జగన్ ఆ ఫీలింగ్ ని తెలుసుకోలేకపోయారా ?
ఆయన ఇపుడు ఉప ముఖ్యమంత్రిగా వచ్చారు. గతంలో అంటే 2018లో పవన్ ప్రజా పోరాట యాత్రలు అని ఉత్తరాంధ్ర జిల్లాలలో ప్రారంభించారు.
By: Tupaki Desk | 22 Dec 2024 4:30 PM GMTఎవరు అయినా పదవిలో ఉంటేనే దర్జా దర్పం వస్తాయి. జనాలకు అయినా నాలుగు మంచి పనులు చేయగలుగుతారు. విపక్షంలో ఉన్నపుడు కేవలం హామీలు మాత్రమే ఇవ్వగలుగుతారు. అదే అధికారంలోకి వచ్చాక మాట నిలబెట్టుకుని జనం ముందుకు వస్తే ఆ ఫీలింగే వేరబ్బా అని అంటున్నారు. మరి ఆ ఫీలింగ్ గురించి జగన్ కి తెలియదా అన్న చర్చ అయితే వస్తోంది.
ఎందుకంటే ఉత్తరాంధ్రాలోని మన్యం ప్రాంతాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఆయన ఇపుడు ఉప ముఖ్యమంత్రిగా వచ్చారు. గతంలో అంటే 2018లో పవన్ ప్రజా పోరాట యాత్రలు అని ఉత్తరాంధ్ర జిల్లాలలో ప్రారంభించారు. అపుడు ఆయన అరకు పాడేరుతో పాటు ఇతర గిరిజన ప్రాంతాలలో తిరిగి అక్కడ ప్రజల కష్టాలను కళ్లారా చూశారు.
తాను అధికారంలోకి వస్తే మేలు చేస్తాను అని నాడు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లాలో అతి పెద్ద రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. తొమ్మిది కోట్ల రూపాయలు దీనిని వెచ్చిస్తున్నారు. అలాగే అల్లూరి జిల్లాలో ఏకంగా 29 రోడ్లకు ఒకేసారి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తనకు ఇది ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. తాను అధికారంలోకి వస్తే నాలుగు రోడ్లు అయినా వేయాలని అనుకున్నానని కానీ ఏకంగా 29 రోడ్లకు శ్రీకారం చుట్టడం గొప్ప విషయం అన్నారు.
ఇక నారా లోకేష్ ని తీసుకుంటే ఆయన మంత్రి అయ్యాక ఏకంగా ప్రజా దర్బార్ నే నిర్వహిస్తున్నారు. తన వద్దకు వచ్చిన వారి సమస్యలను ఆయన అధికారం అండతో పరిష్కరిస్తున్నారు. అలా ప్రతీ రోజూ ఎంతో మందికి ఆయన తృప్తిని ఇస్తున్నారు. ప్రజా నాయకుడిగా ఆయన ఈ విధంగా తనకు దక్కిన పవర్ తో ఎక్కువ మేలు జనాలకు జరిగేలా చూస్తున్నారు. అది స్వయంగా చేస్తూ ఆ సంతృప్తిని తాను కళ్లారా చూస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సంగతి చెప్పనవసరం లేదు. ఆయన విపక్షంలో ఎంత కష్టపడతారో అధికార పక్షంలో ఉన్నపుడు అంతకు మించి కష్టపడతారు. ఆ విధంగా సీఎం కాగానే ఆయన జనంలోనే ఉంటున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రతీ నెలా ఠంచనుగా సామాజిక పెన్షన్ల పంపిణీలో పేద కుటుంబం ఇంటికి వెళ్లి మరీ పరామర్శిస్తున్నారు. అంతే కాదు ఏ పధకం అయినా పేదలతో కలసే అమలు చేస్తున్నారు.
ఆయన తన పర్యటనలలో ప్రజలను నేరుగా కలుసుకుంటున్నారు వారి సాధకబాధకాలు ఆలకిస్తున్నారు. అక్కడికక్కడ పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. ఇది కదా అధికారంలో ఉన్న వారు చేయాల్సింది అని అంతా అంటున్నారు. వైసీపీకి అధికారం దక్కింది, జగన్ రెండేళ్ల పాటు పాదయాత్ర చేసి సాధించుకున్న అధికారం అది.
అయితే సీఎం గా జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసు దాటి బయటకు రాలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆయన బయటకు వచ్చి మీటింగులు పెట్టినా పరదాలు అడ్డుతో దూరంగానే ఉండిపోయారు. మరి పవన్ లోకేష్ చంద్రబాబు మాదిరిగా ఆయన కూడా ఎందుకు జనం మధ్యకు రాలేకపోయారు అన్నది చర్చకు వస్తున్న విషయం.
తాను పాదయాత్రలో ఫలనా హామీ ఇచ్చాను ఇపుడు అక్కడ సమస్యను పరిష్కరించండి అని స్వయంగా వచ్చి జనం సమక్షంలో అధికారులకు ఆదేశాలు ఇచ్చి చేసి చూపిస్తే ఆ కిక్కే వేరు కదా అన్నది వైసీపీలోనూ ఉన్న మాటగానే ఉంది. ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజల కోసమే వాడుతూ వారి మధ్యనే ఉంటేనే కదా ప్రజా నాయకుడికి విలువ దక్కేది అని అంటున్నారు
ఎక్కడో కూర్చుని ఆదేశాలు ఇవ్వడం వల్ల ఆయా ఫలితాలు నూరు శాతం జనాలకు దక్కినా కూడా జగన్ వచ్చి కనిపించలేదని ఆయన స్వయంగా ఇచ్చి ఉంటే బాగుండేది అన్నది జనంలో అసంతృప్తిగా ఉండిపోదా అన్నదే చర్చ మరి. నాయకుడికి జనానికి మధ్య బంధాన్ని ఏ పవరూ విడదీయకూడదు, అలా జరిగితే అది ఇబ్బందులే సృష్టిస్తుంది.
పైపెచ్చు అధికారమనే మంత్రదండంతో ప్రజా సమస్యలను తీరుస్తున్నపుడు ఆయా నేతలు పొందే అనుభూతే వేరు కదా అంటున్నారు. దానిని లెక్కబెట్టడానికి ఏ కొలమానమూ సరిపోదు కదా అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా జగన్ ఇంత మంచి ఫీల్ ని మిస్ చేసుకున్నారనే వైసీపీలోనూ అనుకుంటున్న మాటగా ఉంది.