అనపర్తి ఎమ్మెల్యే, నరసాపురం ఎంపీ టిక్కెట్లపై ఆసక్తికరమైన అప్ డేట్!
కూటమిలో భాగంగా టీడీపీ, బీజేపీ, జనసేన ల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు ఇంకా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 13 April 2024 5:30 AM GMTకూటమిలో భాగంగా టీడీపీ, బీజేపీ, జనసేన ల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు ఇంకా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటికీ పలు స్థానాల్లో చర్చలు, మార్పులు, చేర్పులూ ఒక కొలిక్కి రాలేదని అంటున్నారు. పైగా... అనపర్తి ఎమ్మెల్యే, ఉండి ఎమ్మెల్యే, నరసాపురం ఎంపీ స్థానాలు ఇప్పుడు టీడీపీకి అత్యంత క్లిష్ట సమస్యలుగానూ, ప్రిస్టేజ్ ఇష్యూలుగానూ మారిపోయాయని అంటున్నారు.
రఘురామ కృష్ణంరాజుకు ఉండి స్థానం కేటాయిస్తే అక్కడ టీడీపీ లెక్కలు మారిపోతున్నాయనే చర్చ తెరపైకి రావడంతో పాటు.. అనపర్తిలో నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి కచ్చితంగా టిక్కెట్ కేటాయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. ఇదే సమయంలో నరసాపురం ఎంపీ టిక్కెట్ కూడా ఇప్పుడు టీడీపీకి రఘురామ కృష్ణంరాజు రూపంలో ప్రిసేట్జ్ ఇష్యూ అయ్యిందని చెబుతున్నారు. ఈ సమయంలో... మూడు పార్టీల అగ్రనేతలూ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా బీజేపీ నేతల ముందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఒక కీలక ప్రపోజల్ పెట్టారని చెబుతున్నారు. ఇందులో భాగంగా... అనపర్తి అసెంబ్లీ టిక్కెట్ తమకు కేటాయించాలని కోరినట్లు తెలుస్తుంది. దానికి బదులుగా తంబళ్లపల్లె సీటును బీజేపీ తీసుకోవాలని చంద్రబాబు ప్రతిపాదించారని అంటున్నారు. ప్రస్తుతం తంబళ్లపల్లెలో టీడీపీ అభ్యర్థిగా జయచంద్రా రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో... ఈ టిక్కెట్ బీజేపీకి చేరనుందని తెలుస్తుంది!
ఇదే సమయంలో... నరసాపురం ఎంపీ టిక్కెట్ విషయంలోనూ చంద్రబాబు.. బీజేపీ ముందు కొత్త ప్రతిపాదన పెట్టారని అంటున్నారు. ఇందులో భాగంగా... రానున్న ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ టిక్కెట్ రఘురామ కృష్ణంరాజు కోసం టీడీపీకి కేటాయించాలని.. అందుకు ప్రతిగా ఉండి ఎమ్మెల్యే టిక్కెట్ శ్రీనివాస్ వర్మ కు తీసుకోవాలని సూచించారని అంటున్నారు. పైగా... ఈ ప్రతిపాదనకు బీజేపీ నుంచి సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని కథనాలుస్తుండటం గమనార్హం!
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ భేటీలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన ప్రతిపాదనలను బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లిన అనంతరం అధికారిక ప్రకటన ఉండొచ్చని చెబుతున్నారు!