సంధి దిశగా ఆ భీకర యుద్ధం..? ప్రపంచానికి బిగ్ రిలీఫ్
ఇది ఇలా ఉండగానే గత ఏడాది అక్టోబరులో మరో భీకర యుద్ధానికి పునాది పడింది.
By: Tupaki Desk | 25 Oct 2024 6:04 AM GMTరెండున్నరేళ్లుగా సాగుతోంది ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. ఇందులో విజేత ఎవరనేది ఎవరూ చెప్పలేరు. ఉక్రెయిన్ మాత్రం నిలువునా గాయపడింది. అలాంటి యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో అంచనా వేయడమూ కష్టమే అన్నట్లుంది. ఉక్రెయిన్ కు ఆయుధాల సరఫరా విషయంలో పశ్చిమ దేశాల వైఖరి మారనంత వరకు రష్యా ఆగదు. ఉక్రెయిన్ తాము నాటో కూటమిలో చేరబోము అని చెప్పేవరకు పుతిన్ విశ్రమించరు. ఇది ఇలా ఉండగానే గత ఏడాది అక్టోబరులో మరో భీకర యుద్ధానికి పునాది పడింది.
ఈ యుద్ధం అలాంది కాదు..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం పశ్చిమ దేశాలపైనే. ఎందుకంటే రష్యా నుంచి వాటికి గ్యాస్ సరఫరా అవుతుంది. కానీ, నిరుడు మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం విస్తరిస్తే దాని ప్రభావం యావత్ ప్రపంచంపై పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే.. హమాస్ కు మద్ధుతుగా ఇరాన్, కొన్ని గల్ఫ్ దేశాలు నిర్ణయాలు తీసుకుంటాయి. ఇక ఇజ్రాయెల్ యుద్ధం హమాస్ మీద నుంచి హెజ్బొల్లాల మీదకు మళ్లించింది. ఈ క్రమంలో ఇరాన్ ఐఆర్జీసీ సైనికులనూ హతమార్చింది. దీంతో ఇరాన్ రంగంలోకి దిగి ఇజ్రాయెల్ మీదకు రెండుసార్లు క్షిపణుల వర్షం కురిపించింది. వీటి మధ్యలో యెమెన్ హూతీలు ఉన్నారు. ఇలా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం పశ్చిమాసియా అంతటినీ ప్రమాదంలో పడేసే పరిస్థితి వచ్చింది. అందుకే ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం రష్యా-ఉక్రెయిన్ తరహా యుద్ధం కాదని చెప్పేది.
కాల్పుల విరమణ ప్రతిపాదన..
సరిగ్గా ఈ నెల 7వ తేదీ నాటికి ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ఏడాది పూర్తి చేసుకుంది. అయితే, ఇటీవల హమాస్ చీఫ్ సిన్వర్ ను హతమార్చడంతో మిలిటెంట్ గ్రూప్ నకు పెద్ద దెబ్బ తగిలినట్లయింది. అంతకుముందే హిజ్బొల్లా చీఫ్ నస్రల్లానూ ఇజ్రాయెల్ చంపేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ పైకి ఇరాన్ మద్దతుతో హమాస్, హిజ్బొల్లా, హూతీలు విరుచుకుపడతాయని భావించారు. అయితే, ఇప్పుడు ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణ దిశగా అడుగు వేస్తున్నట్లు చెబుతున్నారు. గాజాలో కాల్పుల విరమణ ఒప్పంద చర్చల్లో తమ నిఘా చీఫ్ పాల్గొంటున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది.
ఒప్పందం కుదిరితే..
సిన్వర్ మరణం కాల్పుల విరమణ ఒప్పందానికి అవకాశం కల్పిస్తుందని ఆమెరికా గతంలో పేర్కొంది. దీనికితగ్గట్లే ఒప్పందం కుదిరితే పోరాటం ఆపేస్తామని హమాస్ పేర్కొంటోంది. ఖతర్ రాజధాని దోహాకు చెందిన ప్రతినిధి బృందం కైరోలో ఈజిప్టు అధికారులతో గాజా సంధి ప్రతిపాదనలపై చర్చించినట్లు హమాస్ సీనియర్ అధికారి తెలిపారు. ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు కట్టుబడితే పోరాటాన్ని అభ్యంతరం లేదన్నారు. కాగా, యుద్ధం కారణంగా గాజా నుంచి వెళ్లిపోయిన ప్రజలను తిరిగి అనుమతించాలని.. ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని అంగీకరించడంతో పాటు గాజాకు మానవతా సాయానికి అడ్డు తొలగాలని షరతులు పెట్టారు.
బందీలు విడుదలవుతారా?
హమాస్ గ్రూప్ నిరుడు ఇజ్రాయెల్ పై దాడి చేసి 200 మందిని ఎత్తుకెళ్లింది. వీరిలో 100 మందిని విడుదల చేసింది. ఇంకా 100 మంది వరకు వారి వద్దఉన్నారు. ఇందులో ఎంతమంది జీవించి ఉన్నారో తెలియదు. కాగా, బందీల విడుదలకు ఒప్పందం కుదుర్చుకోవడాన్ని స్వాగతిస్తున్నాం అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. కైరోలో సమావేశం అనంతరం ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ చీఫ్ ను అజెండాలోని ముఖ్య కార్యక్రమాలను ముందుకుతీసుకెళ్లేందుకు ఖతర్ కు వెళ్లాలని ఆదేశించినట్లు నెతన్యాహూ కార్యాలయం తెలిపింది.