అంతా మోడీ మయం...నెహ్రూ చేసిందేంటి...!?
అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం లో బీజేపీ హడావుడి ఎక్కువ అయిందని జాతీయ స్థాయిలో విపక్షాలు విమర్శిస్తున్నాయి.
By: Tupaki Desk | 23 Jan 2024 3:52 AM GMTఅయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం లో బీజేపీ హడావుడి ఎక్కువ అయిందని జాతీయ స్థాయిలో విపక్షాలు విమర్శిస్తున్నాయి. మతపరమైన కార్యక్రమాన్ని ప్రధాని హోదాలో మోడీ ఎలా ప్రారంభిస్తారు అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయోధ్యలో మోడీ సహా బీజేపీ ప్రముఖులు అంతా హాజరై పూర్తిగా సొంత కార్యక్రమంగా చేశారని రాజకీయంగానే జరిగింది అంటున్నారు.
అంతా రామమయం అని అనాల్సిన చోట మోడీ మయం అయింది అని కూడా విమర్శిస్తున్నాయి. నిజానికి చూస్తే అయోధ్య రామమందిరం ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎవరికి ఆహ్వానలు ఎవరి చేత బాల రాముని విగ్రహం ప్రారంభించాలి అన్నది ట్రస్ట్ నిర్ణయించింది. స్వతహాగా బీజేపీ అయోధ్య కోసం పోరాడింది కాబట్టి ఆ పార్టీ ప్రధానికి ఆహ్వానం అందిందింది.
అలాగే దేశంలోని జాతీయ పార్టీలకు విపక్ష పార్టీలకు ఆహ్వానాలు పంపింది. అయితే ఈ కార్యక్రమానికి ఇండియా కూటమిలోని పార్టీలు కాంగ్రెస్ సహా అన్నీ హాజరు కాలేదు. జనవరి 22న ప్రతిపక్ష పార్టీలు ఏమి చేశాయని చూస్తే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మత సామరస్య యాత్రలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్నారు. అదే ఉత్తరప్రదేశ్ ని పాలిచిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ డుమ్మా కొట్టారు. బీహార్ మాజీ సీఎం లాలూ యాదవ్ సైతం వెళ్లలేదు. శరద్ పవార్ వంటి సీనియర్ నేతలు కూడా తాము వెళ్లమని చెప్పేశారు. ఇక కమ్యూనిస్టుల సంగతి సరేసరి
ఇలా ఎందుకు జరిగింది అంటే ఒకటి వారు చెప్పే మాట అక్కడ బీజేపీ మయంగా అంతా ఉందని. మరొకటి ఆలయ నిర్మాణం ఇంకా పూర్తి కాకముందే రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయడం మంచిది కాదని. ఏది ఏమైనా విపక్షాలు రాలేదు. అదే టైం లో విపక్షాల నుంచి ఒక పోలిక కూడా వస్తోంది.
ఆనాడు అంటే 1951లో పండిట్ నెహ్రూ దేశానికి ప్రధానిగా ఉండగా సోమనాధ్ ఆలయం నిర్మాణం జరిగింది. దానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి నెహ్రూకి ఆహ్వానం వస్తే ఆయన వెళ్లలేదు. అంతే కాదు తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ని సైతం ఆయన వెళ్లవద్దని సలహా ఇచ్చారు.
భారత దేశం లౌకిక దేశమని ఎన్నో మతాలు వాటిని విశ్వసించేవరూ ఉంటారని ప్రభుత్వానికి ఏ మతమైనా సమానమే అన్నది నెహ్రూ భావన అని విపక్షాలు అంటున్నాయి. మరి నేడు చూస్తే అయోధ్యలో అంతా దేశాన్ని ఏలే పార్టీ కార్యక్రమం గానే కనిపించిందని విపక్షాలు అంటున్నాయి. అక్కడే నెహ్రూకి ప్రస్తుత ప్రభుత్వానికి తేడా ఉందని అంటున్నాయి.
నరేంద్ర మోడీ ఈ కార్యక్రమలో పాలు పంచుకోవడం తనకు గర్వ కారణం అని అంటే నాడు నెహ్రూ మత కార్యక్రమాలకు దూరంగా ఉండడం ఉత్తమం అని అనుకునే వారని చెబుతున్నారు. ఇక ఆనాడు సోమ నాధ్ ఆలయం ప్రారంభం కూడా మీడియా మామూలు వార్తగానే చూసిందని నేడు కార్పోరేట్ శక్తుల చేతులలో ఉన్న మీడియా ఈ కార్యక్రమాన్ని బీజేపీ మెప్పు కోసం హైలెట్ చేసిందని అంటున్నాయి. ఏది ఏమైనా రాముడు అందరికీ దేవుడు. ఆ విషయంలో ఎవరికీ రెండవ మాట లేదని, అదే టైం లో పాలకులు మాత్రం మత కార్యక్రమాలకు దూరంగా ఉండాలని మతాన్ని రాజకీయాల్లోకి వాడుకోరాదని మేధావులు అంటున్నారు.
అయితే దీని మీద బీజేపీ వైపు వాదన కూడా మరోలా ఉంది. సోమనాధ్ ఆలయం సందర్భం వేరు. అయోధ్య సందర్భం వేరు అని అంటున్నారు. అయోధ్య వెనక అయిదు వందల ఏళ్ళ పోరాటం ఉందని, ఇది స్వాభిమానం కోసం జరిగిన పోరు అని అంటున్నారు. ప్రజలు అంతా కూడా సామరస్యంగా ఉండాలని కోరుకున్న పాలకులు ఇలాంటి కార్యక్రమాల ద్వారానే సందేశాన్ని ఇవ్వగలరని కూడా చెబుతున్నారు. ఏది ఏమైనా బీజేపీ విషయంలో విపక్షాలు విమర్శలు చేస్తూ దూరం జరిగాయి. బీజేపీ మాత్రం రాముడు మా వాడు అని అయోధ్యలో హాయిగా తన పని తాను పూర్తి చేసుకుంది అని అంటున్నారు.
ఇక మరో మాట కూడా ఉంది. ఇది కచ్చితంగా 1951 మాత్రం కాదు అనే వారూ ఉన్నారు. నాడు బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం పొందిన తరువాత కొత్తగా భారతీయ ప్రభుత్వం వచ్చింది. అయితే ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో హిందువుల మీద దాడులు పెరిగినా పట్టించుకోని సూడో సెక్యులరిజం పెత్తనమేలిందని, ఇపుడు హైందవ చైతన్యం వెల్లి విరిసిందని దాని ఫలితమే పాలకులు కూడా దిగి వస్తున్నారు అని అంటున్న వారూ ఉన్నారు.