పెళ్లికి నో చెప్పారని ప్రేయసి తండ్రిని చంపేశాడు
తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి.. ఆమె తండ్రి ఒప్పుకోని కారణంగా అతడ్నిదారుణంగా చంపేసిన దుర్మార్గం నెల్లూరులో చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 26 Jan 2025 6:30 AM GMTప్రేమ పేరుతో ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్న ధోరణి అంతకంతకూ ఎక్కువ అవుతోంది. నచ్చిన అమ్మాయిని సొంతం చేసుకోవటానికి దారుణాలకు పాల్పడుతున్న దుర్మార్గాలు పెరుగుతున్నాయి. తాజాగా చోటు చేసుకున్న క్రైం గురించి తెలిస్తే షాక్ కు గురి కావాల్సిందే. తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి.. ఆమె తండ్రి ఒప్పుకోని కారణంగా అతడ్నిదారుణంగా చంపేసిన దుర్మార్గం నెల్లూరులో చోటు చేసుకుంది. సంచలనంగా మారిన ఈ విషాద ఉదంతంలోకి వెళితే..
నెల్లూరు శ్రీనివాస్ నగర్ లో మహూబూబ్ బాషా అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఆ ప్రాంతానికి చెందిన సాదిక్ అనే యువకుడు ఉంటున్నాడు. అతడు బాషా కుమార్తె ను మనసు పడ్డాడు. అప్పటి నుంచి ఆమె వెంట పడుతున్నాడు. ఆమెను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చసుకుంటానని చెప్పేవాడు. మొదట్లో అతడి ప్రేమను ఆమె నో చెప్పింది. ఆ తర్వాత మాత్రం ఒప్పుకుంది.
ఇదిలా ఉండగా.. ఇటీవల సాదిక్ తాను ప్రేమించిన అమ్మాయి ఇంటికి వెళ్లాడు. తన ప్రేమ గురించి చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అందుకు భాషా నో చెప్పారు. ఆ తర్వాత పలుమార్లు అతడి ఇంటికి వెళ్లిన సాదిక్ కు.. వరుసగా నో అన్న మాటే ఎదురైంది. దీంతో సాదిక్ కోపంతో రగిలిపోయేవాడు. దీంతో.. ప్రేయసిని పెళ్లి చేసుకోవటానికి అడ్డుగా ఉన్న ఆమె తండ్రిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఇందులో భాగంగా కత్తిని కొన్న అతను.. పక్కా ప్లాన్ చేసుకొన్నాడు. కాపు కాచి భాషా మీద దాడికి పాల్పడి.. విచక్షణారహితంగా కత్తితో పొడిచేశాడు. తీవ్రంగా గాయపడిన భాషా.. రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకొని ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోవటం కోసం ఆమె తండ్రిని ఇంత దారుణంగా హత్య చేయటం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇలాంటి తీరు భయాందోళనకు గురి చేస్తున్నాయి.