వైరల్ వీడియో... మేనల్లుడి ఎంగేజ్మెంట్ వేడుకలో జగన్ సందడి!
అనంతరం హైదరాబాద్ నుంచి బయలుదేరి రాత్రికి తాడేపల్లి నివాసానికి ప్రయాణమయ్యారు.
By: Tupaki Desk | 18 Jan 2024 4:47 PM GMTముందుగా షెడ్యూల్ ప్రకటించినట్లుగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. తన సోదరి షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థ వేడుకకు సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజారెడ్డి, ప్రియ నిశ్చితార్థ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం హైదరాబాద్ నుంచి బయలుదేరి రాత్రికి తాడేపల్లి నివాసానికి ప్రయాణమయ్యారు.
అవును... హైదరాబాద్ లోని గండిపేటలో గోల్కొండ రిసార్ట్స్ లో వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియతో నిశ్చయించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో పాల్గొనేందుకు రాజారెడ్డి మేనమామ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్ వచ్చారు. వైఎస్సార్ మరణం తర్వాత ఆ కుటుంబంలో జరుగుతున్న తొలి శుభకార్యం కావడంతో వైఎస్ కుటుంబ సభ్యులు ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా తన మేనల్లుడికి బొకే ఇచ్చి శుభాకాంక్షలు చెబుతున్న సమయంలో.. తన తల్లి, చెల్లి, బావ మొదలైన కుటుంబ సభ్యులను జగన్ గ్రూప్ ఫోటోకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మేనల్లుడిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. అనంతరం తన తల్లి విజయమ్మను హత్తుకున్న జగన్.. చెల్లి, బావతో పాటు అక్కడున్నవారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ బాయ్ చెబుతూ తాడేపల్లికి తిరుగు ప్రయాణమయ్యారు.
కాగా... రాజారెడ్డి, ప్రియాల వివాహం ఫిబ్రవరి 17న జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఈ వివాహ వేడుకను జైపూర్ లో ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఈ సందర్భంగా ఆ వివాహ వేడుకకు హాజరుకావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లను షర్మిల స్వయంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.