Begin typing your search above and press return to search.

పవన్ ప్రాయశ్చిత్త దీక్ష దేని కోసం ?

వీటి మీదనే సుప్రీం కోర్టులో ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు టీటీడీ తరఫున సరైన సంతృప్తికరమైన జవాబు ఇవ్వలేకపోయారు.

By:  Tupaki Desk   |   30 Sep 2024 5:09 PM GMT
పవన్ ప్రాయశ్చిత్త దీక్ష దేని కోసం ?
X

ఏపీలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందా అంటే అది అనుమానంగానే ఉంది. దాని మీద ఆధారాలు అయితే లేవు. అలాగే లడ్డూ ప్రసాదం లో కలిసిందా అంటే వాటిని పరీక్షనే చేయించలేదు. వీటి మీదనే సుప్రీం కోర్టులో ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు టీటీడీ తరఫున సరైన సంతృప్తికరమైన జవాబు ఇవ్వలేకపోయారు.

దాంతో ఇది కేవలం రాజకీయ విమర్శగానే ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో లడ్డూ ప్రసాదంలో నిజంగా కల్తీ జరిగి భక్తుల మనోభావాలతో పాటు ఆ దేవుడికి అపచారం జరిగితే ప్రాయశ్చిత్త దీక్ష చేసినా అర్థం ఉంటుంది. కానీ ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ హడావుడిగా ప్రాయశ్చిత్త దీక్ష అని ప్రకటించారు.

కాషాయం కట్టేశారు. ఆ వెంటనే మీడియా ముందుకు వచ్చి సనాతన ధర్మం అంటూ ప్రసంగాలు చేశారు. ఇవన్నీ ఇపుడు ఎంతవరకూ సహేతుకం అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అంతవరకూ ఎందుకు సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ప్రాయశ్చిత్త దీక్షను తప్పు పట్టారు.

సుప్రీం కోర్టులో ఈ కేసి విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయ స్థానం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆధారాల కంటే ఈ అంశంలో అనుమానాలు అంచనాలే ఎక్కువగా ఉన్నాయని తేలుతోంది. ప్రభుత్వంలో ఉన్న వారు పెద్దలు ఏ విషయం మీద అయినా సరే పూర్తిగా నిర్ధారించుకున్న మీదటనే మీడియా ద్వారా ప్రజలకు చెప్పాలి.

కానీ కూటమిలో అలా జరగలేదు. కల్తీ నెయ్యి ట్యాంకర్లు వచ్చాయి వాటిని తిప్పి పంపించామని టీటీడీ చెప్పిన రెండు నెలల తరువాత ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఆ విషయం చెప్పారు. అది కూడా ల్యాబ్ రిపోర్టులలో జంతువుల కొవ్వు లడ్డూలో కలిసింది అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అది సైతం ఎన్డీయే మీట్ లో అంటే ఒక రాజకీయ సమావేశంలో చెప్పారు.

ఆ తరువాత మీడియా ముందు కూడా చెప్పారు. ఈ విధంగా ఆయన చెప్పడం మీద సుప్రీం కోర్టు తప్పు పట్టింది. ఇది కోట్లాది మంది ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వారు చేయాల్సింది కాదు అన్నది ఒక అభిప్రాయంగా ఉంది.

మరి సీఎం చెప్పాక వరసబెట్టి అంతా అతి ఉత్సాహం ప్రకటించారు. తెలంగాణాలో ఏ సమస్యలూ లేనట్లుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పెద్ద నోరు చేశారు. అక్కడ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష అంటూ సిద్ధపడిపోయారు. దీనిని అంతా చూసిన వారు ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లుగా ఉందని ఇపుడు అంటున్నారు. ఈ విషయంలో ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న పవన్ ఏమి జరిగింది అని చేస్తున్నారు అన్న ప్రశ్నలు నెటిజన్లు సంధిస్తున్నారు.

ఆయన ప్రభుత్వంలో ఉన్నారు. ఇలాంటివి జరిగినపుడు దీక్షలు కాకుండా విచారణ జరిపించాలని కూడా అపుడే అంతా సూచించారు. కానీ పవన్ మాత్రం దీక్షలను ఎంచుకున్నారు. ఆయన వ్యక్తిగతంగా దీక్షలు చేస్తే ఎవరూ కాదనరు కానీ ఆయన కీలకమైన బాధ్యతలతో ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నారు.

ఇక రాజకీయాల్లోకి దేవుడిని తేకూడదు అని సుప్రీం కోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలతో అయినా చిత్తాలను ప్రాయశ్చిత్తాలను వేరే పనుల మీద పెట్టాలని కూడా సూచనలు వస్తున్నాయి. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకునే హక్కు కానీ దెబ్బ తీసే హక్కు కానీ ఎవరికీ లేదు అని కూడా అంటున్నారు.

ఇక పోతే హిందూ ధర్మం గురించి కానీ హిందువుల గురించి కానీ సనాతన ధర్మాల గురించి విధానాల గురించి చెప్పేందుకు హిందూ ధర్మాచార్యులు మఠాధిపతులూ పీఠాధిపతులూ ఉన్నారని అన్ని వర్గాల కోసం పనిచేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి గదెనెక్కిన పాలకులు చేయాల్సిన పనులు అవి కానే కావు అని అంటున్నారు. ఆ గీతను తెలుసుకుని సంయమనంతో ఇక మీదట దేవాలయలు ధర్మాల విషయంలో ఎవరైనా వ్యవహరించాలని కూడా నెటిజన్లు సూచిస్తున్నారు.