ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్... మరో లెవెల్ అంటున్న ప్రధాని... వీడియో వైరల్!
హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 15 Oct 2023 6:58 PM GMTహమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోన్న సంగతి తెలిసిందే. దొంగదెబ్బకు, చీకటి దెబ్బకు సరైన రివేంజ్ తీర్చుకునే వరకూ విశ్రమించేది లేదన్నట్లుగా ముందుకు దూసుకుపోతోంది. ఇదే సమయంలో హమాస్ అనే పదం వినిపించకుండా నిర్మూళించే వరకూ విశ్రమించేది లేదని ఇజ్రాయేల్ ప్రధాని నొక్కి వక్కానిస్తున్నారు. ఈ సమయంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
అవును... హమాస్ పై తాము చేస్తున్న దాడిని కొన్ని దశాబ్ధాలపాటు గుర్తుపెట్టుకుంటారని ఇజ్రాయేళ్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల తమ దేశంలోని నిరిం ప్రాంతంలో జరిపిన మారణకాండకు బాధ్యుడైన హమాస్ కీలక కమాండర్ బిలాల్ అల్ కేద్రాను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ వాయుసేన తాజాగా వెల్లడించింది.
ఈ సమయంలో తొమ్మిదో రోజు యుద్ధం కొనసాగుతున్న సైనికులను సందర్శించి వారిలో మనోధైర్యాన్ని పెంచారు నెతన్యాహు! హమాస్ ను సర్వనాశనం చేసి గానీ విశ్రమించేది లేదని ఇప్పటికే స్పష్టం చేసిన నెతన్యాహు.. యుద్ధంలో మరోస్థాయికి సమయం ఆసన్నమైందని సైనికులకు తెలిపారు. అందుకు అంతా సిద్ధమా అని ప్రశ్నించారు. అందుకు అంగీకారం తెలిపారు. ఈ సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని సైనికులతో కరచాలనం చేశారు.
ఈ విధంగా... యుద్ధంలో మరోస్థాయికి వెళుతున్నామని ప్రధాని, సైనికులకు తెలిపిన వీడియో బయటకు వచ్చింది. ఈ సందర్భంగా... గాజాను ఖాళీ చేయాలని పౌరులను హెచ్చరించిన ఇజ్రాయెల్.. యుద్ధాన్ని వేరే లెవెల్లో ఉద్ధృతం చేయనున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో హమాస్ ను దాని నాయకత్వాన్ని నిర్మూలించడానికి ఇజ్రాయెల్ సన్నద్ధమవుతోందని తెలుస్తుంది.
ఇప్పటికే గ్రౌండ్ అటాక్ పై ఒక నిర్ణయానికి వచ్చిన ఇజ్రాయేల్ సైన్యం... మరో రెండు మూడు రోజుల్లో అది మొదలుపెట్టబోతోందని తెలుస్తుంది. ఇస్మాయిల్ హనియే తర్వాత రెండవ స్థానంలో ఉన్న హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్ ను నిర్మూలించడం ఈ అటాక్ ముఖ్య ఉద్దేశ్యం అని అంటున్నారు. అదే ప్రధాన లక్ష్యంగా ముందుకు కదలబోతోన్నారని తెలుస్తోంది.
ఇదే సమయంలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను ఈ దాడుల ద్వారా కాపాడుకోవాలని భావిస్తోన్న ఇజ్రాయేల్ సైన్యంలో ఇప్పటికే 10,000 మంది ఇప్పటికే గాజాలో అడుగుపెట్టగా.. మరో 30,000 మంది గాజా సరిహద్దులో వెయిటింగ్ అని అంటున్నారు. వీరితో పాటు అవసరమైన యుద్ధ సామగ్రిని, యుద్ధ ట్యాంకులను సరిహద్దుకు చేర్చారని సమాచారం.
అంటే పక్కాగా... హమాస్ "ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ బ్యాటిల్"కు ప్రతీకారంగా ఇజ్రాయెల్ "ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్" గురించి నిశ్చయించుకున్నట్లు కన్ క్లూజన్ ఇస్తున్నారు.
కాగా... అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్ పై రాకెట్ దాడులు చేయడంతో యుద్ధం ఆరంభం అయిన సంగతి తెలిసిందే. నాటినుంచి తొమ్మిది రోజులుగా జరుగుతున్న యుద్ధంలో ఇరుపక్షాల వైపు 3,200 మంది మరణించగా.. ఇజ్రాయెల్ లో 1,300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో... పాలస్తీనాలో 1,900 మంది మరణించారు.