Begin typing your search above and press return to search.

భారత్ లో ఒలింపిక్స్.. ఇదే సరైన సమయం.. నీతా అంబానీ

ఈ మెగా ఈవెంట్ ను చేపట్టేందుకు భారత్ కు ఇదే సరైన సమయం అని వ్యాఖ్యానించారు. భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని ఆమె గుర్తు చేశారు.

By:  Tupaki Desk   |   17 Feb 2025 11:54 AM GMT
భారత్ లో ఒలింపిక్స్.. ఇదే సరైన సమయం.. నీతా అంబానీ
X

ఒలింపిక్స్.. ప్రపంచ క్రీడా మహా సంగ్రామం.. వీటిని నిర్వహించాలంటే భారీ ఖర్చు.. పేద దేశాలకు ఆ స్థోమత ఉండదు.. వర్ధమాన దేశాలకూ తలకుమించిన భారమే.. కేవలం ధనిక దేశాలకే ఒలింపిక్స్ ఆతిథ్య భాగ్యం దక్కుతుంది. అయితే, ఇంత ఘన చరిత్ర ఉన్న భారతదేశం.. ఒలింపిక్స్ ఎందుకు నిర్వహించదు? అనే ప్రశ్న రావడం సహజం. అయితే, 2024లో నిర్వహించిన పారిస్ ఒలింపిక్స్ కోసం ఫ్రాన్స్ 9.7 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. అంటే మన రూపాయిల్లో రూ.84 వేలకోట్లు అన్నమాట.

మరి మన ఖర్చు ఎంతో...?

ఒలింపిక్స్ నిర్వహణ.. కొన్నేళ్ల నుంచి ప్రధాని మోదీ నుంచి కేంద్ర మంత్రుల దాక చెబుతున్న మాట. అయితే, ఇదేమంత సులభం కాదు. అలాగని అసాధ్యమూ కాదు. కాకపోతే ఖర్చు గురించే ఆలోచన. వాస్తవానికి పారిస్ ఒలింపిక్స్ ఖర్చు.. ఇటీవలి కాలంలో అతి తక్కువ ఖర్చు అయినది పారిస్ లోనే. ఎందుకంటే అప్పటికే సిద్ధమైన స్టేడియాలు ఉండడం, పర్యావరణ హిత చర్యలతో ఖర్చు తగ్గింది. కానీ, అన్నిటికీ ఇది సాధ్యం కాదు కదా..? పారిస్ మూడు సార్లు ఒలింపిక్స్ నిర్వహించింది. భారత్ తొలిసారిగా అందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటి లెక్కల ప్రకారం చూసినా.. ఖర్చు రూ.లక్ష కోట్లుగా అంచనా వేయొచ్చు.

2028 ఒలింపిక్స్ కు అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరం వేదిక కానుంది. 2032లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ ఆతిథ్యం ఇవ్వనుంది. అంటే ఇక బిడ్ వేయాల్సింది 2036 ఒలింపిక్స్ కే. ఇప్పటినుంచి 12 ఏళ్లు. దీంతో ఖర్చు కూడా పెరుగుతుందని భావించాలి. ఎందుకంటే.. ఇప్పుడు రూ.లక్ష కోట్లు అనుకుంటే 2036కు అది రూ.2 లక్షల కోట్లు దాటొచ్చు. ఇంకా ఎక్కువ కూడా కావొచ్చు.

కాగా అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య అయినా నీతా అంబానీ ఒలింపిక్స్ నిర్వహణపై స్పందించారు. ఈ మెగా ఈవెంట్ ను చేపట్టేందుకు భారత్ కు ఇదే సరైన సమయం అని వ్యాఖ్యానించారు. భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని ఆమె గుర్తు చేశారు. నీతా అంబానీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) సభ్యురాలు కావడం గమనార్హం. 2036 ఒలింపిక్స్ కు బిడ్ వేస్తామని మోదీ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఆతిథ్య హక్కులు లభిస్తే మాత్రం అత్యంత పర్యావరణ హితం (గ్రీనెస్ట్)గా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఒలింపిక్స్ ఆతిథ్యం దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

కొసమెరుపు: భారత్ లో తొలిసారి క్రికెట్ వన్డే ప్రపంచ కప్ జరిగింది 1988లో. దీనికి స్పాన్సర్ నీతా అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థ. ఆ తర్వాత భారత్ లో క్రికెట్ మేనియా ఎక్కడికో వెళ్లిపోయింది.