Begin typing your search above and press return to search.

పేపర్ లీక్.. రిజల్ట్ తేడా.. రాజకీయ అగ్నిలో 'నీట్' మంటలు

ఎంబీబీఎస్ వంటి గొప్ప చదువులోకి ప్రవేశం కల్పించే నీట్ ప్రవేశ పరీక్ష ఈ ఏడాది అత్యంత వివాదం రేపుతోంది

By:  Tupaki Desk   |   7 Jun 2024 8:42 PM GMT
పేపర్ లీక్.. రిజల్ట్ తేడా.. రాజకీయ అగ్నిలో నీట్ మంటలు
X

ఎంబీబీఎస్ వంటి గొప్ప చదువులోకి ప్రవేశం కల్పించే నీట్ ప్రవేశ పరీక్ష ఈ ఏడాది అత్యంత వివాదం రేపుతోంది. మే 5న నీట్ జరగ్గా.. ఫలితాలు ఈ నెల 4న విడుదలయ్యాయి. అయితే, వీటిపై ఇప్పటికే పలువురు అభ్యర్థులు, తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నీట్ నిర్వహణ సంస్థ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పందించాలంటూ పట్టుబడుతున్నారు. ఇక మంగళవారం నాటి నీట్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 67 మందికి టాప్ ర్యాంక్‌ వచ్చింది.

ఎన్నికల ఫలితాల రోజునే..

సరిగ్గా ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజునే.. నీట్ ఫలితాలు వెలువడడం కూడా అనుమానాలు రేకెత్తిస్తోంది. ఎన్నికల ఫలితాల రోజు కావడంతో అందరూ ఆ హడావుడిలో ఉంటారని.. నీట్ అక్రమాలను ఎవరూ పట్టించుకోరనే ఉద్దేశంలో ఇలా చేశారనే వ్యాఖ్యలు చేస్తున్నారు. నీట్ పేపర్ లీకేజీ వదంతులపై ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ స్పందించారు. ఆయన కూడా ఆరోపణలు చేశారు. విజయవాడకు చెందిన ప్రముఖ వైద్యుడు కొంగర రవికాంత్ కూడా అనుమానాలు వ్యక్తం చేశారు.

ఇక్కడే అనుమానం..

ఒకే కేంద్రంలో నీట్ రాసిన ఆరుగురికి బై టు బై (720/720) మార్కులు రావడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. పేపర్‌ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఇది మరింత ఆజ్యం పోసింది. కాగా, మే 5 సాయంత్రం 4 గంటల సమయంలో ప్రశ్నపత్రం ఇంటర్నెట్‌ లో హల్‌ చల్‌ చేసిందని.. అయితే, అప్పటికే దేశవ్యాప్తంగా పరీక్ష మొదలైందని ఎన్టీఏ స్పష్టం చేసింది. దీంతో పేపర్ లీకేజీ లేదని తేల్చింది.

గొంతు విప్పిన ప్రియాంక

నీట్ ఫలితాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ అగ్ర నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. గతంలోనే పేపర్ లీకేజీపై ప్రియాంక ఆరోపణలు చేశారు. తాజాగా ఫలితాల్లోనూ కుంభకోణం జరిగినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. ఫలితాల వెల్లడి తర్వాత పలువురు విద్యార్థులు ఆత్మహత్యలపై ప్రియాంక దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. లీకేజీ ఆరోపణలపై అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.