Begin typing your search above and press return to search.

సీక్రెట్ గా పెళ్లి చేసుకొని సర్ ప్రైజ్ చేసిన నీరజ్ చోప్రా.. వధువు ఎవరంటే?

పెళ్లి వేదిక విషయానికి వస్తే.. హిమాచల్ ప్రదేశ్ లోని ఒక ప్రాంతంగా చెబుతున్నారు. ఈ పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ గా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   20 Jan 2025 6:04 AM GMT
సీక్రెట్ గా పెళ్లి చేసుకొని సర్ ప్రైజ్ చేసిన నీరజ్ చోప్రా.. వధువు ఎవరంటే?
X

మరో సెలబ్రిటీ క్రీడాకారుడు ఒక ఇంటివాడు అయ్యాడు. రంగం ఏదైనా కావొచ్చు.. ఇటీవల కాలంలో ప్రముఖుల పెళ్లిళ్లు ధూంధాంగా సాగుతున్నాయి. అందుకు భిన్నంగా జావెలిన్ సూపర్ స్టార్.. ఒలింపిక్ విజేత.. ప్రపంచ చాంపియన్ అయిన నీరజ్ చోప్రా మాత్రం గుట్టుచప్పుడు కాకుండా.. అత్యంత సన్నిహితుల మధ్య రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఇంతకు వధువు ఎవరన్న విషయానికి వస్తే.. హర్యానాకు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి హిమానీ మోర్ గా తేలింది.

తమ పెళ్లి ఫోటోల్ని నీరజ్ చోప్రా సోషల్ మీడియాలో షేర్ చేయటంతో అతడి పెళ్లి వ్యవహారం వెలుగు చూసింది. నీరజ్ చోప్రా షేర్ చేసిన పెళ్లి ఫోటోలు అందరిని సర్ ప్రైజ్ చేశాయి. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లుగా పేర్కొంటూ.. ఆశీస్సులు అందించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారీ 27 ఏళ్ల క్రీడాకారుడు.

రెండు రోజుల క్రితం జరిగిన ఈ పెళ్లి వేడుకకు వేదికగా నిలిచిన ప్లేస్ గురించి వివరాలు వెల్లడించలేదు. కొత్త జంట హనీమూన్ కు వెళ్లినట్లుగా నీరజ్ మామ భీమ్ వెల్లడించారు. తనను అంతకు మించిన వివరాలు ఏమీ అడగొద్దని పేర్కొన్నారు. నీరజ్ చోప్రా టాలెంట్ 2020 ఒలింపిక్స్ సందర్భంగా వెలుగు చూసింది. ఎలాంటి అంచనాలు లేని వేళ.. ఏకంగా బంగారు పతకం గెలవటం ద్వారా.. కోట్లాది మంది భారతీయులకు ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. జావెలిన్ త్రో విభాగంలో భారత్ కు దక్కిన మొట్టమొదటి ఒలింపిక్ పతకం నీరజ్ చోప్రా అందించిందే. అది కూడా బంగారు పతకం కావటంతో పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తటం తెలిసిందే. 2020లో మొదటి బంగారు పతకాన్ని దేశానికి అందించిన నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్ లో మాత్రం రెండో స్థానంలో నిలిచి.. సిల్వర్ మెడల్ ను సొంతం చేసుకున్నాడు.

గత ఏడాది అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్ ప్రపంచంలోనే అత్యుత్తమ జావెలిన్ త్రోయర్ గా నీరజ్ చోప్రాను ఎంపిక చేసింది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన అండర్సన్ పీటర్ ను పక్కన పెట్టి మరీ.. ఈ పురస్కారం నీరజ్ చోప్రాకు లభించటం విశేషంగా చెప్పాలి.

వధువు విషయానికి వస్తే ఆమె ప్రస్తుం అమెరికాలో క్రీడలకు సంబంధించిన కోర్సు చదువుతున్నట్లుగా చెబుతున్నారు. నీరజ్ చోప్రా పెళ్లి విషయం వెలుగు చూసిన తర్వాత.. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కొన్ని వివరాలు వెలుగు చూశాయి. పెళ్లి వేడుక్కి కేవలం యాభై నుంచి అరవై మంది మాత్రమే హాజరయ్యారని.. అది కూడా అత్యంత సన్నిహితుల మధ్యనే పెళ్లి వేడుక జరిగినట్లుగా వెల్లడైంది. పెళ్లి వేదిక విషయానికి వస్తే.. హిమాచల్ ప్రదేశ్ లోని ఒక ప్రాంతంగా చెబుతున్నారు. ఈ పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ గా చెబుతున్నారు.

ప్రస్తుతం హనీమూన్ కు వెళ్లిన నీరజ్ చోప్రా దంపతులు.. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తోంది. తామిద్దరం ప్రేమతో ఒక్కటయ్యామని.. ఎప్పటికీ సంతోషంగా ఉంటామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నీరజ్.. హిమానీ పేర్లు రాసి మధ్యలో హార్ట్ సింబల్ పెట్టారు. పెళ్లి కుమార్తె సోనీపట్ కు చెందిన వారిగా చెబుతున్నారు.