. తాజా ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి చంద్రసేన (కూటమి మద్దతుదారులు పెట్టుకున్న ముద్దుపేరు) ఊచకోతకు అధికార వైసీపీ విలవిలాడిన పరిస్థితి.

మొత్తం 175 అసెంబ్లీ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వేళకు వైసీపీ 13 స్థానాల్లో మాత్రమే అధిక్యతను ప్రదర్శిస్తుండగా.. మిగిలిన 162 స్థానాల్లో కూటమి దూసుకెళుతోంది. ఇంత రికార్డు విజయం ఎలా సాధ్యమైంది? అన్న ప్రశ్న వేసుకుంటే.. జిల్లాలకు జిల్లాల చొప్పున కూటమి ఖాతాలో పడటమే దీనికి కారణంగా చెప్పాలి. పాత జిల్లాల (ఉమ్మడి జిల్లాలు) లెక్క చూస్తే.. తాజా విజయం ఎంత పెద్దదన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

చంద్రసేన క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల విషయానికి వస్తే (బ్రాకెట్లో ఉన్న సంఖ్య జిల్లాలోని మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు) ఉమ్మడి జిల్లాలు మొత్తం 13 ఉన్నాయి. వాటిల్లో క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలు ఆరు. అంటే.. 45 శాతం జిల్లాల్లో వైసీపీ ఖాతా కూడా ఓపెన్ చేయలేని పరిస్థితి. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏమంటే.. వైసీపీకి పట్టు ఉందని చెప్పే నెల్లూరులోనూ వైసీపీ అభ్యర్థి ఒక్కరు కూడా గెలవకపోవటం చూస్తే చంద్రసేన ఎన్నికల ఊచకోత ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

క్రిష్ణా (16)

గుంటూరు (17)

తూర్పుగోదావరి (19)

విజయనగరం (9)

శ్రీకాకుళం (10)

నెల్లూరు (10)

ఒక్క స్థానం మిస్ అయిన జిల్లాలు

పశ్చిమగోదావరి జిల్లా (15)

కర్నూలు (14)

ప్రకాశం (12)

ఈ జిల్లాల్లో కర్నూలు.. ప్రకాశం జిల్లాలు వైసీపీ అధిక్యతలో ఉండేవి. అలాంటి ఈ రెండు జిల్లాల్లో వైసీపీ అధిక్యంలో ఉన్న స్థానాలు కేవలం రెండు మాత్రమే.

రెండేసి స్థానాల చొప్పున అధిక్యం లేని జిల్లాలు

విశాఖపట్నం (15)

అనంతపురం (14)

ఈ రెండు జిల్లాలు సంప్రదాయబద్ధంగా కూటమికి అనుకూలం. అయితే.. గత ఎన్నికల్లో వైసీపీ తన అధిక్యతను ప్రదర్శించింది. తాజా ఎన్నికల్లో మొత్తం 29 స్థానాల్లో నాలుగు స్థానాల్లో మాత్రమే అధిక్యతను ప్రదర్శిస్తున్న పరిస్థితి.

మూడేసి స్థానాలు మిస్ అయిన జిల్లా

చిత్తూరు (14)

ఈ జిల్లాలో వైసీపీ.. టీడీపీ కూటమి అధిక్యత పోటాపోటీగా ఉంటుంది. అలాంటి జిల్లాలో వైసీపీ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే తన అధిక్యతను నిలుపుకుంది.

కంచుకోటలో నాలుగు స్థానాలే

కడప (10)

వైసీపీ ఘోర పరాజయం ఎంతన్న విషయాన్ని ఉమ్మడి కడప జిల్లాలో వచ్చిన ఫలితం చెప్పేస్తుంది. వైఎస్ కుటుంబానికి ఈ జిల్లా కంచుకోటగా చెబుతారు. అలాంటి ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో నాలుగు స్థానాల్లో మాత్రమే వైసీపీ అధిక్యతను ప్రదర్శిస్తోంది. ఆ నాలుగు స్థానాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన పులివెందుల నియోజకవర్గం ఉంది. ఆయన్ను మినహాయిస్తే ఆ పార్టీ అధిక్యంలో ఉన్నది మూడు చోట్లనే.

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ అధిక్యతను ప్రదర్శిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలు చూస్తే..

పులివెందుల, బద్వేలు, రాజంపేట, రాయచోటి.