Begin typing your search above and press return to search.

అమెరికాలో పరిఢవిల్లుతోన్న బంధుప్రీతి.. బైడెన్, ట్రంప్ పోటా పోటీ!

ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్.. వచ్చే ఏడాది జనవరిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

By:  Tupaki Desk   |   2 Dec 2024 7:57 AM GMT
అమెరికాలో పరిఢవిల్లుతోన్న బంధుప్రీతి..  బైడెన్, ట్రంప్  పోటా పోటీ!
X

ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్.. వచ్చే ఏడాది జనవరిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సమయంలో.. తన టీమ్ ని తయారు చేసుకునే పనిలో సొంతవారికి పెద్ద కుర్చీలు వేస్తున్నారని.. మరోపక్క త్వరలో వైట్ హౌస్ ను ఖాళీ చేయాల్సిన జో బైడెన్ సొంత పనులు చక్కబెట్టుకునే పనిలో ఉన్నారనే చర్చ తాజాగా మొదలైంది.

అవును... వడ్డించేవాడు మనవాడైతే బంతిలో చివరన కూర్చున్నా అన్నీ అందుతాయన్నట్లుగా అమెరికాలో ట్రంప్, బైడెన్ ల కుటుంబ సభ్యులు, బంధువుల పరిస్థితి ఉందని అంటున్నారు. దీనికి కారణం... ప్రస్తుత అధ్యక్షుడు, కాబోయే అధ్యక్షుడు తీసుకున్న సంచలన నిర్ణయాలే. అవి ఏమేమిటి అనేది ఇప్పుడు చూద్దాం...!

మరికొద్ది రోజుల్లో అగ్రరాజ్యం అధ్యక్ష పీఠం నుంచి జో బైడెన్ దిగిపోనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. ఇందులో భాగంగా.. తన కుమారుడు హంటర్ బైడెన్ కు కేసుల నుంచి పూర్తి ఉపశమనం కల్పించారు. అక్రమంగా ఆయుధం కొనుగోలు సహా రెండు క్రిమినల్ కేసుల్లో ఆయనకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఆ సంగతి అలా ఉంటే... మరోపక్క, రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ తన టీమ్ ఏర్పాటులో బంధుప్రీతికి ప్రత్యేక స్థానం ఇస్తున్నారు! ఇందులో భాగంగా... తన ఇద్దరు వియ్యంకులకు కీలక బాధ్యతలు అప్పగించారు.

వీరిలో... లెబనీస్ – అమెరికన్ బిజినెస్ మ్యాన్ అయిన మసాద్ బౌలోస్ ను అరబ్, పశ్చిమాసియా వ్యవహారాల సీనియర్ సలహాదారుగా నియమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈయన డొనాల్డ్ ట్రంప్ కు స్వయానా వియ్యంకుడు. ఇతని కుమారుడు మైఖెల్ ను ట్రంప్ కుమార్తె టిఫానీ వివాహం చేసుకున్నారు.

ఇదే సమయంలో... మరో వియ్యంకుడు ఛార్లెస్ కుష్నర్ ను ఫ్రాన్స్ కు అమెరికా రాయబారిగా నియమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. తన్న కుమార్తె ఇవాంక ట్రంప్ భర్త జారెడ్ కుష్నర్ తండే ఈ ఛార్లెస్ కుష్నర్. ఈయన గతంలో ఓ కేసులో దోషిగా తేలగా.. ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో క్షమాభిక్ష ప్రసాదించారు.