భారత భూభాగాలతో కరెన్సీ.. నమ్మకమైన పొరుగు దేశం ద్రోహం
1950ల్లో నేపాల్ కు కలుపుకోమంటూ భారత తొలి ప్రధాని నెహ్రూకు ప్రతిపాదన వచ్చింది.
By: Tupaki Desk | 4 Sep 2024 11:30 AM GMT1950ల్లో నేపాల్ కు కలుపుకోమంటూ భారత తొలి ప్రధాని నెహ్రూకు ప్రతిపాదన వచ్చింది. అసలే సామ్యవాది అయిన ఆయన దీనిని అంగీకరించలేదు.
మతం అనేది ప్రస్తావనకు అనర్హం కానీ.. కొన్నిసార్లు చెప్పక తప్పదు. హిమాలయ దేశం నేపాల్ కు ఉన్న ప్రత్యేకత ఏమంటే.. ప్రపంచంలో ఏకైక హిందూ దేశం. భారత్ లోనూ హిందువులు అత్యధికంగా ఉన్నప్పటికీ భారత్ లౌకిక దేశం. అంటే భారత్ తో కల్చరల్ గా బాగా సాన్నిహిత్యం ఉన్న దేశం నేపాల్. అయితే, భౌగోళికంగా ఆ దేశం ఎంత దగ్గరో.. రానురాను అంత దూరం జరుగుతోంది. చైనా మాయలో పడి నిజమైన మిత్రుడిని వదులుకుంటోంది. కావాలని కయ్యానికి కాలు దువ్వుతోంది.
అప్పట్లో కలుపుకోమంటే..
1950ల్లో నేపాల్ కు కలుపుకోమంటూ భారత తొలి ప్రధాని నెహ్రూకు ప్రతిపాదన వచ్చింది. అసలే సామ్యవాది అయిన ఆయన దీనిని అంగీకరించలేదు. ఒకవేళ నెహ్రూ ఆ పని చేసి ఉంటే ఇప్పుడు మనకు ఈ స్టోరీ రాసుకోవాల్సిన అవసరం ఉండేది కాదేమో..? ఇంతకూ విషయం ఏమంటే.. నేపాల్ సెంట్రల్ బ్యాంక్.. భారత్ లో రిజర్వ్ బ్యాంక్ లాగ అన్నమాట. ఇప్పుడు నేపాల్ బ్యాంక్..భారత్ తో భూవివాదాన్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోంది. లిపు లేక్, కాలాపానీ, లింపియాదూర అనే భారత ప్రాంతాలను నేపాల్ భూభాగంలోనివిగా చూపుతూ కరెన్సీ ముద్రిస్తోంది. ఇప్పటికే ప్రింటింగ్ మొదలుపెట్టింది.
6 నెలల్లో కొత్త కరెన్సీ.. దానిపై భారత భూభాగాలు
నేపాల్ కొత్త కరెన్సీలో ఆరు నెలల నుంచి ఏడాదిలోపు పూర్తవుతుందని సమాచారం. వాస్తవానికి దీనికి నాలుగు నెల కిందటే.. అంటే మే 3నే నేపాల్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. లిపులేక్, కాలాపానీ, లింపియాదురాను తమ భూభాగాలుగా చూపుతూ మ్యాప్ లు విడుదల చేసింది. అప్పటికి ప్రధాని కేపీ శర్మ వోలీ ప్రభుత్వం తీర్మానం చేయగా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. భారత్ అభ్యంతరపెట్టినా పట్టించుకోలేదు. అంతేకాదు.. అధికారిక పత్రాల్లో వాడే మ్యాప్ లను సరికొత్త మ్యాప్ లతో భర్తీ చేస్తోంది.
ఈ మూడు ప్రాంతాలు వివాదాస్పదం
కాలాపానీ, లిపులేఖ్, లింపియాదురాపై చాన్నాళ్లుగా వివాదం నెలకొంది. ఇవి ఉత్తరాఖండ్‌లోని పితోడ్ గఢ్- నేపాల్ లోని దర్చులా జిల్లాల మధ్య ఉంటాయి. మహాకాళి నది వీటి మీదుగా ప్రవహిస్తోంది. 1816లో సుగౌలీ ఒప్పందంలో ఈ నదిని నేపాల్ పశ్చిమ సరిహద్దుగా గుర్తించారు. అనేక ఉప నదులు కలిసే కాలాపానీ.. ఓ ముక్కోణ కూడలి.. అంటే.. నేపాల్, చైనా, భారత సరిహద్దులు ఇక్కడ కలుస్తాయి. రక్షణపరంగా భారత్ కు అత్యంత కీలకం. కాగా, మహాకాళి నది జన్మస్థలం కాలాపానీనే. దీంతో పశ్చిమభాగం మొత్తం తమకు చెందినదనేది భారత్ వాదన. కానీ, తూర్పు ప్రాంతం అంతా నేపాల్ కిందకు వస్తుందని కొత్త వాదన మొదలుపెట్టింది. 1830కు సంబంధించిన పితోడ్ గఢ్ రికార్డులను భారత్ చూపుతోంది. 1879లో బ్రిటిష్ వారి పాలనలోని చిత్రపటం ప్రకారం కాలాపానీ మొత్తం భారత్ లోనే ఉంది. లిపులేఖ్ కనుమ దారిపైనా నేపాల్ రగడ చేస్తోంది. 1830 నుంచి తమ భూభాగమేనని భారత్ పేర్కొంటోంది. 1962లో చైనా చొరబాట్లతో ఈ కనుమ దారిని మూసేశారు. ఇక చైనా ఆక్రమించిన టిబెట్ లో కైలాస మానస సరోవరం ఉంది. భారతీయులు దీనికి సిక్కిం, ఉత్తరాఖండ్, నేపాల్ నుంచి వెళతారు.
చైనా ప్రోద్బలమే..
నేపాల్ తీరు వెనుక చైనా ఉన్నట్లు సమాచారం. ఆ దేశం ప్రోద్బలంతోనే భారత వ్యతిరేక వైఖరి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. నేపాల్ ను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు ప్రాజెక్టులు చేపడతూ డ్రాగన్ వలలో వేసుకుంటోంది.