Begin typing your search above and press return to search.

విశ్వసుందరి పోటీల్లో నేపాల్‌ యువతి... సైజ్ విషయంలో చరిత్ర సృష్టించింది!

అవును... మిస్ యూనివర్స్ 2023 ఈవెంట్‌ లో ప్లస్ సైజ్ మోడల్ జేన్ దీపికా గారెట్ సన్నగా ఉండే మోడల్‌ ను సవాలు చేస్తూ కనిపించింది.

By:  Tupaki Desk   |   21 Nov 2023 6:34 AM GMT
విశ్వసుందరి పోటీల్లో నేపాల్‌  యువతి... సైజ్  విషయంలో చరిత్ర సృష్టించింది!
X

అందాల పోటీల్లో పాల్గొనాలంటే పుట్టుకతోనే అమ్మాయి అయ్యి ఉండాలి.. జీరో సైజ్ ఉండాలి.. మాంచి హైట్ ఉండాలి.. వంటి మూస సూత్రాలను చెరిపేస్తూ తాజాగా జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో పలువురు సరికొత్త రికార్డులు సృష్టించారు. ఈ క్రమంలో ఈ పోటీల్లో ట్రాన్స్‌ జెండర్ల నుండి ప్లస్ సైజ్ మోడల్స్ వరకు పాల్గొన్నారు. ఈ క్రమంలో నేపాల్ యువతి సరికొత్త చరిత్ర సృష్టించారని అంటున్నారు.

అవును... మిస్ యూనివర్స్ 2023 ఈవెంట్‌ లో ప్లస్ సైజ్ మోడల్ జేన్ దీపికా గారెట్ సన్నగా ఉండే మోడల్‌ ను సవాలు చేస్తూ కనిపించింది. అంతేకాదు జేన్ దీపికా ఈ ఈవెంట్‌ లో తన ఆధిపత్యం చెలాయించింది. ఈ ఏడాది పోటీల్లో నేపాల్‌ దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన ఈమె ర్యాంప్‌ పై నడుస్తున్నప్పుడు అందరూ తదేకంగా చూస్తూనే ఉన్నారు. కారణం... ఆమె ప్లస్ సైజ్!

దీంతో ఈ పోటీల్లో పాల్గొన్న మొదటి ప్లస్ సైజ్ మోడల్‌ గా జేన్ దీపికా గారెట్ నిలిచింది. ఈమె తనదైన ప్రత్యక స్టైల్‌, స్మైల్ తో అందరినీ ఆకర్షించింది. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా పలువురిని ఆలోచింపచేశాయి. ఇందులో భాగంగా... అందానికి సైజు ముఖ్యమని భావించే వారు ఆ ఆలోచనను మార్చుకోవాలని ఆమె సూచించింది.

ఇదే సమయంలో... అందం అంటే బాడీ సైజు అనే ఆలోచన ఇక నుంచి అయినా ఫ్యాషన్ రంగం, మోడల్ ప్రపంచం మానుకోవాలని ఆమె కోరడం చర్చనీయాంశం అయ్యింది. ఈ విధంగా ఆమె బాడీ పాజిటివిటీని ప్రోత్సహించింది. ఈ పోటీల్లో జేన్ దీపికా గారెట్ దాదాపు 20 మంది పోటీదారులను ఓడించింది. హార్మోన్ల అసమతుల్యత కారణంగా పెరిగిన బరువును ఆమె బలహీనతగా భావించలేదని ప్రశంసలు అందుకుంది!

కాగా... ప్రతిష్ఠాత్మక "మిస్‌ యూనివర్స్‌" కిరీటం ఈ ఏడాది నికరాగ్వా భామ సొంతమైన సంగతి తెలిసిందే. 72వ మిస్‌ యూనివర్స్‌ టైటిల్‌ ను నికరాగ్వాకు చెందిన భామ షెన్నిస్ పలాసియోస్ కైవసం చేసుకున్నారు. ఇదే క్రమంలో థాయ్‌ లాండ్‌ కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్ మొదటి రన్నరప్‌ గా నిలవగా.. ఆస్ట్రేలియాకు చెందిన మోరయా విల్సన్ రెండో రన్నరప్‌ గా నిలిచారు.

ఈసారి ఎల్ సాల్వడార్ మిస్ యూనివర్స్ హోస్ట్ దేశంగా నిలిచింది. ఈ పోటీల్లో 84 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. వీరిలో భారత్ నుంచి పాల్గొన్న శ్వేతా శార్దా.. టాప్ 20లో నిలిచారు.