అందరు మేయర్లది ఒక సమస్య .. ఆ మేయర్ ది !
కానీ నెల్లూరు మేయర్ స్రవంతికి మాత్రం ఆమె భర్త జయవర్దన్ ఒక ఐఎఎస్ ఆఫీసర్ సంతకం ఫోర్జరీ కేసు వెంటాడుతుంది.
By: Tupaki Desk | 26 July 2024 4:18 AM GMTఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి అందరు మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు ఒక సమస్య ఎదుర్కొంటుంటే ఆ మేయర్ మెడకు మాత్రం ఇంకో సమస్య చుట్టుకుంది. దీంతో దీన్నుండి బయటపడడం ఎలా అని తలపట్టుకుని కూర్చుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో అవిశ్వాస తీర్మానాలు తెరమీదకు వస్తున్నాయి. కానీ నెల్లూరు మేయర్ స్రవంతికి మాత్రం ఆమె భర్త జయవర్దన్ ఒక ఐఎఎస్ ఆఫీసర్ సంతకం ఫోర్జరీ కేసు వెంటాడుతుంది.
మేయర్ భర్త జయవర్దన్ నెల్లూరు కార్పోరేషన్ లో కొన్ని ఫైల్స్ సంతకాల విషయంలో ఫోర్జరీకి పాల్పడ్డాడన్న విషయం రాజకీయంగా దుమారం రేపింది. ఎన్నికలకు ముందు ఈ ఆరోపణలు వచ్చినా ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో దీనిపై విచారణ మొదలయింది. కార్పోరేషన్ పరిధిలో పలు భవనాలకు సంబంధించిన ఫైళ్లపై నెల్లూరు కార్పోరేషన్ కమీషనర్ వికాస్ మర్మత్ సంతకాలు ఫోర్జరీ అయినట్లు గుర్తించారు.
ఈ మేరకు విచారణ జరపాలని వికాస్ మర్మత్ విజిలెన్స్ అధికారులను కోరగా వారు విచారించి ఫోర్జరీ అయినట్లు గుర్తించారు. ఇందులో మేయర్ భర్త జయవర్ధన్ తో పాటు టౌన్ ప్లానింగ్ సిబ్బంది హస్తం ఉన్నట్లు తేలడంతో జిల్లా ఎస్పీకి కమీషనర్ వికాస్ మర్మత్ ఫిర్యాదు చేశారు. దీంట్లో ఏడుగురి పాత్ర ఉన్నట్లు పోలీసులు తేల్చారు. వీరందరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
దీంతో మేయర్ భర్త జయవర్ధన్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు. ఈ కేసులో అరెస్టుల నుండి తప్పించుకునేందుకు మేయర్ స్రవంతి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అమరావతిలో ఉన్న ఆమె నారా లోకేష్, నెల్లూరు మంత్రులను కలిసి కష్టాల నుండి బయటపడేయాలని కోరే ప్రయత్నాలలో ఉన్నట్లు తెలుస్తుంది. నెల్లూరు కార్పోరేషన్ లో గత ఎన్నికల్లో మొత్తం 54 స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో అందరు మేయర్లది ఒక సమస్య అయితే స్రవంతిది ఇంకో సమస్య అని పొలిటికల్ సర్కిల్ లో సెటైర్లు పేలుతున్నాయి.