Begin typing your search above and press return to search.

ఒకటి తగ్గింది.. అతిథి మర్యాద లేకుండా చేసింది? నెల్లూరులో యుద్ధం కంటిన్యూ

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంచి మాటకారి. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్ రెడ్డి మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

By:  Tupaki Desk   |   9 March 2025 3:00 PM IST
ఒకటి తగ్గింది.. అతిథి మర్యాద లేకుండా చేసింది? నెల్లూరులో యుద్ధం కంటిన్యూ
X

ఒకరు నెల్లూరు పెద్దారెడ్డి.. ఇంకొకరు నెల్లూరు టీడీపీ పెద్ద మంత్రి. ఈ ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా కొనసాగుతున్న అంతర్గత యుద్ధం ఇప్పుడు రోడ్డెక్కుతుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. తన నియోజకవర్గంలో భారీ ఎత్తున చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రజలే అతిథులుగా పిలిచి శంకుస్థాపనలు చేయించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికార పార్టీలో కలకలం రేపారు. పైకి ఆయన చెబుతున్న మాటలు ఆదర్శంగా కనిపిస్తున్నా, ఆయన కొట్టిన దెబ్బ తన పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే, సాక్ష్యాత్తూ మున్సిపల్ మంత్రి నారాయణకు పెద్ద దెబ్బగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో అంతా బాగున్నా, కార్పొరేషన్ లో ఒకటి తగ్గింది అంటూ పదేపదే ఆ మధ్య చెప్పిన శ్రీధర్ రెడ్డి.. ఆ ఒకటి తగ్గడానికి ప్రతీకారంగా ఇప్పుడు ‘అతిథి మర్యద’ తెరపైకి తెచ్చారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంచి మాటకారి. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్ రెడ్డి మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఆయనది విలక్షణ వ్యక్తిత్వంగా చెబుతారు. దూకుడుగా రాజకీయ చేయడంతోపాటు ప్రత్యర్థులను చిత్తుచేసేలా ఆయన పన్నే వ్యూహాలు ఒకంతట ఎవరికీ అంతుబట్టవు. ఈ శైలితోనే గత ప్రభుత్వంతో విభేదించి ఆయన టీడీపీలో చేరారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూనే అప్పట్లో తన ఫోన్ ట్యాపింగు జరుగుతోందని కోటంరెడ్డి చేసిన ఆరోపణలు భూకంపం తెప్పించాయి. ఇక నెల్లూరులో తిరుగులేదనుకున్న వైసీపీకి బీటలు వారాయి. కోటంరెడ్డి తర్వాత ఆ పార్టీ నుంచి కీలక నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి టీడీపీలో చేరారు. దీంతో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నెల్లూరులో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ పరిస్థితుల్లో కోటంరెడ్డికి టీడీపీలో మంచి స్థానం ఉంటుందని ఊహించారు. అయితే ఆయన అభిమానులు ఊహించిన దానికి ప్రస్తుతం జరుగుతున్నదానికి పొంతన లేకపోవడంతో శ్రీధర్ రెడ్డి మళ్లీ తన అస్త్రాలకు పదును పెడుతున్నట్లు చెబుతున్నారు.

నెల్లూరు నగరంలో రెండు నియోజకవర్గాలు ఉండగా, నెల్లూరు సిటీ నుంచి మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రూరల్ నియోజకవర్గానికి కోటంరెడ్డి ఎమ్మెల్యే. మున్సిపల్ మంత్రిగా నారాయణ రూరల్ నియోజకవర్గానికి రూ.40 కోట్లతో 105 పనులు మంజూరు చేశారు. తన నియోజకవర్గానికి ఏ ఏ పనులు కావాలో అడిగి తీసుకున్న కోటంరెడ్డి మంత్రి నారాయణకు మాత్రం గట్టి ఝలక్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. ఈ రోజు ఒకేసారి ప్రారంభమైన మున్సిపల్ పనులకు ప్రజలే అతిథులుగా ప్రకటించి మంత్రి నారాయణను పక్కన పెట్టేలా చేశారు కోటంరెడ్డి. ప్రజలు కాకుండా ఇంకెవరితో పనులు చేయించినా నారాయణతో డైరెక్ట్ ఫైటుకు దిగినట్లేనని సంకేతాలిచ్చినట్లు అవుతుందని భావించిన కోటంరెడ్డి తనదైన స్టైల్ లో ఇన్ డైరెక్ట్ స్ట్రోక్ ఇచ్చారని అంటున్నారు.

నెల్లూరు కార్పొరేషన్ లో రూరల్ నియోజకవర్గానికి చెందిన 26 డివిజన్లు ఉన్నాయి. అయితే కార్పొరేషన్ పై తన ఆథిపత్యం ఉండేలా మంత్రి నారాయణ వ్యవహరిస్తున్నారని గత కొంత కాలంగా కోటంరెడ్డి గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో కొద్ది నెలల క్రితం ఒకటి తగ్గింది అంటూ పుష్ప డైలాగ్ పేల్చి చర్చకు తెరలేపారు. అయితే వెంటనే టీడీపీ అధిష్టానం కలగజేసుకుని సర్దిచెప్పడంతో అప్పట్లో వివాదం టీ కప్పులో తుఫానులో తేలిపోయింది. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ ఉప ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పనిచేసినా, మళ్లీ ఇప్పుడు నారాయణ ప్రభావం లేకుండా చేసేలా కోటంరెడ్డి వేసిన వ్యూహమే అంతుబట్టడం లేదు. ఇద్దరి మధ్య గ్యాప్ కంటిన్యూ అవుతుందా? అనే సందేహాలకు మరోమారు తెరలేపింది. ఏది ఏమైనా నెల్లూరు పెద్దారెడ్డిగా చెప్పే కోటంరెడ్డి ఆలోచన ఏంటో? తక్షణం తెలుసుకోవాల్సివుంది. లేదంటే మళ్లీ పాత రోజులకు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని టీడీపీ కేడర్ హెచ్చరిస్తున్నారు.