రోహిత్ కు నీతా అంబానీ ‘బుగాటి’ గిఫ్ట్.. నిజమెంత?
ఏఐతో ఇప్పుడు సర్వం చేసేయవచ్చు. తిమ్మిని బమ్మిని చేసి సోషల్ మీడియాలో వదలవచ్చు. దాన్నే నిజం అనుకొని నమ్మి జనం షేర్లు చేసి వైరల్ చేయవచ్చు.
By: Tupaki Desk | 19 March 2025 8:34 AM ISTఏఐతో ఇప్పుడు సర్వం చేసేయవచ్చు. తిమ్మిని బమ్మిని చేసి సోషల్ మీడియాలో వదలవచ్చు. దాన్నే నిజం అనుకొని నమ్మి జనం షేర్లు చేసి వైరల్ చేయవచ్చు. అయితే ఇది నిజమా? కాదా? అన్నది తెలుసుకోవడం ఈ యుగంలో చాలా కష్టమైపోయింది. ఇప్పుడు నీతా అంబానీ మన ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ కు ఖరీదైన బుగాటి కారు గిఫ్ట్ గా ఇచ్చిందన్నవార్త వైరల్ అయ్యింది. మరి ఇందులో నిజం ఎంత? అన్న దానిపై ఇప్పుడు చర్చోపచర్చలు సాగుతున్నాయి.
భారత క్రికెట్ జట్టు దాదాపు ఒక దశాబ్దం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న సందర్భంగా సంబరాలు మిన్నంటాయి. ఈ విజయం క్రికెటర్లతో పాటు అభిమానులకు కూడా ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ క్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఖరీదైన బుగాటీ కారును బహుమతిగా ఇచ్చారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ముంబై ఇండియన్స్ ఐపీఎల్ జట్టుకు రోహిత్ శర్మ చాలా కాలంగా కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ జట్టుకు రిలయన్స్ సంస్థ యజమానిగా ఉంది. ఈ నేపథ్యంలో "ముంబై ఇండియన్స్ లవర్స్" అనే ఫేస్‌బుక్ పేజీలో ఈ కారు బహుమతికి సంబంధించిన పోస్ట్ రావడంతో చాలా మంది అది నిజమని నమ్మారు. దానిని విపరీతంగా షేర్ చేశారు. కానీ, ఆ తర్వాత అది ఫేక్ అని తేలింది. అయినప్పటికీ, సోషల్ మీడియాలో ఆ తప్పుడు ప్రచారం ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఈ వార్త ఫేక్ అని తేలడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. రోహిత్ శర్మకు నీతా అంబానీ బహుమతి ఇస్తున్నట్లుగా ఉన్న ఫోటోలు పూర్తిగా కృత్రిమ మేధస్సు (AI) ద్వారా రూపొందించబడ్డాయి. ఇది ఎలా సాధ్యమైందంటే ఈ ఖరీదైన కారు బహుమతికి సంబంధించి ప్రధాన మీడియాలో ఎక్కడా వార్తలు రాలేదు. అలాగే, రిలయన్స్ సంస్థ కూడా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇక ఫేస్‌బుక్ పేజీలో ఉన్న రోహిత్ , నీతా అంబానీకి సంబంధించిన రెండు చిత్రాలను జాగ్రత్తగా పరిశీలిస్తే, అవి నకిలీవని ఎవరైనా సులభంగా గుర్తించవచ్చు. రెండు చిత్రాలలో రోహిత్ వేసుకున్న జెర్సీలో తేడా ఉంది. ఒక దానిపై 'డ్రీమ్ 11' అని ఉండగా, మరొక దానిపై కేవలం 'ఇండియా' అని మాత్రమే ఉంది. అలాగే, నీతా అంబానీ ధరించిన చీర రంగు దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ, దాని అంచుల్లో రంగు వేర్వేరుగా ఉంది. అంతేకాకుండా, రెండు చిత్రాలలో ఉన్న కారు రంగులు కూడా భిన్నంగా ఉన్నాయి.
వీటన్నిటితో పాటు, సైట్ ఇంజిన్ అనే AI డిటెక్షన్ టూల్‌లో ఈ చిత్రాన్ని పరీక్షించినప్పుడు, అది 97 శాతం AI ద్వారా రూపొందించబడిన చిత్రమని తేలింది.
ఈ మధ్య కాలంలో ఉచిత AI ఇమేజ్ జనరేటర్ టూల్స్ అందుబాటులోకి రావడంతో చాలా మంది ఇలాంటి నకిలీ చిత్రాలను సృష్టిస్తున్నారు. సరదా కోసం చేసిన ఇలాంటి పనులు కొందరు నిజమని నమ్మడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నమ్మకూడదు. ఏదైనా అనుమానం ఉంటే దానిని నిర్ధారించుకున్న తర్వాతే ఇతరులకు పంపించాలి.