పొంగులేటి బాంబులన్నీ తుస్ పటాకలేనా..! ఇంకా పేలకపాయె మంత్రి గారూ..!!
దాంతో ప్రభుత్వంలోని పెద్దలు, కాంగ్రెస్ పార్టీ తరఫున లీడర్లు బీఆర్ఎస్ వైఖరిని తప్పుపడుతూనే ఉన్నాయి. ఇటు హైడ్రా, అటు మూసీ విషయంలోనూ బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నమే చేశారు.
By: Tupaki Desk | 31 Oct 2024 4:30 PM GMTతెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పాలిటిక్స్ నడుస్తున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనికీ అడ్డుపడుతూనే ఉన్నారు గులాబీ నేతలు. దాంతో ప్రభుత్వంలోని పెద్దలు, కాంగ్రెస్ పార్టీ తరఫున లీడర్లు బీఆర్ఎస్ వైఖరిని తప్పుపడుతూనే ఉన్నాయి. ఇటు హైడ్రా, అటు మూసీ విషయంలోనూ బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నమే చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు.
మరోవైపు.. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై దృష్టి సారించింది. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల పాలు చేయడంపై ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వం ఖర్చు చేసిన విధానాన్ని ఒక్కొక్కటిగా బయటకు లాగుతోంది. ఏసీబీ, సీబీఐలతోనూ విచారణ చేయిస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతల్లో ఒకింత ఉత్కంఠ వాతావరణం కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా... మూసీ సుందరీకరణ నిమిత్తం సౌత్ కొరియా రాజధాని సియోల్‌లోని చుంగ్ గై వాగు, హాన్ నదులను రాష్ట్ర మంత్రుల బృందం సందర్శించింది. వీటి మోడల్‌లోనే మూసీని ప్రక్షాళన చేపట్టాలని ప్రభుత్వం భావించింది. అయితే.. ఇదే పర్యటనకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం వెళ్లారు. మరో రెండు రోజుల్లో తిరిగి వచ్చే సందర్భంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
రెండు రోజుల్లోనే.. అంటే తాము హైదరాబాద్ చేరుకునే లోపు.. లేదంటే చేరుకున్నాక వెంటనే రాష్ట్ర రాజకీయాల్లో బాంబులు పేలబోతున్నాయని సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పటికే పలు కీలక అంశాలపై విచారణ పూర్తయిందని, ప్రముఖుల అరెస్టులు జరగబోతున్నాయని చెప్పారు. దీపావళి పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయని అన్నారు. ధరణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంతోపాటు ఎనిమిది నుంచి పది అంశాల్లో నిజాలు నిగ్గు తేల్చి ప్రజల ముందు ఉంచబోతున్నామని తెలిపారు. దాంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అటు బీఆర్ఎస్ నేతల్లోనే టెన్షన్ వాతావరణం కనిపించింది. రాష్ట్రంలో ఏం జరగబోతోందని అప్పటి నుంచి ఆసక్తిగా చూస్తూనే ఉన్నారు.
సియోల్ పర్యటన ముగించుకొని మంత్రుల బృందం హైదరాబాద్ చేరుకుంది. వారు వచ్చి కూడా ఆరు రోజులు గడుస్తోంది. కానీ.. ఇంతవరకు ఎలాంటి సంచలనం నమోదు కాలేదు. ఇంతవరకు ఒక్క అరెస్టు కూడా జరగలేదు. మునుపటి లాగే పాలిటిక్స్ నడుస్తున్నాయి తప్పితే.. పొంగులేటి చెప్పినట్లుగా పొలిటికల్ బాంబులు అయితే పేలలేదు. దీంతో పొంగులేటి చెప్పిన తుస్ పటాకలేనా అన్న విమర్శలు నడుస్తున్నాయి. ఇంకెప్పుడు బాంబులు పేలుతాయి మంత్రి గారు అంటూ సెటైర్లు నడుస్తున్నాయి. మరోవైపు.. బీజేపీ నేతలు కూడా పొంగులేటిపై ఫైర్ అయ్యారు. కేవలం మీడియాలో పబ్లిసిటీ కోసమే.. పతాక శీర్షికన కనిపించేందుకే మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. విచారణ ముగిసిందనప్పుడు ఎందుకు అరెస్టులు చేయడం లేదని, అవినీతిపరుల అరెస్టును స్వాగతిస్తామని చెప్పుకొచ్చారు. వెంటనే వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరి మంత్రి చెప్పినట్లు ఆ బాంబులు ఎప్పుడు పేలుతాయి..? ఎవరు అరెస్ట్ కాబోతున్నారు..? అసలు అరెస్టులు ఉన్నాయా..? అంటే సమాధానాలు చెప్పే వారు కరువయ్యారు.