ఔను.. పరీక్ష ముందు రోజు రాత్రే నీట్ పేపర్ మాకు అందింది.. ఒప్పుకొన్న అభ్యర్థులు!
నీట్ అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG-2024)లో అక్రమాలు జరిగాయంటూ మొదటినుంచీ కథనాలు వస్తున్నాయి
By: Tupaki Desk | 20 Jun 2024 9:42 AM GMT'మోసగాడు వైద్యుడు అయితే సమాజానికే హాని''.. వైద్య విద్యలో ప్రవేశానికి ఉద్దేశించిన 'నీట్' పేపర్ లీక్ కు సంబంధించిన కేసు విచారణలో గత మంగళవారం సుప్రీం కోర్టు వ్యాఖ్య ఇది. ఇప్పుడు అనుకున్నంతా అయింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) వంటి ప్రతిష్ఠాత్మక పరీక్ష పేపర్ లీక్ అయింది. మెడికల్ ఎంట్రన్స్ కాబట్టి.. దేశంలో అత్యంత భారీ పేపర్ లీక్ ఇదేనని భావించాలేమో..?
నీట్ అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG-2024)లో అక్రమాలు జరిగాయంటూ మొదటినుంచీ కథనాలు వస్తున్నాయి. వీటికి బలమైన ఆధారాలూ లభించాయి. ప్రముఖ యూ ట్యూబర్ ధ్రువ్ రాఠీ వంటి వారు సైతం వీటిని ప్రస్తావించారు. బిహార్ లో నీట్ ప్రశ్నపత్రం లీకైనట్లు బయటపడగా, కేద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దాన్ని కొట్టిపారేశాయి. ఇప్పుడు లీక్ నిజమేనని స్పష్టమైంది. పరీక్ష ముందు రోజు రాత్రే నీట్ ప్రశ్నపత్రం తమకు అందిందని బిహార్ లో అరెస్టయిన కొందరు విద్యార్థులు బిహార్ సిట్ పోలీసులకు తెలిపారు.
నీట్ పేపర్ లీక్ పై బిహార్ సర్కారు ఏర్పాటు చేసిన సిట్ 14 మందిని అరెస్టు చేసింది. ఇందులో జూనియర్ ఇంజినీర్, ముగ్గురు నీట్ అభ్యర్థులూ ఉన్నారు. అయితే, ఓ అభ్యర్థి ఆ జూనియర్ ఇంజినీర్‌కు మేనల్లుడు. ఇతడు రాజస్థాన్ కోటాలో నీట్ కు సిద్ధం అవుతున్నాడు. అయితే, నీట్ మే 5న జరగ్గా.. మే 4న ఇతడికి మేనమామ ఫోన్ చేశాడు. పరీక్షకు అన్నీ సిద్ధం చేశానని రమ్మని పిలిచాడు. స్నేహితులతో కలిసి వెళ్లిన అతడికి నీట్ పేపర్ తో పాటు ఆన్సర్ షీట్ కూడా ఇచ్చారు. రాత్రంతా బట్టీ పట్టి పరీక్షకు వెళ్లిన వారికి.. రాత్రి చదివిన పేపర్ లోని ప్రశ్నలే వచ్చాయి. దీంతో పేపర్ లీక్ జరిగినట్లు స్పష్టం అవుతోంది. ఇదే విషయాన్ని ఆ అభ్యర్థి పోలీసులకు రాసిచ్చాడు.
కాగా, నీట్ అవకతవకలపై దాఖలైన పిటిషన్ల మీద సుప్రీం కోర్టు గురువారం మరోసారి విచారణ జరిపింది. వివిధ హైకోర్టులల్లో జరుగుతున్న విచారణలపై స్టే ఇచ్చింది. అన్ని పిటిషన్లను సుప్రీంకు బదిలీ చేయాలని ఎన్టీఏ కోరడంతో ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. నీట్-24 రద్దుపై దాఖలైన పిటిషన్‌పై సమాధానం చెప్పాలని కేంద్రం, ఎన్‌టీఏకు నోటీసులిచ్చింది. కౌన్సెలింగ్ మాత్రం ఆగదని స్పష్టం చేసింది.
కొసమెరుపు: నీట్ పై మొదటినుంచి ఇంత రగడ జరుగుతండగా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టీఏ) మంగళవారం నిర్వహించిన యూజీసీ నెట్ జూన్-2024 ను రద్దు చేసింది. అవకతవకలపై సీబీఐ దర్యాప్తునకూ ఆదేశించింది.