ఊరు కాలిపోతుంటే నీళ్లు వృధా చేసారు.. స్టార్లపై ఫైర్..
ఇలాంటి సమయంలో అవసరానికి మించి నీళ్లను వృధా చేసినందుకు పలువురు స్టార్లకు నెటిజనులు చీవాట్లు పెడుతున్నారు.
By: Tupaki Desk | 12 Jan 2025 8:30 PM GMTఓవైపు దావానలంలో ఊరు తగలబడుతోంది.. ప్రజలు ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఇలాంటి సమయంలో అవసరానికి మించి నీళ్లను వృధా చేసినందుకు పలువురు స్టార్లకు నెటిజనులు చీవాట్లు పెడుతున్నారు. ఇదంతా అమెరికా -లాస్ ఏంజెల్స్ లోని దావానలంలో చిక్కుకున్న ప్రాంతాల పరిస్థితి.
LA కాలిపోతుండగా విలువైన నీటిని వృధా చేసినందుకు పలువురు హాలీవుడ్ స్టార్లు తీవ్ర విమర్శల్ని ఎదుర్కొన్నారు. సాధారణ నివాసితులు తమ ఇళ్లను రక్షించుకోవడానికి కష్టపడుతుంటే.. కిమ్ కర్దాషియాన్, సిల్వస్టర్ స్టాలోన్, కెవిన్ హార్ట్ వంటి తారలు చాలా అత్యవసరమైన నీటి వనరులను వృథా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓవైపు సాధారణ నివాసితులు మనుగడ కోసం పోరాడుతుండగా విలువైన నీటి వనరులను వృధా చేస్తారా?అంటూ నెటిజనులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. 2022 నుండి లాస్ ఏంజెల్స్‌లో నీటి వనరుల విషయంలో కఠినమైన చట్టాలు అమలులో ఉన్నప్పటికీ విలాసవంతమైన మల్టీ మిలియన్ డాలర్లతో నిర్మించిన ఇళ్లలో నివసించే పలువురు స్టార్లు నీరు వృధా చేయడంపై ఆగ్రహం వెల్లువెత్తింది.
లాస్ ఏంజిల్స్ అంతటా నీటి పొదుపు చర్యలు అమల్లో ఉన్నాయి. సాధారణ నివాసితులు వారానికి రెండుసార్లు మాత్రమే వారి తోటలకు ఎనిమిది నిమిషాలు నీరు పెట్టడానికి అనుమతి ఉంది. అయినా కానీ ది ఓక్స్‌లోని 60 మిలియన్ల అమెరికన్ డాలర్ల ఖరీదు చేసే భారీ భవనంలో నివసిస్తున్న కిమ్ కర్దాషియాన్ తనకు కేటాయించిన మొత్తానికి మించి 2,32,000 గ్యాలన్ల నీటిని ఉపయోగించినందుకు అధికారులు జరిమానా విధించారు. కర్దాషియన్ మాత్రమే కాదు.. సిల్వెస్టర్ స్టాలోన్ , హాస్యనటుడు కెవిన్ హార్ట్, ఇతర యాక్షన్ స్టార్లు కూడా నీటి పరిమితులను మించిపోయినందుకు జరిమానాలు చెల్లించారు. ఇది ప్రజాగ్రహాన్ని మరింత పెంచింది. నీటి కష్టాలను లెక్క చేయక విలాసాలను ఆస్వాధిస్తున్నారని ప్రజలు వారిపై విరుచుకుపడ్డారు. ఎల్.ఏ లోని సంపన్న వ్యక్తులు తమ భవనాలను ఆక్రమణ మంటల నుండి రక్షించుకోవడానికి గంటకు 2000 అమెరికన్ డాలర్ల చొప్పున చెల్లిస్తూ ప్రైవేట్ అగ్నిమాపక సిబ్బందిని నియమించుకోవడంపైనా వివాదం చెలరేగింది.
మాండెవిల్లే కాన్యన్, బ్రెంట్‌వుడ్‌లోని సాధారణ కుటుంబాలు పాలిసేడ్స్ అగ్నిప్రమాదం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నా కానీ.. చాలా మంది అలాంటి సేవలను పొందలేకపోతున్నారు. ఇప్పుడు ధనిక పేద తారతమ్యాన్ని తాజా ఘటన బహిర్గతం చేసింది. పైన పేర్కొన్న ప్రదేశాల నుంచి సామాన్యులు పారిపోతున్నారు. సన్‌సెట్ బౌలేవార్డ్‌లో మంటల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న నివాసితులు భారీ ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకున్నారు. వేలాది మంది అంతకంతకు పెరుగుతున్న అగ్నిప్రమాదం నుండి పారిపోవడానికి ప్రయత్నించడంతో తరలింపు మార్గాలు స్తంభించిపోయాయి.
నివాసిత ప్రాంతాల్లోకి మంటలు సమీపిస్తున్న కొద్దీ నగరంలోని ఉన్నత వర్గాలకు.. శ్రామిక తరగతి నివాసితులకు మధ్య అంతరం ఎన్నడూ లేనంత స్పష్టంగా కనిపించింది. సంపన్న సెలబ్రిటీలు తమ ఇళ్లను రక్షించుకునేందుకు నీటిని వృధా చేస్తున్నా.. చాలా మంది కనీస సహాయం లేని ధీన స్థితిని ఎదుర్కోవడం తీవ్ర విమర్శలకు తెర తీస్తోంది.